మధ్యప్రదేశ్‌లో విద్యాశాఖ ఆదేశాలపై విమర్శల వెల్లువ

మధ్యప్రదేశ్‌లో విద్యాశాఖ ఆదేశాలపై విమర్శల వెల్లువభోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. క్రిస్మస్‌ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉజ్జయిని, గ్వాలియర్‌ జిల్లాలు కూడా ఇదే తరహా నోటీసులిచ్చాయి. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్‌ యాదవ్‌ డిసెంబర్‌ 13న ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం.
క్రిస్‌మస్‌ వేడుకల్లో భాగంగా విద్యార్థులు శాంతాక్లాజ్‌ లేదా మరే ఇతర పాత్రల దుస్తులు ధరించాలని కోరుకుంటే తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకోవాలని ఈ నెల 14న షాజపూర్‌ జిల్లా విద్యాశాఖ (డీఈఓ) వివేక్‌ దూబే ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు లేదా ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. పాఠశాలలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు అందితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రిస్‌మస్‌ వేడుకలకు ముందు విద్యాసంస్థలు తమ అనుమతి తీసుకోలేదని గతంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఆరోపించారు. దీంతో ఇతర మతాల విద్యార్థులు ఈవెంట్‌లలో పాల్గొంటే తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలని పాఠశాలలను ఆదేశించామని చెప్పారు. ఈ ఆదేశాలపై సోషల్‌మీడియా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాల వేదికగా ప్రభుత్వాలు చిన్నారుల్లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోదరభావంతో మెలగాల్సిన విద్యార్థుల మనసులను కలుషితం చేస్తున్నాయని విమర్శిస్తున్నారు.