అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దు

– ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ ప్రకటిస్తాం
– ఏటా ఉపాధ్యాయ నియామకాలు
– యూఎస్‌పీసీ మహాధర్నాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
– బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యారంగం విధ్వంసం : హరగోపాల్‌
– రాజ్యాంగబద్ధంగా లేని పాలన అంతం కావాలి : కోదండరామ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తాము అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి చెప్పారు. ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్‌ను ప్రకటిస్తామన్నారు. ఉద్యోగ విరమణను దృష్టిలో ఉంచుకుని నియామకాల ప్రక్రియను చేపడతామని వివరించారు. ఏటా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు. సర్కారు బడుల్లో స్వీపర్లు లేరు, స్కావెంజర్లు లేరు, ఉపాధ్యాయుల కొరత, విద్యావాలంటీర్ల నియామకం లేదని విమర్శించారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసుకోలేని దుస్థితిని చూస్తే తెలంగాణను ఎందుకు కోరుకున్నామో అనిపిస్తోం దని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎస్‌ రద్దు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ‘ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ)’ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌ లోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. దీనికి అన్నిజిల్లాల నుంచి వేలాదిగా ఉపాధ్యాయులు తరలొచ్చారు. యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కె జంగయ్య, వై అశోక్‌ కుమార్‌, ఎం సోమయ్య, యు పోచయ్య, సయ్యద్‌ షౌకత్‌ అలీ, కొమ్ము రమేష్‌, జాదవ్‌ వెంకట్రావు, ఎస్‌ హరికిషన్‌, జాడి రాజన్న, బి కొండయ్య,అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో చేర్చుతామని చెప్పారు. విద్యారంగం పట్ల, ఉపాధ్యాయుల నియామకం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నదని విమర్శించారు.
33 జిల్లాల్లో ముగ్గురు డీఈవోలే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారని అన్నారు. మిగిలిన చోట్ల ఇన్‌చార్జీలున్నారనీ, డిప్యూటీఈవో, ఎంఈవో పోస్టుల్లోనూ అదే పద్ధతి కొనసాగుతున్నదని వివరించారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ బీశ్వాల్‌ కమిటీ తేల్చిందనీ, అందులో పాఠశాలల్లోని ఖాళీలే 22 వేలున్నాయని చెప్పారు. 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామంటూ సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ 5,089 పోస్టులను భర్తీ చేస్తామంటూ విద్యాశాఖ మంత్రి ప్రకటించారని వివరించారు. ఖాళీ పోస్టు ల్లో విద్యావాలంటీర్లను నియమించకుండా విద్యార్థుల కు నాణ్యమైన విద్య అందించడం లేదన్నారు. ఒకటో తేదీన జీతాలివ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజాప్రతి నిధుల ఆరోగ్య బాధ్యత ఎలా ఉందో ఉద్యోగులు, ఉపాధ్యా యులకూ అదే కొనసాగించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మెడలు వంచి ఐక్యంగా హక్కులు సాధించుకోవాలని చెప్పారు.
ప్రజల అవసరాల కోసమే పాలన సాగాలి : కోదండరామ్‌
రాజ్యాంగ బద్ధంగా, ప్రజల అవసరాల కోసమే పాలన సాగాలని టీజేఎస్‌ అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. కానీ పాలకుల ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజ నాల కోసమైతే అలాంటి పాలనను అంతం పలకాలని చెప్పారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే అందరూ ఉద్యమించారని గుర్తు చేశారు. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదనీ, దాన్ని ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. రూ.40 వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేశారని వివరించారు. తాగునీటి సౌకర్యం లేని గ్రామాలకే భగీరథ నీళ్లు ఇస్తే సరిపోయేదనీ, దానికి రూ.1,200 కోట్లు ఖర్చయ్యేదని గుర్తు చేశారు. అన్ని గ్రామాలకూ భగీరథ నీళ్లు ఇచ్చారనీ, అందుకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. అందుకే రూ.నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కాళేశ్వరం నిర్వహణకు రూ.20 వేల కోట్లు, అప్పుల వడ్డీలకు రూ.20 వేల కోట్లు కలిపి రూ.40 వేల కోట్లు ప్రతినెలా వ్యయ మవుతుందని వివరించారు. రాబడితో వాటికి మొదటి ప్రాధాన్యత, తర్వాత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాకే ఉద్యోగులకు జీతాలిస్తున్నా రని చెప్పారు. అందుకే మొదటి తేదీన రావాల్సిన జీతం ఆలస్యంగా వస్తున్నదని అన్నారు. ప్రభుత్వ బడులను పరి రక్షించాలనీ ఉపాధ్యాయులు, ఖాళీలను నింపాలని నిరు ద్యోగులు పోరాడుతున్నారని చెప్పారు. అయితే ఉద్యమాలు తీవ్రతరమైతే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందంటూ వాటిని అణచివేస్తున్నదని వివరిం చారు. డబ్బులు పంచి ఎన్నికల్లో మళ్లీ గెలవాలని బీఆర్‌ఎస్‌ చూస్తున్నదని అన్నారు. స్థానికత కు తూట్లు పొడుస్తూ 317 జీవోను ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. రాజ్యాంగ బద్ధంగా పాలన చేయాలనీ, నిధులు ఖర్చు పెట్టాలని కోరారు. అలా చేయకుంటే ఈ పాలనను సహించేది లేదన్నారు.
