దసరాకు క్రికెట్‌ ధమాకా

Cricket is a blast for Dussehra– ఉప్పల్‌లో రేపు భారత్‌, బంగ్లా టీ20
– తెలుగు అభిమానుల్లో కనిపిస్తున్న జోష్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలంగాణ క్రికెట్‌ అభిమానులకు పూల పండుగ, పరుగుల పండుగ ఒకే రోజు వచ్చింది. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. హైదరాబాద్‌ అంటే బిర్యాని, చారుతో పాటు క్రికెట్‌ కూడా గుర్తుకొచ్చేలా ఇక్కడి అభిమానులు స్టేడియానికి పోటెత్తుతారు. ఇప్పుడు ఈ రెండు పండుగలు ఈ శనివారం ఉప్పల్‌ స్టేడియంలో జరుగనున్నాయి. దసరా రోజే భారత్‌, బంగ్లాదేశ్‌ టీ20 మ్యాచ్‌ జరుగనుంది. దీంతో అభిమానులు దసరా ధమాకా మ్యాచ్‌ పట్ల సూపర్‌ క్రేజ్‌తో ఉన్నారు. తొలి రెండు మ్యాచుల్లో ఏకపక్ష విజయాలు సాధించిన టీమ్‌ ఇండియా 2-0తో ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. మూడో మ్యాచ్‌లోనూ నెగ్గి క్లీన్‌స్వీప్‌ విజయంపై సూర్యసేన కన్నేసింది.
నగరంలో క్రికెటర్లు‌: మూడో టీ20 మ్యాచ్‌ కోసం భారత్‌, బంగ్లాదేశ్‌ క్రికెటర్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లీలో రెండో టీ20 మ్యాచ్‌లో గెలుపొందిన భారత జట్టు గురువారం హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో భారత్‌, బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు, అభిమానులు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా హౌటల్‌కు చేరుకున్న క్రికెటర్లు శుక్రవారం ప్రాక్టీస్‌ సెషన్లో పాల్గొననున్నారు.