– కాలిబూడిదైన ఇద్దరు పైలెట్లు ..
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
శిక్షణలో ఉన్న హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కూలిపోవడంతో ఇద్దరు పైలెట్లు కాలి బూడిదైన సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రావెల్లి గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగింది. ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని దుందిగల్ ఎయిర్‌ఫోర్స్ నుంచి శిక్షణ నిమిత్తం బయలుదేరిన హెలిక్యాప్టర్.. తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రావెల్లి గ్రామ శివారులోకి రాగానే దానిలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో టాటా కాఫీ పరిశ్రమ సమీపంలోని రాళ్ల గుట్టల్లో హెలికాప్టర్ కూలిపోయింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో హెలికాప్టర్ పూర్తిగా కాలి బూడిదైంది. ఇద్దరు పైలెట్లు అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటనలో మృతి చెందిన ఇద్దరు పైలెట్లు.. వియత్నాంకు చెందిన అభిమన్యూరారు, ఇతర దేశానికి చెందిన ఉవాన్‌టైమ్‌గా గుర్తించారు. కాగా, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఫైర్ ఇంజన్ల ద్వారా అదుపులోకి తీసుకొచ్చారు. కాలిబూడిదైన శవాలను పంచనామా నిమిత్తం అక్కడి నుంచి తరలించారు. అనంతరం ఘటనా స్థలాన్ని ఎయిర్‌ఫోర్స్ అధికారులు అధీనంలోకి తీసుకుని ప్రమాద వివరాలను సేకరించారు.