ఏడుపు ఓ దిగదుడుపు

Crying is sadవిసురు గాలికి కిటికీ రెక్కలు
టపటపా కొట్టుకున్నట్టు
దూషణా దుమారానికి రెండు సూర్య గోళాలను
అల్లార్చుకుంటున్న రెప్పలు
నీళ్ళు నిండిన కళ్ళు తేట పడేది ఎప్పుడో…
దశ్యపు మసకలు ఎంతటి వ్యథో కదా

సంద్రంలో కెరటాలు రయ్యినవచ్చి వెనక్కు వెళ్లినట్టు
దుఃఖం కట్టలు తెంచుకొని తగ్గుతూ పెరుగుతూ ఓ తచ్చాట

శోకపు కొలను లోంచి ఎర్రటి కలువ రెక్కలేవో
రాలిపడుతున్నాయి చూస్తున్నావా
బాధప్త మనస్సాంగత్యంలో
ఎన్ని కన్నీటి సాగర మథనాలో
గరళం దాచుకున్న హదయ తలపులు
నిజంగా ఓ త్రినేత్ర క్షేత్రం

మది చుట్టూ నాఖాగ్రాలతో నిరంతర గాట్లు
అప్రతిగత పోరాటంలో ఎన్నో గాయాల సమాహారపు
విజయకేతన దుందుభి

వేల వేల నిట్టూర్పుల మధ్య అనంత తత్వగీతాల ప్రతిధ్వనులు
దేహమంతా సమస్యల వలయంలో
సుఖ దుఃఖాల ఉత్కంఠ ఎంతకూ వీడదు
కానీ… కానీ జీర గొంతుతో సుదీర్ఘ ఏడుపు
నిలువెత్తు బాధా బ్రతుక్కు ఓ దిగదుడుపే..!
– డా||కటుకోఝ్వల రమేష్‌, 9949083327