– జిల్లా జడ్జి ఎంవీ రమేష్
– విభాగాల సమన్వయంతో మాదకద్రవ్యాల నివారణ
– కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
నవతెలంగాణ-ఆసిఫాబాద్
మాదకద్రవ్య రహిత సమాజం తయారు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన మిషన్ పరివర్తనలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ డివి శ్రీనివాసరావు, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మాదకద్రవ్యాల నివారణ ప్రతిజ్ఞ చేయించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ యువత 3ఎల్ (లవ్, లస్ట్, లిక్కర్) పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు మాదకద్రవ్యాలు యువతపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని అన్నారు. చదువు కంటే సంస్కారం గొప్పదని, యువత సంస్కారం నేర్చుకోవాలన్నారు. కోర్టుకు వచ్చే అనేక కేసులు మాదకద్రవ్యాలతో ముడిపడి నేరాలు చేస్తున్నవే అని గుర్తుచేశారు. మాదకద్రవ్యాలకు అలవాటైన వారిని నివారించేందుకు ప్రత్యేకంగా జిల్లాలో చికిత్స కేంద్రం ఉందని వారిని రక్షించడానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మాట్లాడుతూ మాదకద్రవ్యాలు మొదట ఉచితంగా దొరికి తర్వాత అలవాటుగా మారుతుందన్నారు. జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలు ఒకసారి వాడితే బానిస అవుతారన్నారు. యువత అప్రమత్తంగా ఉండి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. తాత్కాలిక ఆనందాన్ని విడనాడాలన్నారు. ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో 90శాతం నేరాలు సెల్ ఫోన్లు నార్కోటిక్స్ వాడడం వల్లనే జరుగుతున్నాయన్నారు. వాటిని నివారించగలిగితే నేర నియంత్రణ సాధ్యమవుతుందని, దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని దహెగాం మండలంకు చెందిన చిన్నారిపై జరిగిన అత్యాచార సంఘటనలో కూడా గంజాయి ప్రధాన పాత్ర వహించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అవగాహన లేకపోవడంతో గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు దొరుకుతున్నాయని, దీంతో కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ నుండి కుమురం భీమ్ చౌక్ మీదుగా గాంధీ చౌక్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి భాస్కర్, జిల్లా విద్యాధికారి అశోక్, డీఎస్పీ సదయ్య, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దహెగాం: మాదవ ద్రవ్యాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని ఎస్‌ఐ కందూరి రాజు అన్నారు. మండల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే ఆ విద్యార్థి సమాజం తిరోగమనంలో పయనిస్తోందని అన్నారు. దూరంగా ఉంటే మంచిదని తెలిపారు. ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమైన మత్తు పదార్థాలు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు పాకిందన్నారు. మత్తు పదార్థాలు వివిధ రూపంలో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు చేరుతున్నాయన్నారు. డ్రగ్స్, గంజాయి విక్రయించిన, వినియోగించిన నేరమేనని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అమరేందర్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి: అంతర్జాతీయ మారక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండలంలోని కేజీబీవీ పాఠశాలలో మారకద్రవ్యాల నిర్మూలన పై విద్యార్థులకు ఎస్‌ఐ నరేష్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయనతో పాటు ఏఎస్‌ఐ యాదవ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
సిర్పూర్(టి): మండల కేంద్రంలో మిషన్ పరివర్తన అనే పేరుతో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూనియర్ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అజరు ఉల్లం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, ఎస్సై రమేష్, పోలీస్ సిబ్బంది, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పెంచికల్‌పేట్: అంతర్జాతీయ మారక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, ఎల్లూరు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మారకద్రవ్యాల నిర్మూలనపై ఎస్సై కొమురయ్య అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విజయ నిర్మల, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కౌటాల: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో యువకులు భాగస్వాములు కావాలని సీఐ సాధిక్ ఫాష అన్నారు. ప్రపంచ మత్తు పదార్థాల దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. యువత మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ రూరల్: విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కాగజ్‌నగర్ రూరల్ సీఐ అల్లం రాంబాబు సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేఖ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కోయవాగులోని మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఇందులో కాగజ్‌నగర్ రూరల్ ఎస్సై సోనియా, విద్యార్థులు పాల్గొన్నారు
రెబ్బెన: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కల్పించారు. అనంతరం సీఐ చిట్టిబాబు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పోలీసు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.