– వృద్ధ మహిళలు, వికలాంగుల హింసపై డేటా రూపొందించాలి : డబ్ల్యుహెచ్‌ఓ సమీక్ష వెల్లడి
న్యూయార్క్ : వృద్ధ మహిళలు, అంగ వైకల్యంతో బాధ పడుతున్న మహిళలు ఎక్కువగా లైంగిక హింసకు గురవుతున్నారని, అటువంటి వారి పట్ల మరింతగా దృష్టి సారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) పేర్కొంది. అంతేకాకుండా ఇలాంటివారు అదనంగా మరికొన్ని ముప్పులను కూడా ఎదుర్కొంటున్నారని, తమ సంరక్షకుల చేతుల్లోనో లేదా ఆరోగ్య నిపుణుల చేతుల్లోనో కూడా వీరు అనేక దూషణలు, వేధింపులు భరిస్తున్నారని తెలిపింది. అలాంటి వారికి వేసుకోవాల్సిన మందులు ఇవ్వకుండా నిలిపివేయడం, చేతి కర్ర, వీల్ ఛైర్ వంటి సహాయ పరికరాలు అందుబాటులో లేకుండా చేయడం, ఆర్థిక పరమైన అవకతవకలకు పాల్పడడం, తిట్లు ఛీత్కారాలకు దిగడం వంటివి చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. ఇలాంటి మహిళలను గుర్తించడం, వారి ప్రత్యేక అవసరాలను తీర్చడం, వారి బాధలు, కష్టాలను గుర్తించడానికి దేశాల వ్యాప్తంగా మరింత మెరుగైన పరిశోధనలు జరగాలని డబ్ల్యుహెచ్‌ఓ కోరింది. అంతర్జాతీయ, జాతీయ హింస సంబంధిత డేటాలో ఇటువంటి వారి గురించిన సమాచారం ఏదీ రాదని, వారి పరిస్థితులు, సమస్యలన్నీ కూడా ఎలాంటి పరిష్కారకాలు లేకుండా లోల్లోపలే వుండిపోతున్నాయని పేర్కొంది. ముఖ్యంగా తక్కువ, ఒక మోస్తరు ఆదాయాలు కలిగిన దేశాల్లో ఇటువంటి వారి గురించి డేటా అస్సలు వుండదని తెలిపింది. అధిక ఆదాయం కలిగిన దేశాలు, ప్రాంతాల్లోనే ఇటువంటి వృద్ధ, వికలాంగ మహిళలకు సంబంధించిన సమాచారం బయటకు వస్తోందని తెలిపింది. 60ఏళ్ళు అంతకు పైబడిన మహిళలపై డబ్ల్యుహెచ్‌ఓ ఒక సమీక్ష నిర్వహించింది. లైంగిక భాగస్వామి శారీరక హింస, వేధింపులనేవి అత్యంత తరచుగా కనబడే రూపాల్లో ఒకటని పేర్కొంది. భాగస్వాములు మరింత వయస్సు మీరినవారైతే ఒక్కోసారి మానసిక హింస రూపాల్లో లేదా వదిలిపెట్టేస్తామనే బెదిరింపుల రూపాల్లో కూడా బయటపడుతూ వుంటోందని పేర్కొంది. ఇలాంటి హింస చోటు చేసుకున్నపుడు సాధారణంగా వృద్ధులు, వికలాంగులు ఒంటరిగానే వుంటారు. అందువల్ల వారు తప్పించుకోవడం లేదా వీటి గురించి ఫిర్యాదు చేయడమనేది చాలా కష్టమవుతుందని పేర్కొంది. పైగా సమాజంలో వుండే వివక్ష, కళంకం వంటివి ఇలాంటి సమాచారం లేదా సేవలు అందించే అవకాశాలను తగ్గించేస్తోందని డబ్ల్యుహెచ్‌ఓలో టెక్నికల్ ఆఫీసర్ లియాన్‌మేరీ సార్దినా పేర్కొన్నారు. ఇలాంటి గ్రూపుల్లో ఈ తరహా హింస చాలా ఎక్కువగానే నెలకొందని అందుబాటులో వున్న డేటా తెలియచేస్తోందని అన్నారు. ప్రస్తుతం మహిళలపై జరిగే హింస ఇటువంటి వారికి సంబంధించిన సమాచారం కేవలం 10శాతమే వుంటోందని అన్నారు. వీరికి సంబంధించిన సర్వేలు చేపట్టడానికి వీలుగా సర్వ మాడ్యూల్స్‌ను కూడా డబ్ల్యుహెచ్‌ఓ రూపొందించింది.