మార్గదర్శకాలు రూపొందించండి

–  రాష్ట్రపతి పరిశీలనకు బిల్లులు పంపడంపై సుప్రీంను కోరిన కేరళ
న్యూఢిల్లీ : రాష్ట్ర శాసన సభ ఆమోదించి పంపించిన బిల్లులను గవర్నర్‌ ఎంతకాలంలో ఆమోదిం చాలనే అంశానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. గవర్నర్‌ ఎంతకాలం తన వద్ద బిల్లులను రిజర్వ్‌ చేయవచ్చునో, రాష్ట్రపతి పరిశీలనకు ఎంతకాలంలో పంపించాలో, ఎంతకాలంలో అసెంబ్లీకి తిప్పి పంపాలి అనే అంశాలపై స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరింది. అత్యున్నత న్యాయస్థానంలో గతంలో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌కు సవరణ చేయడం ద్వారా ఈ అంశాలను తాజాగా కేరళ ప్రభుత్వం లేవనెత్తింది. రాజ్యాంగంలోని 200వ అధికరణంలోని మొదటి నిబంధనలో ఉన్న సాధ్యమైనంత త్వరగా అనే పదబంధాన్ని, గవర్నర్‌కు సమర్పించిన బిల్లుల పరిష్కారానికి వర్తించే టైమ్‌లైన్‌ అంశంలో కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కేరళ కోరింది. కేరళ ప్రభుత్వం పంపించిన ఎనిమిది బిల్లులను రెండేళ్లపాటు పరిశీలించకుండా వాటిని ఎందుకు రిజర్వ్‌ చేశారని నవంబర్‌ 20న సుప్రీంకోర్టు గవర్నర్‌ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అనంతరం ఏడు బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్‌ పంపించారని కోర్టు దృష్టికి కేరళ ప్రభుత్వం తీసుకొచ్చింది. తమ పరిశీలన కోసం పంపిన బిల్లులపై గవర్నర్‌ ఏళ్ల తరబడి నిష్క్రియాపరంగా వ్యవహరించారని, రాజ్యాంగం ప్రకారం తనకు సమర్పించిన అధికారాలను, విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారని కేరళ ప్రభుత్వం తరపున సికె శశి తాజా పిటిషన్‌లో పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను మరింత ఆలస్యం చేయకుండా పరిష్కరించేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరారు. ఆర్టికల్‌ 200 ప్రకారం సాధ్యమైనంత త్వరగా బిల్లులను ఆమోదించకుండా, గవర్నర్లు బిల్లులను పెండింగ్‌లో ఉంచడం వల్ల అనేక రాష్ట్రాలు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. క్రిస్మస్‌ సెలవుల అనంతరం సుప్రీంకోర్టు ఈ కేసును పరిగణనలోకి తీసుకునే అవకాశముంది.