సోషల్ మీడియా మన దైనందిన జీవితంలో అంతర్భాగమైంది. ఒకప్పుడు ఫొటోల షేరింగ్, చాటింగ్ వరకే పరిమితమైన సోషల్ మీడియా- ప్రస్తుతం రోజువారీ రాజకీయ పరిణామాలు సహా అన్నిరకాల విశేషాలకు వేదికగా వుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి దీనిని మలుచుకుంటున్నాయి. అంతేకాదు..ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే ఉద్యమాలు, నిరసనలకు ఇది వేదిక కూడా. దేశంలోని అత్యధిక విజువల్ మీడియాను బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తున్న మోడీ సర్కార్ కన్ను ఇప్పుడు సోషల్ మీడియాపై పడింది. ‘సోషల్ మీడియా అనేది అంతిమ సమీకరణం. దీనిలో నిమగం కావాలనుకునేవారికి ఇది గొంతుక అవుతుంది’ అంటారు అమి జో మార్టిన్. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటానికి, ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన నిరసనలకు ఎంతగానో తోడ్పడింది. బీజేపీ ప్రభుత్వం రెండు సమ్మెలను నిరంకుశంగా అణిచివేసేందుకు యత్నించినప్పుడు సోషల్ మీడియా వేదికగా నిరసనాగ్రహాలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సివచ్చింది.
ట్యునీషియా వంటి దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజావెల్లువ రావడంలో సోషల్ మీడియా కీలక భూమిక వహించింది. నియంతలను అధికారం నుండి తరిమికొట్టడానికి ప్రజల చేతిలో వజ్రాయుధంగా మారింది. గ్రీస్, స్పెయిన్, ఇజ్రాయిల్లో కార్మికుల నిరసనలు, గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న విధ్వంసకాండ వంటి పలు అంశాలను కార్పొరేట్ మీడియా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తే, సోషల్ మీడియా ఆ గుట్టును రట్టు చేసింది. ముఖ్యంగా భారతదేశంలో పాలకులు తమ ఎజెండాకు అనుగుణంగా నకిలీ వార్తలు, వక్రీకరించిన వాస్తవాలు, తప్పుడు ప్రచారాలను వ్యాప్తిచేయడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని నినదిస్తున్న రైతు సంఘాల ఆందోళనను అణిచివేయడంలో భాగంగా ప్రభుత్వం సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. రైతు నాయకులు, రైతు సంఘాలు, జర్నలిస్టులు, మీడియా సంస్థలు తమ సోషల్ మీడియా ఖాతాలను ఉపసంహరించు కోవాలని కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపడమే ఇందుకు ఉదాహరణ.
ఒక్క ‘ఎక్స్’ (ట్విటర్)కే కేంద్ర ఐటీ-ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటివరకు 177 నోటీసులు అందాయి. ట్వీట్లను ఉపసంహ రించుకోవాలని, ఖాతాలను మూసివే యాలని లేని పక్షంలో చర్యలు తప్పవని బెదిరించింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాలకు కూడా రైతు నిరసన పోస్ట్లు, వీడియోలు, చిత్రాలను ఉపసంహరించు కోవాలని కేంద్రం నుండి ఇటీవల నోటీసులు వెళ్లాయి. మరీ దారుణమైన విషయమేమిటంటే, 2020-21 రైతుల నిరసనపై రూపొందించిన ‘కిసాన్ సత్యాగ్రహ’ డాక్యుమెంటరీ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మార్చి ఒకటిన ప్రదర్శించాల్సి వుండగా, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆ ప్రదర్శనను అడ్డుకుంది. ‘నేను వజ్రాల ధరకు గాజును కొనుగోలు చేయను. మానవత్వంపై దేశభక్తి గెలవడానికి నేను ఎన్నటికీ అనుమతించను’ అన్న ఠాగూర్ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం ఎంతైనా సముచితం. గతంలోనూ నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్పై తీసిన ‘భారతీయ తార్కికుడు’ అనే డాక్యుమెంటరీనీ ఇలాగే అడ్డుకున్నారు.
చివరికి గూగుల్ ఏఐ సాధనం ‘జెమిని’పై కూడా కేంద్రం జోక్యం చేసుకుంది. ‘మోడీ ఫాసిస్టు కాదా?’ అని అడిగితే, ‘ఆయన విధానాలు ఫాసిస్టు తరహాలోనే ఉన్నాయని’ జెమిని సమాధాన మివ్వడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. జమ్మూ-కశ్మీర్ విభజన విషయంలో, మణిపూర్ విషాదంలో- నెలల తరబడి ఇంటర్నెట్ను నిషేధించారు. రైతుల సమ్మె దృష్ట్యా ఎటువంటి కారణం లేకుండా హర్యానా, యూపీ, రాజస్థాన్లలో ప్రభుత్వం ఇంటర్నెట్ను బంద్ చేసింది. 2012 నుండి 2023 మధ్యకాలం వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 741 సార్లు ఇంటర్నెట్ నిషేధించబడింది. ఒక్క ఇంటర్నెట్ బ్యాన్ వల్ల దేశానికి జరిగిన ఆర్థిక నష్టం దాదాపు రూ.5వేల కోట్లు. మోడీ పాలనలో భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఎలా కుంచించుకు పోతున్నాయో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
-ఫీచర్స్ అండ్ పాలిటిక్స్
సోషల్ మీడియాపై అణచివేత
11:14 pm