– తొగుట సీఐ షేక్ లతీఫ్
నవ తెలంగాణ- రాయపోల్
గ్రామాలలో నేరాలు నియంత్రించడానికి శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తొగుట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. సోమవారం సాయంత్రం రాయపోల్ మండలం వీరారెడ్డి పల్లి గ్రామంలో ప్రజలకు సీసీ కెమెరాలు, సైబర్ నేరాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చునని, గ్రామ ప్రజలందరూ ముందుకు వచ్చి కెమెరాల ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా పిల్లలు, యువత మత్తు పదార్థాలైన గంజాయి, మద్యం వంటి వాటి జోలికి వెళ్లకూడదని, ఎవరైనా గ్రామంలో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించినట్లైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని తెలిపారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు అధికం అవుతున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలని, తెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటిపి లు చెప్పరాదని, తెలియని లింక్ లు క్లిక్ చేయకూడదని, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని పోస్ట్ చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్ఐ విక్కుర్తి రఘుపతి పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.