న్యూఢిల్లీ : బాలాసోర్ దుర్ఘటనకు సిగలింగ్, ఆపరేషన్స్ (ట్రాఫిక్) విభాగాలకు చెందిన సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని రైల్వే భద్రతా కమిషనర్ (సీఆర్‌ఎస్) స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన నివేదికను రైల్వే బోర్డుకు అందజేశారు. సీనియర్ అధికారిని ఉటంకిస్తూ హిందుస్థాన్ టైమ్స్ పత్రిక నివేదిక వివరాలు బయటపెట్టింది.
కమిషనర్‌కు సమాంతరంగా సీబీఐ జరుపుతున్న విచారణలో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని, ఆ సంస్థను ఎవరూ ప్రభావితం చేయడం లేదని ఆ అధికారి తెలిపారు. సీఆర్‌ఎస్ నివేదిక ప్రకారం… ఇంటర్ లాకింగ్ వ్యవస్థను మూసివేసి, పనిని ప్రారంభించా ల్సిందిగా బహానగ బజార్ స్టేషన్‌లో సిగలింగ్ పనులను పర్యవేక్షించే ఉద్యోగి స్టేషన్ మాస్టర్‌కు రిపోర్ట్ ఇచ్చారు. ఇది సాధారణంగా జరిగే పనే. పని పూర్తయిన తర్వాత ఆ సంకేతాన్ని మెమో రూపంలో అందిస్తారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ పని చేస్తోందని దీని అర్థం. అయితే రైలును ఆ మార్గంలో అనుమతించే ముందు సిగలింగ్ వ్యవస్థను పరీక్షించేందుకు అనుసరించాల్సిన భద్రతాపరమైన ప్రొటోకాల్‌ను సిబ్బంది పాటించలేదు.
దీనినిబట్టి చూస్తే ప్రమాదానికి సిగలింగ్, ఆపరేషన్స్ సిబ్బందే కారణమని అర్థమవుతోంది. స్టేషన్ మాస్టర్ మెమోను అందుకున్నప్పటికీ పని పూర్తి కాలేదు. సిగలింగ్ వ్యవస్థను పట్టించుకోకపోవడం టెక్నీషియన్ వైఫల్యమే అవుతుంది. రైల్వే ఆస్తులకు సంబంధించి ఏవైనా నిర్వహణ పనులు చేపట్టేటప్పుడు రైళ్ల భద్రత బాధ్యత ఆపరేషన్ సిబ్బంది పైన కూడా ఉంటుంది.