అనేక రైతాంగ ఆందోళనల ఫలితంగా దేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం 15జనవరి2016న ”పిఎం ఫసల్‌బీమా”ను తెచ్చింది. ఈ బీమా దేశంలోని రైతాంగానికి ప్రకృతి వైఫరీత్యాల సందర్భంగా ఏర్పడిన నష్టాలను పూరించడానికి ”బ్రహ్మండ మైన పథకం”గా ప్రధాని మోడీ వర్ణించారు. ఈ పథకం అమలు ప్రారంభించకముందు ”మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్” ఉంది. దీనితో పాటు వర్ష బీమా కూడా అమలు జరిపారు. ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరిపాయి. 1947 నుండి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంటల బీమాపై ప్రయోగాలు చేస్తునేవున్నాయి. కానీ ఇది రైతులకు అంతగా ఉపయోగపడలేదు. 1970లో ధర్మనారాయణ కమిటీ అధ్యయనం చేసింది. ఇది అమలు కష్టమని ప్రొ ఫెసర్ దండేకర్ వ్యతిరేకించారు. 1975లో ప్రిమియం ఉండకూడదని కూడా నిర్ణయించారు. వీటన్నింటిని తోసిపుచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఫసల్‌బీమాను అమలులోకి తెచ్చింది. ఈ పథకం వలన పది ప్రైవేట్ కార్పోరేట్ భీమా కంపెనీలను రంగంలోకి దించింది. ప్రభుత్వం రైతులనుండి బ్యాంకు రుణాలపై కరీప్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం, పసుపు, మిరపలకు 5 శాతం ప్రిమియం రైతులు చెల్లించాలి. వేలం పాటలో నిర్ణయించిన మిగిలిన అదనపు ప్రిమియంను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలి. వరికి ఆగస్టు 30వరకు, మెట్ట పంటలకు జూలై 31 వరకు, పత్తికి జూలై 15వరకు, మిర్చి, టమాటకు ఆగస్టు 31వరకు, వేరుశనగకు నవంబర్ 30వరకు, ప్రిమియం చెల్లించు గడువు నిర్ణయించారు. ఈ గడువు తరువాత బీమా కంపెనీలు ప్రిమియం తీసుకోవు. అయినప్పటికీ కొన్ని బ్యాంకులు రైతులను మోసం చేసి గడువు గతించిన తరువాత ఇచ్చు పంటరుణాలనుండి ప్రిమియం వసూలు చేశారు. ఈ మొత్తాలు బీమా కంపెనీలకు ఇవ్వకుండా, రైతులకు తిరిగి ఇవ్వకుండా, బ్యాంకులు కోట్ల రూపాయలు కాజేశాయి. 30 శాతానికి తక్కువ పంట పండితేనె బీమాకు గుర్తిస్తారు. ఈ దిగువు సూత్రం అమలు ద్వారా బీమా పరిహారాన్ని నిర్ణయిస్తారు.
ఐదేండ్ల సగటు పంట – వాస్తవ దిగుబడి × బీమా చేసిన మొత్తం
ఐదేండ్ల సగటు దిగుబడి
పైసూత్రం ప్రకారం క్రాప్ కటింగ్ చేసి దిగుబడులు నిర్ణయిస్తారు. పన్నెండు పంటలకు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇప్పటివరకు 2016 నుండి 2020 వరకు కార్పోరేట్ సంస్ధలు వసూలు చేసిన ప్రిమియం, చెల్లించిన క్లైమ్‌లు ఈ విధంగా ఉన్నాయి. (రూ.కోట్లలో)
సంవత్సరం ప్రీమియం క్లెయిమ్‌లు కంపెనీలకు (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) లాభాలు రూ.కోట్లలో
2016-17 22,345.51 16,177.72 6,167.79
2017-18 36,085 32,920 3,165.00
2018-19 25,314.01 23,271.04 2,042.97
2019-20 27,516.47 25,739.03 1,777.44
2020-21 30,000.98 19,461.12 10,539.86
2021-22 30,375 18,745.95 11,632.13
2022-23 31,592.22 16,919.62 14,672.60
2023-24 30,112.67 12,483.06 17,629.61
ఎనిమిదేండ్ల పది కార్పోరేట్ బీమా కంపెనీలు రూ.68,627.40 కోట్లు ఆర్జించాయి. కానీ, బీమా అమలు విధానం రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించలేదు. దేశంలో 43కోట్ల ఎకరాలు సాగౌతుండగా, ప్రభుత్వం బీమా మాత్రం వానాకాలం 6-7 కోట్ల ఎకరాలకు, యాసంగి 4కోట్ల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. దేశంలో 14.57కోట్ల మంది రైతులుండగా సగటున 2.5 కోట్ల మందికి మాత్రమే భీమా వర్తింపచేశారు. ఇందులో పరిహారం పొందినవారు సగటున 1.08 కోట్లు మాత్రమే ఇందులో సన్నకారు 16శాతం, చిన్నకారు 70శాతం, ఇతరులు 14 శాతం ఉండగా దళి తులు 6.26శాతం, గిరిజనులు 8శాతం, జనరల్ 33శాతం, ఓబిసీలు 52శాతం ఉన్నారు. దీన్నిబట్టి ఎంతమందికి వర్తిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. 17.15శాతం రైతులకు మాత్రమే బీమా వర్తించ బడింది. అదికూడా కొన్ని పంటలకే అమెరికాలో వంద పంటలకు బీమాను వర్తింపచేయడమేకాక, ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తున్నది. కానీ ఇక్కడ రైతులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెల్లించిన వేల కోట్ల ప్రీమియంను కార్పోరేట్ సంస్ధలు కాజేస్తున్నాయి. ప్రతియేటా ప్రీమియంకు వేలం పాటలు ఉంటాయి. గతేడాది తీసుకున్న ప్రీమియం క్లైమ్‌లు చెల్లించకుండా బకాయిపెట్టి మరో ప్రాంతంలో కంపెనీ వేలం పాటలో పాల్గొనడంతో గత బకాయిలకు ఎగనామం పెడుతున్నారు. ప్రభుత్వం ఎగనామం చేసిన కంపెనీల నుండి రైతులకు పరిహారం ఇప్పించడం లేదు. క్రాప్ కట్టింగ్ సందర్భంగా కంపెనీలు ఆసంస్థతో కుమ్మకై పరిహారాన్ని తగ్గించడానికి పంటల దిగుబడిని పెంచిచూపుతున్నారు.
వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం
జీవో నెంబర్ 157 ద్వారా 03మే2019న ఈ పథకం జారీ చేయబడింది. జూలై 15 వరకు విత్తనం వేయాలి. 40రోజులు వర్షం పడకపోతే బీమా వర్తిస్తుంది. కరీప్ ఎండుమిర్చి 16 జిల్లాలకు అనగా, భద్రాద్రి, వరంగల్ రూరల్, అర్భన్, జయశంకర్‌జిల్లా, జనగాం, మహబుబాబాద్, ములుగు, సూర్యపేట, జోగులాంబ, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాలకు వర్తిస్తుంది. పత్తి మేడ్చల్ మినహా మిగిలిన అన్ని జిల్లాలకు వర్తిస్తుంది. పామాయిల్, ఖమ్మం, భద్రాద్రికి వర్తిస్తాయి. నష్టపోయిన పంటను సెల్‌ఫోన్ ద్వారా ఫొటోస్ తీసి దరఖాస్తుకు జతచేయాలి. మూడు రోజుల్లో 72గంటల్లో వ్యవసాయ అధికారికి, ప్రీమియం చెల్లించిన అధికారికి, బీమా కంపెనీకి రాత పూర్వకంగా తెలియచేయాలి. కంపెనీ పది రోజులల్లో నష్టాన్ని అంచనా వేస్తారు. నష్టపోయిన వాటిలో 80శాతం చెల్లిస్తారు. కానీ, ఈ పథకం కూడా చైతన్యం లేని రైతులకు ఉపయోగపడటం లేదు. కంపెనీలు మాత్రం అమాయక రైతులనుండి బీమాను వసూలు చేసి లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రధాని ఫసల్ భీమా, వాతావరణ అధారిత భీమా రైతులకు లాభించకపోగా కార్పోరేట్లకు లాభాలు కట్టబెడు తున్నాయి.
ప్రధాని ఫసల్ బీమాలో దేశంలోని 43కోట్ల ఎకరాలకు 14.57కోట్ల మంది రైతులకు వర్తింప చేయాలి. అందుకు అనుగుణంగా భీమా విధానాన్ని సవరించాలి. కానీ ప్రధాని మోడీ కార్పోరేట్‌ల పక్ష పాతిగా వారికి లాభాలు కట్టబెట్టడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. సదుద్దేశంతో అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రీమియం మాత్రమే వసూలు చేయడంతో బీహార్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు ఫసల్ బీమా నుండి విరమించుకున్నాయి.
బీహార్, పశ్చిమబెంగాళ్ తమ స్వంత బీమా పథకాలను అమలు చేస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలు తిరిగి 2023లో మరల ప్రధాని ఫసల్ బీమాలో చేరాయి. కానీ 2024-25 సంవత్సరానికి ప్రీమియం చెల్లించలేదు, అందువల్ల బీమా వర్తించదు. ఎల్‌ఇసి కార్డులు ఉన్న కౌలుదారులకు కూడా బీమా వర్తింపచేయాలి. ప్రభుత్వమే ఒక శాఖను ఏర్పాటు చేయడం ద్వారా కార్పోరేట్లకు వెళ్లే లాభాలను రైతులకు మళ్లించవచ్చు.జీ-7 దేశాలలో అమలౌతున్న పంటల బీమా పథకాలను అధ్యయనం చేసి ఆ విధానాన్ని అమలు చేయాలి. నిర్ణయించిన ఆదాయం రైతుకు తగ్గితే బీమా నుండి వర్తింపచేయాలి. అప్పుడే దేశంలోని పదమూడు రాష్ట్రాల్లో ఆత్మహత్యల్ని నివారించే అవకాశం ఉంది. ఆత్మహత్యల నివారణ ప్రభుత్వం బాధ్యత కూడా.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666