– నిండిన కోల్డ్ స్టోరేజీలు
– ఎగుమతి లేదంటూ ధరలు తగ్గిస్తున్న వ్యాపారులు
– కేంద్రం విధానాలతో రైతులకు తీవ్ర నష్టం
నవతెలంగాణ-కాశీబుగ్గ
ఆసియాలోనే అతిపెద్ద రెండవ మార్కెట్ అయిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎర్ర బంగారంతో కళకళలాడుతున్నా ధరలు లేక రైతులు కంట నీరు పెడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను మార్కెట్‌కు తీసుకొస్తే గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు దక్కడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటసాగుకు ఆరంభం నుంచి లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్టు వాపోతున్నారు. పెట్టుబడి ఖర్చులు రెట్టింపైనా పంట విక్రయిస్తే అందులో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎగుమతి విధానంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రం వైఖరి పట్ల వారు తీవ్రంగా మండిపడుతున్నారు. మార్కెట్‌లో మిరప ఎగుమతి లేకపోవడంతో వ్యాపారులు తక్కువ ధరకు కొంటున్నారు.
వరంగల్ మార్కెట్‌కు భారీగా మిర్చి రాక..తగ్గిన ధరలు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కాకుండా ఆదిలాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాల, చెన్నూరు, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్లగొండ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి రైతులు ఎక్కువ సంఖ్యలో తమ పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు వస్తుంటారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పంట దిగుబడి పెరిగినా ధరలు మాత్రం చాలా తగ్గాయి. గతేడాది జనవరి నెలలో 53,025 క్వింటాళ్ల (1,32,564 బ్యాగ్స్) మిర్చి రాగా గరిష్ట ధర రూ.81,000 పలికింది. ఈ ఏడాది జనవరిలో 1,24,163 క్వింటాళ్లు (3,07,439 బ్యాగ్స్) రాగా ధర రూ.24,000 మాత్రమే పలుకుతోంది. గతేడాది మార్చిలో మార్కెట్‌కు 2,83,929 క్వింటాళ్లు (7.09,823 బ్యాగ్స్) మిర్చి రాగా ధర గరిష్టంగా రూ.80,000 పలకగా, ఈ ఏడాది మార్చిలో 3,12,260 క్వింటాళ్లు (7,80,651 బ్యాగ్స్) అమ్మకానికి తీసుకురాగా ధర గరిష్టంగా రూ.21,200 పలికింది.
నిండిన కోల్డ్ స్టోరేజీలు…
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో మొత్తం 25 కోల్డ్ స్టోరేజీలు ఉండగా అందులో 27 లక్షలా 5 వేల బస్తాలు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. అందులో ఇప్పటికే 25 లక్షల పైచిలుకు బస్తాలు నిల్వ చేసుకున్నారు అయితే గతేడాది ప్రారంభంలో కోల్డ్ స్టోరేజీలో ఉన్న మిర్చికి అనూహ్యంగా ధరలు పలకడంతో రైతులు, ట్రేడర్లు పెద్ద సంఖ్యలో అంటే దాదాపు 7 లక్షల బస్తాలకు పైగా మిర్చిని విక్రయించకుండా కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. ఈ ఏడాది గతేడాది కంటే ధరలు తగ్గడంతో కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉన్న మిర్చిని రైతులు, ట్రేడర్లు అమ్మలేకపోయారు. దాంతో కోల్డ్ స్టోరేజీల్లో పెట్టేందుకు సామర్థ్యానికి మించి బస్తాలు వస్తుండటంతో స్థలం లేక రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.
ఎగుమతులు లేవని ధరలు తగ్గిస్తున్న వ్యాపారులు..
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన మిర్చిని వ్యాపారులు చైనా, వియత్నాం, బంగ్లాదేశ్, థారులాండ్, మలేషియా తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. కానీ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా లేవని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడానికి ప్రధాన కారణం కేంద్రం అనుసరించిన విధానమేనని తెలుస్తోంది. దాన్ని సాకుగా చూపి వ్యాపారులు ధరలు మరింత తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని మిర్చి రైతుకు గిట్టుబాటు ధర అందే విధంగా చూడాలని వేడుకుంటున్నారు.
పెట్టుబడి ఖర్చులు పెరిగాయి : కొత్తూరి రవీందర్, రైతు మొగుళ్ళపల్లి
35 బస్తాల మిర్చిని మార్కెట్‌కు తీసుకువచ్చిన.. ధర రూ.13,700 పలికింది. గత సంవత్సరంతో పోలిస్తే ధరలు చాలా తగ్గాయి. పెట్టుబడి ఖర్చులు చాలా పెరిగాయి. ఎకరానికి ఖర్చు లక్ష రూపాయల వరకు వచ్చింది. ఈసారి కనీసం పెట్టుబడి కూడా రాలేదు.
కూలీల చార్జీలు కూడా రావడం లేదు : తోరికారి, రైతు అంకిస, సిరివంచ, మహారాష్ట్ర
దీపికా రకం మిర్చిని 20 బస్తాలు తీసుకువచ్చా. గతేడాది రూ.30వేలు ఉన్న ధర ప్రస్తుతం రూ.10వేలు మాత్రమే పలుకుతోంది. నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేశా. కౌలుకు ఎకరానికి లక్ష రూపాయలు, పెట్టుబడి చార్జీలు మొత్తం కలిపి ఎకరానికి రూ.2.5 నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చయింది. మా ప్రాంతంలో లేబర్ కొరత ఉండటంతో ఛత్తీస్‌గఢ్ నుండి కూలీలను తీసుకురావడం వల్ల అధిక భారం పడింది.
ఏడిపిస్తున్న ఎర్ర బంగారం
2:53 am