
– రైతుల్లో పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో వానలు కరువయ్యాయి. వానాకాలం పంట సాగులో భాగంగా ఈ మండలంలో సాగుచేసిన పెసర, మినుము, కంది, సోయా, పత్తి పంటలకు సమయానికి వర్షాలు అనుకూలించకపోవడం, వర్షం కరువుతో ఎదగని వానాకాలం పంటల మొలకలు. గత వారం రోజులుగా ఆకాశం నల్లటి మబ్బులతో మేఘావృతమై ఉంటున్నప్పటికీ ఈ మండలంలో వర్షాలు పడకా.. రైతన్నల్లో పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. అల్పపీడనం ఏర్పడినా దాని ప్రభావం మద్నూర్ మండలంలో కనిపించడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అల్పపీడన ప్రభావం వలన అక్కడక్కడ వర్షాలు పడ్డప్పటికీ, మద్నూర్ మండలంలో వర్షం కరువైంది. సాగుచేసిన పంటలకు సరైన సమయంలో వర్షం పడడం లేక మొలకెత్తిన మొక్కలకు ఎదుగుదల జరగడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మండలంలో అత్యధికంగా సోయాపంట సాగు అయింది. ఈ పంటతో పాటు పెసర, మినుము, కంది, పత్తి తదితర పంటలు బాగానే సాగు అయింది. వీటన్నింటికీ వర్షం చాలా అవసరం ఉంది. వర్షాలు పడక వ్యవసాయ రైతులు ప్రతిరోజు ఆకాశం వైపే ఎదురుచూస్తున్నారు. పంటలకు కావలసిన సమయానికి వర్షం పడటం లేక రైతన్నల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.