ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిపై కార్యాచరణ రూపొందించండి

–  సీఎం రేవంత్‌రెడ్డికి జూలకంటి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌ హామీ ప్రకారం ఆరు మాసాలలోపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతికి (నెలకు నాలుగువేలు) అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సీపీఐ(ఎం) మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈమేరకు ఆదివారం సీఎం రేవంత్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకుని ఇంత కాలం వేచి చూస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం వల్ల వయోపరిమితి దాటి ఒక తరం యువత ఉద్యోగాలు పొందే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. వారు శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా, వైద్య రంగాల్లో కలిపి దాదాపుగా 40వేల పోస్టులు ఖాళీలున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలలు, యూనివర్సిటీల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఆస్పత్రుల్లో పోస్టులు ఖాళీ ఉండటం వల్ల ఈ రంగాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడ్డాయని తెలిపారు.పేద, మధ్య తరగతి, ప్రజలకు కనీస సౌకర్యాలు అందక చాలా ఇబ్బందులకు గురౌతున్నారని పేర్కొన్నారు.టీఎస్పీఎస్సీలో గతంలో జరిగిన అవకతవకల మూలంగా గ్రూపు-2కు గతంలో నిర్వహించిన పరీక్షలు రద్దు చేశారని తెలిపారు. తిరిగి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు.గ్రూపు-3కి నిర్వహించిన పరీక్షా ఫలితాలను, గ్రూపు-4 పోస్టులకు కూడా నోటిఫికేషన్‌ విడుదల చేయాలని పేర్కొన్నారు. హామీమేరకు జాబ్‌ క్యాలెండర్‌ రూపొందించి కాలపరిమితిలో భర్తీ చేయాలని కోరారు.