అధికారం కోసం అడ్డగోలు హామీలు

Khammam,Navatelangana,Telugu News,Telangana.– 6 గ్యారంటీలు కచ్చితంగా అమలు చేయాలి
– ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం
– బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు రేగా
నవతెలంగాణ-మణుగూరు
కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం ఎన్నో అడ్డగోలు హామీలు ఇచ్చిందని, హామీలను గాలికి వదిలేసి కాలం వెల్లదీస్తుందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు విమర్శించారు. ఆదివారం మణుగూరు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మహిళలకు రూ.2500 ఇస్తామని ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ బడ్జెట్‌ ప్రవేశ పెట్టకుండానే సంక్షేమ పథకాలు అమలు పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఖాతాల ప్రభుత్వంగా మారిందన్నారు. ఆరు గ్యారెంటీలలో 13 అంశాలు ఉన్నాయన్నారు. అందులో ప్రధానమైనది రైతు భరోసా కింద రూ.15000, వ్యవసాయ కూలీలకు రూ.12000, కల్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారం అమలు చేయడం లేదన్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు సైకిళ్లు, యువకులకు మోటార్‌ సైకిల్‌ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఉద్యోగ భృతి కింద ఇంటర్మీడియట్‌ చదివిన వారికి రూ.25 లక్షలు, డిగ్రీ పూర్తి చేసిన వారికి రూ.50 లక్షలు, పీజీ ఇతర చదువులు చదివిన వారికి రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే బీఆర్‌ఎస్‌ పక్షాన కాంగ్రెస్‌ పార్టీని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు అడప అప్పారావు, నాయకులు కుంట లక్ష్మణ్‌, వట్టం రాంబాబు, సాని కొమ్ము శంకర్‌ రెడ్డి, కోమటిరెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, యాదగిరి గౌడ్‌, రమేష్‌, ఎస్‌.సతీష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.