ప్రతిపక్షపాలిత రాష్ట్రాల్లోని గవర్నర్లు కేంద్రంలోని పాలక పార్టీ రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే సాధనాలుగా వ్యవ హరిస్తున్నారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యకలాపాలు నెరవేరకుండా ఇబ్బందులు పెట్టడమే పనిగా పెట్టు కున్నారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్ పాత్ర తీవ్ర విఘాతం కలిగించేది గాను, అసహ్యకరంగాను ఉంది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఎనిమిది బిల్లులను ఆయన ఆమోదం తెలపడం కానీ, బిల్లులను పున:పరిశీలన కోసం అసెంబ్లీకి తిరిగి పంపడం కానీ చేయకుండా అలానే తొక్కిపట్టి ఉంచుతున్నారు. వీటిలో రెండు బిల్లులను రెండేళ్లుగా ఆయన వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తొక్కిపట్టుకు కూర్చొన్న పంజాబ్ గవర్నర్ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ, గవర్నర్‌కు అలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది.
ఇదే అంశంపై కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, దీనిపై ఒక నివేదిక ఇవ్వాలని రాజ్‌భవన్ కార్యదర్శిని ఆదేశించింది. ఇంతలో గవర్నరు ఒక బిల్లుకు ఆమోదం తెలిపి, మిగతా ఏడు బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300 ప్రకారం, కొన్ని బిల్లులను మాత్రమే రాష్ట్రపతికి పంపవచ్చు కాబట్టి ఇది ఒక మోసపూరిత చర్య. ఈ బిల్లులను రాష్ట్రపతికి పంపడం ద్వారా, వాటిని శాశ్వతం గా పాతర వేయడానికి వీలు కల్పించడమే. రాష్ట్రపతికి నివేదించిన బిల్లులకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో తెలీదు. ఇందుకు సంబం ధించి రాజ్యాంగంలో నిర్దిష్ట కాలపరిమితి ఏదీ లేనందున వాటిని నిరవధికంగా నిలిపివేయబడతాయి.
ఇటువంటి చర్యల ద్వారా అసెంబ్లీ శాసన నిర్మాణ అధికారా లను అడ్డుకోవడంతో పాటు, ఖాన్ ఇప్పుడు ఆరెస్సెస్- బీజేపీ సిబ్బందితో విశ్వవిద్యాలయ నిర్ణయాధికార సంస్థలను నింపేందుకు బరితెగించారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ హోదా లో గవర్నర్ విశ్వవిద్యాలయ సెనేట్‌లో నిర్దిష్ట సంఖ్యలో నామినేటెడ్ సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. కేరళ యూనివర్శిటీ విషయానికి వస్తే, 23 మంది నామి నేటెడ్ సభ్యులలో, 17 మందిని ఛాన్సలర్, ఆరుగురిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. 17 నామినేటెడ్ సీట్లలో ఇద్ద రు హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, నలుగురు ప్రతి భావంతులైన విద్యార్థులు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు, సాంస్కృతిక సంస్థలు, మీడియాకు చెందినవారు ఉన్నారు. సాధారణంగా, నామినేషన్ ప్రతిపాదనలను విశ్వవిద్యాల యం పంపుతుంది. అలా వచ్చిన జాబితాను ఛాన్సలర్ ఆమోదిస్తారు. ప్రత్యేకించి ఈ విషయంలో యూనివర్సిటీలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులనే వర్శిటీ అధికారులు ప్రతిపాదించడం జరిగింది.
అయితే, ఈ కేసులో ఛాన్సలర్‌గా, అన్ని సంప్రదాయాలు, ప్రజాస్వామిక నిబంధనలను గవర్నరు తుంగలో తొక్కారు. యూని వర్శిటీ ప్రతిపాదించిన పేర్లను తిరస్కరిస్తూ, ఇద్దరు మినహా అన్ని సెనేట్ సీట్లను సంఘ్‌పరివార్‌కు చెందిన వ్యక్తులతో నింపేశారు. గవర్నర్ నామినేట్ చేసిన వారిలో ఆరెస్సెస్ అధ్యాపక పరిషత్ ఆఫీస్ బేరర్లు అయిన ఉపాధ్యాయులు ఉన్నారు. పాత్రికేయులు, క్రీడలు, న్యాయవాదులు, సాంస్కృతిక వ్యవహారాల కేటగిరీలలో కూడా ఆరెస్సెస్, బీజేపీకి చెందిన పురుషులు, మహిళలను నియ మించారు. మరీ దారుణమైన విషయమేమిటంటే హ్యుమానిటీస్, సైన్స్, ఆర్ట్స్, స్పోర్ట్స్ విభాగాల్లో మెరిట్ ప్రాతి పదికన యూనివర్సిటీ ఎంపిక చేసి పంపిన నలుగురు విద్యార్థుల స్థానంలో ఆరెస్సెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఏబీవీపీకి చెందిన నలుగురు విద్యార్థులను గవర్నరు నామినేట్ చేయడం. కాలికట్ యూనివర్శిటీ సెనేట్‌కు కూడా అదే పద్ధతిలో నామినేట్ చేశారు. ఇక్కడ కూడా ఆరెస్సెస్, బీజేపీకి చెందిన వారే నామినేట్ అయ్యారు.
