కోటీ 18 లక్షల మంది ఒక్క సిలిండరూ కొనలేదు

– ప్రతి నలుగురిలో ఒకరు ఒక్కటీ తీసుకోలేదు
– రాయితీ ఉన్నా గ్యాస్‌ కొనలేకపోతున్న ఉజ్వల యోజన లబ్ధిదారులు
న్యూఢిల్లీ: భారీగా పెరుగుతున్న ఎల్‌పిజి సిలిండర్‌ ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంతోనే రూ.200 రాయితీ ఉన్నా 2022-23లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) లబ్దిదారుల్లో ప్రతి నలుగురిలో ఒకరు ఒక్క సిలిండర్‌ కూడా తీసుకోలేదు. లేదా కేవలం ఒక్క సిలిండర్‌ మాత్రమే తీసుకున్నారు. రాయితీ ఉన్నా.. పిఎంయువైలో ఒక్క సిలిండర్‌ ధర రూ.903గా ఉంది. కాబట్టే ప్రతి తొమ్మిది మంది పిఎంయువై లబ్ధిదారుల్లో ఒకరు అంటే 1.18 కోట్ల మంది గత ఏడాదిలో ఒక్క సిలిండర్‌ తీసుకోలేదు. ప్రతి నలుగురిలో ఒకరు అంటే 1.51 కోట్ల మంది ఒకే ఒక్క సిలిండర్‌ను తీసుకున్నారు. సమాచార హక్కు (ఆర్‌టిఐ) ద్వారా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసిఎల్‌), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బిపిసిఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పిసిఎల్‌) నుంచి సేకరించిన సమాచారంతో ఈ విషయం వెల్లడయింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ ఈ సమాచారం సేకరించారు. పిఎంయువై పథకం ప్రారంభమైన దగ్గర నుంచి 2023 మార్చి వరకూ పై మూడు కంపెనీలు ఈ పథకం కింద 9.58 కోట్ల ఎల్‌పిజి కనెక్షన్లు ఇచ్చాయి. మొత్తంగా రూ.6,664 కోట్ల విలువైన సబ్సిడీలను మంజారు చేశాయి. 2018 జనవరి నుంచి 2023 మార్చి వరకూ పిఎంయువై సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ పోలిస్తే ఈ ధరలు 82 శాతం పెరిగాయి. 2018 జనవరిలో ఈ ధర రూ.495.64గా ఉంది. మార్చి 2023 నాటికి ఈ ధర రూ.903కు పెరిగింది. తాజాగా కేంద్రం ప్రకటించిన రూ.200 తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే ఈ ధర రూ.703 అవుతుంది. సమాచారహక్కు ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం 2022-23లో ఏ ఒక్క పిఎంయువై లబ్ధిదారుడు కూడా నాలుగు కంటే ఎక్కువ ఎల్‌పిజి సిలిండర్లు తీసుకోలేదు. కేంద్ర పెట్రోలియం, సహాజవాయువు మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం దేశంలో మొత్తంగా 31 కోట్ల మంది కంటే ఎక్కువ గృహ ఎల్‌పిజి వినియోగదారులు ఉన్నారు. వీరిలో 9.58 కోట్ల మంది పిఎంయువై లబ్ధిదారులు. సబ్సిడీ లేని ఎల్‌పిజి సిలిండర్‌ ధర కూడా మోడీ పాలనలో భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. 2018 జనవరి నాటికి రూ.741గా ఉన్న 14.2 కేజీల సిలిండర్‌ ధర ఈ ఏడాది మార్చి నాటికి 49 శాతం పెరిగి రూ.1,103కు చేరుకుంది. (దేశరాజధానిలో ధరల ప్రకారం). కేంద్రం ఇటీవల ప్రకటించిన రూ.200 అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఈ ధర ఇప్పుడు రూ. 903 అవుతుంది.