మనిషిని చూస్తే మాట్లాడుతూ, నవ్వుతూ, నడుస్తూ, ఏదో పనిలో లీనమై కన్పిస్తాడు. కానీ, నేడు మనిషిలో క్రూరత్వం కూడా భయంకరంగా కన్పిస్తుంది. ఇటీవల రోజూ వస్తున్న ‘వార్తలు’ మనకు ఆందోళన కలిగిస్తూ మన సమాజం వైపు వేలెత్తి చూపుతూ ప్రశ్నిస్తున్నాయి. ఓచోట ఆస్తి కోసం తండ్రినే కొడుకులు చంపేస్తున్నారు. వ్యసనాలకు బానిసైన కొడుకును తండ్రి, వేధించే భర్తను భార్యా పిల్లలు కొట్టి చంపుతున్నారు. మరోచోట వివాహేతర సంబంధాల మోజులో జరుగుతున్న హత్యలు పెచ్చుమీరుతున్నాయి. ఇలా ఎంత క్రూరత్వమంటే సాటి మనిషిని కలిసి ప్రయాణం చేసిన మనుషులను కసకస నరికి చంపి ముక్కలు ముక్కలు చేయడం ఇలా రాస్తుంటేనే ఎంతో ఇదనిపిస్తుంది. ఇట్లాంటిది మనుషులను నరికి కుక్కర్లో పెట్టి ఉడికించడం, ఫ్రిజ్లో పెట్టడం, సంచీలో పెట్టడం, చివరకు నీళ్ళలో కలపడం చాలా సులువుగా చేస్తున్నారు. ఎక్కువగా మనుషుల మధ్య కోపాలు, తాపాలు, వ్యతిరేకతలు ఆస్తుల నుంచి పుట్టుతాయి. లేదంటే వివాహేతర లైంగిక సంబంధాలు ప్రేమ తిరస్కరణలు మధ్య జరుగుతాయి. ఇవన్నీ క్షణిక ఆవేశంలో జరుగుతున్నాయా? లేదు వ్యూహాత్మకంగానే జరుగుతున్నాయా? అన్నవి ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.
యువతీ యువకులు మాంసం ఆశకు వెళ్లి ప్రాణం పోగొట్టుకొన్న చేపలాగా స్మార్ట్ ఫోన్ వలలో పడి తర్వాత హనీట్రాప్ వలలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. ఇంటర్నెట్ ఇప్పుడు ప్రతి కుటుంబం నట్టింట్లోకి చేరింది. దానివల్ల లాభాలూ లేకపోలేదు. నష్టాల శాతం తక్కువేంకాదు. మంచి-చెడ్డల భేదాలను గ్రహించలేని వారి చేతిలో అదొక ఆటం బాంబుగా మారింది. ప్రతిరోజూ సినిమాల్లో, సీరియళ్లలో వందలసార్లు రేప్ సీన్లు, మర్డర్ సీన్లు చూస్తున్న యువత సున్నితత్వాన్ని కోల్పోతున్నది. సెలబ్రెటీలపై వీరారాధన పెరిగిపోయింది. కళను కళగా చూడండన్న తాత్వికుల మాటలను పెడచెవిన పెడుతూ.. కళాఖండంగా రూపుదిద్దాల్సిన సమాజాన్ని మాంసపిండంగా మార్చేస్తున్నారు. ఇది కళా! కాదా! అని విచక్షణతో, వివేకంతో ఆలోచించే సమాజంలో మనం ఉన్నామా? అన్న విజ్ఞత కొరవడింది.
ఏకాంతం వేరు… ఒంటరితనం వేరు. ఏకాంతం సాంత్వనను ఇస్తుంది. కలిసి బతకడం అనేది స్వతహాగా మనిషి స్వభావం కాబట్టే మనిషిని సంఘజీవి అన్నారు. కానీ, మనిషీ మారాడు. సమాజమూ వ్యక్తి కేంద్రంగా మారిపోయింది. నెగెటివ్ విషయాల మీద ఎక్కువ దష్టి పెడుతూ… నలుగురితో కలవడం మానుకుంటారు. ఇదంతా ఒక్కరోజులోనో ఒక్క నెలలోనో జరగదు… కొన్నాళ్లు పడుతుంది. అందుకే తమకు తెలియకుండానే ఒక్కో అడుగూ ఒంటరితనం అనే విషవలయం లోపలికి వేసేస్తూ చివరికి బయటకు రాలేని రీతిలో ఇరుక్కుపోతారు. కుంగుబాటుకు లోనవుతారు.
విద్యలో విలువలు లేకుండా, డబ్బు పండించే యంత్రాల్లాగా తమ సంతానాన్ని మార్చి విదేశాలకు పంపి గొప్పలు చెప్పుకొంటున్న వర్గం ఓవైపు, ఉన్నచోటే సరైన దశ-దిశ లేకుండా జీవిస్తున్న మనుషులు మరోవైపు. యధేచ్ఛగా నేరప్రవత్తితో జీవిస్తున్న యువత మూడోవైపు ఈ సమాజంలో ఎదిగి వస్తుంటే మనల్ని మనమే బోనులో నిలబెట్టుకోవలసిన పరిస్థితి. డ్రగ్స్ క్యాసినోలు, క్లబ్బులు, పబ్బులు, కుటుంబ వ్యవస్థను విశంఖలత్వం నైతిక పతనం వైపు నడిపిస్తున్నాయి. ఇది పుచ్చిపోయిన మన వ్యవస్థను ప్రతిబింబిస్తోంది. మొదటి గురువుగా తల్లి, జీవితం నేర్పే తండ్రి, బ్రతుకు నేర్పే పాఠశాల, తీర్చిదిద్దే సమాజం, అంకుశంతో పొడవాల్సిన ప్రభుత్వాల అన్యమనస్కత.. ఇలా సమాజం పతనం వైపు పరుగెడుతుంటే దిక్కులు చూస్తున్న మనం ఈ దుర్వార్తలు వినాల్సిందే. ఇప్పటికైనా అనుకరణలు మాని ఉన్నతమైన ఆలోచలకు, ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వడం మనందరి బాధ్యతగా మారాలని పరిస్థితులే చెపుతున్నాయి.