ప్రజాబలంతో ఏ ప్రభుత్వమైనా దిగొస్తుంది : హరగోపాల్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యారంగాన్ని విధ్వంసం చేసిందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ విమర్శించారు. విద్య పట్ల సీఎం కేసీఆర్‌కు ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కాలేజీలు, ప్రయివేటు కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు మాఫియాగా మారిపో యాయని విమర్శించారు. ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయాలు చేసే స్థాయికి ఎదిగాయని చెప్పారు. విద్యా రంగంపై ఈ ప్రభుత్వానికి ఓ విధానమే లేదన్నారు. పేద పిల్లలకు చదువెందుకు అన్న ధోరణి కనిపిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిర్వీర్యమైందనీ, పోలీసు ల చేతిలో అధికారముందని చెప్పారు. పెన్షన్‌తో ఉద్యోగు లకు ఆత్మగౌరవం వస్తుందన్నారు. అందుకే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచబ్యాంకు షరతుల్లో భాగంగానే సీపీఎస్‌ను తెచ్చారనీ, అయితే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మాత్రం ప్రపంచబ్యాంకు పెన్షన్‌ వస్తున్నదని గుర్తు చేశారు. వృద్ధాప్యంలో గౌరవంగా జీవించాలంటే పెన్షన్‌ ఉండాల న్నారు. సంఘటిత పోరాటంతోనే సమస్యలు పరిష్కార మవుతాయని చెప్పారు. ప్రజాబలంతో ఏ ప్రభుత్వమైన దిగొస్తుందన్నారు. పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి సంధ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ వరకే పరిమితం కాకుండా ప్రజాఉద్యమంగా మారాలని చెప్పారు. సామాజిక కార్యకర్త సజయ మాట్లాడుతూ ఉప్యాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
ఐఆర్‌ ప్రకటించాలి
టీఏపీఆర్‌పీఏ అధ్యక్షులు పి కృష్ణమూర్తి, టీఎస్‌ సీపీఎస్‌టీఈఏ అధ్యక్షులు దాముక కమలాకర్‌, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు, యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చావ రవి, పి నాగిరెడ్డి, టి లింగారెడ్డి, డి సైదులు, పి రాజయ్య, ఎన్‌ యాదగిరి, డి రాజనర్సుబాబు, మేడి చరణ్‌దాస్‌, మసూద్‌ అహ్మద్‌, ఎ గంగాధర్‌, బి మహేశ్‌, వి శ్రీనునాయక్‌, కె బిక్షపతి, వై విజయకుమార్‌, శాగకైలాసం, చింతా రమేష్‌, కె రామారావు, ఎం రామారావు, ఎ గణేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. 2004, సెప్టెంబర్‌ ఒకటి కంటే ముందు ఎంపికై ఆలస్యంగా నియామకమైన డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు, ఇతర శాఖల్లోని ఉద్యోగులకు పాతపెన్షన్‌ వర్తింపచేయాలని కోరారు. రెండో పీఆర్సీని వెంటనే నియమించాలనీ, జులై ఒకటి నుంచి మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించాలని చెప్పారు. ఉపాధ్యా యుల బదిలీలు, పదోన్నతుల కోడ్‌ను రూపొందించాలని సూచించారు. పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్‌పై ఉన్న న్యాయవివాదాల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసు కోవాలని కోరారు. 5,571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలన్నారు. ఈహెచ్‌ఎస్‌ పథకానిఉన ఉద్యోగులపై భారం పడకుండా సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. 317 జీవో అమలు కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులను వారి స్వంత జిల్లాలు, జోన్లకు బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. 317 జీవో అమలు అనంతరం బ్లాక్‌ చేసిన 13 జిల్లాల స్పౌజ్‌ బదిలీలను నిర్వహించాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మొదటి తేదీన వేతనాలు, పెన్షన్‌ చెల్లించాలని చెప్పారు. ట్రెజరీల్లో ఆమోదం పొంది ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల సప్లిమెంటరీ బిల్లులకు నగదును వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో పాఠశాలల్లో ఖాళీగా ఉనఉన 22 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను, 2015లో హేతుబద్ధీకరణ సందర్భంగా సర్‌ప్లస్‌ పేరుతో డీఈవో పూల్‌లో ఉంచిన మరో ఆరు వేల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఓట్‌ ఫర్‌ ఓపీఎస్‌ అని అన్నారు.