కేరళలోని ఉన్నత విద్యాసంస్థలను కాషాయీకరించేందుకు గవర్నరు ఈ విధంగా బరితెగించడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), యువజన, ఉపాధ్యాయ సంఘాలు, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ తీవ్రంగా నిరసించాయి. కాలేజీలు, యూనివర్సిటీ క్యాంపస్ లలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన విద్యార్థుల ఆందోళనలు ఉధృతమ య్యాయి. నలుగురు ఏబీవీపీ విద్యార్థులను సెనేట్‌కు ఎంపిక చేసిన గవర్నరు చర్యపై హైకోర్టు ఇప్పటికే స్టే విధించింది. విద్యార్థుల నుంచి పెద్దయెత్తున నిరసనలు వ్యక్తమవడంపై గవర్నర్ అసహ నంతో రగిలిపోయారు. తన దురుసు ప్రవర్తనతో ఘర్షణలు సృష్టించేందుకు యత్నించారు. ఆర్ఎస్ఎస్ ప్రాయోజిత ట్రస్ట్ కార్య క్రమంలో పాల్గొనేందుకు కాలికట్ యూనివర్శిటీని సందర్శిస్తానని ఆయన ప్రకటించారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో కాకుండా క్యాంపస్‌లోని యూనివర్శిటీ గెస్ట్‌హౌస్‌లో బస చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. విద్యార్థులు నిరసన తెలిపితే వారిని ముఖ్యమంత్రి పంపిన క్రిమినల్స్ అంటూ వారిని దుర్భాషలాడ నారంభించారు. గెస్ట్‌హౌస్‌లో బీజేపీ నేతలతో సమావేశమైన అనంతరం ఆయన రాజ్‌భవన్ ద్వారా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు, అందులో ”రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాం గం పతనానికి ఇది నాంది” అని పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించే విషయం గురించి మాట్లాడారు.
ఉన్నత విద్యను కాషాయీకరించేందుకు గవర్నరు చేస్తు న్న యత్నాలకు వ్యతిరేకంగా భారతీయ విద్యార్థి ఫెడరేషన్, ఇతర ప్రజాస్వామిక సంస్థలు నిరంతర పోరాటం సాగి స్తుండగా, కాంగ్రెస్, దాని అనుబంధ విద్యార్థి సంఘం అ త్యంత గర్హనీయమైన వైఖరిని తీసుకున్నాయి. నామినేటెడ్ సీట్లను ఆరెస్సెస్‌తో భర్తీ చేసిన గవర్నర్ చర్య తప్పు అని కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కెఎస్‌యు) కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పటివరకు ఖండించిన పాపాన పోలేదు.. వారి గుడ్డి మార్క్సిస్ట్ వ్యతిరేక వైఖరి ఆరెస్సెస్ సిబ్బంది ఉన్నత విద్యలో చొరబాటును, దాని వల్ల ఉన్నత విద్యకు ఎదురయ్యే ముప్పును విస్మరించేలా చేస్తుంది. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రవర్తన రాజ్యాం గబద్ధమైన ఆ పదవిలో ఉండే వ్యక్తి పాటించాల్సిన నియమ నిబంధ నలన్నిటినీ ఉల్లంఘించేదిగా ఉంది. ముఖ్యమంత్రిపైనా, రాష్ట్ర ప్రభుత్వం పైనా ఆయన చేస్తున్న బెదిరింపులు, దూషణలను కేరళ ప్రజలు సహించరు. గవర్నర్ దిక్కుమాలిన చర్యలను ఉపయోగిం చుకుని రాష్ట్రంలో తన ప్రభావాన్ని పెంచుకోవచ్చని బీజేపీ భావిస్తే అంత కంటే దారుణమైన పొరపాటు ఇంకొకటి ఉండదు.
(పీపుల్స్ డెమొక్రసీ సంపాదకీయం)