ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలి: సీఎస్ శాంత కుమారి 

– ఉద్యోగ బదిలీలు 20 లోగా పూర్తి కావాలి 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ, ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. మంగళవారం  జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వన మహోత్సవం, మహిళా శక్తి,  సీజనల్ వ్యాధులు, ఉద్యోగుల బదిలీలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత జూన్ మాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాలో వన మహోత్సవం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారని, రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్లకు పైగా మొక్కలు  నాటే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని,  జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాలను  సాధించాలని, గ్రామాలకు అవసరమైన మొక్కలను, అందులో పెద్ద మొక్కలను నాటాలని, ప్రతి మొక్కను జియో టాగ్ చేయాలని సూచించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా శక్తిమంతులను చేసి వారిని కోటీశ్వరులను చేయడమే మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని, ఈ పథకాన్ని జిల్లాలలో దిగ్విజయంగా నెరవేర్చాలని సూచించారు. స్వయం సహాయ సంఘాల ద్వారా పలు రకాల సూక్ష్మ పరిశ్రమలు, వ్యాపారాలను ప్రోత్సహించి సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించడం, మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాలను బలోపేతం చేయడం మహిళా శక్తి పథకం ప్రధాన  ఉద్దేశాలని తెలిపారు.
సూక్ష్మ తరహా పరిశ్రమలను గుర్తించి సంఘాలను ప్రోత్సహించడం, మహిళలు తమ నైపుణ్యాలకు తగ్గ ఉత్పత్తులను ఎంచుకుని, ఆ ఉత్పత్తులకు అవసరమైన నైపుణ్యాన్ని అందించడం, ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక సహకారం కోసం బ్యాంక్ లింకేజీల సదుపాయం కల్పించడం, ఉత్పత్తి అయిన సరుకులు మార్కెటింగ్ కు అవసరమైన ప్రణాళికలు, సహకారం అందివ్వడం మహిళాశక్తి పథకంలో భాగమని, 16 రకాల జీవనోపాదులు ఇందులో భాగమని, ఈ పథకాన్ని జిల్లాలో దిగ్విజయంగా అమలు చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని, జిల్లా, మండల మహిళా సమాఖ్యలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని యాక్షన్ ప్లాన్ తో వర్క్ షాప్ లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.  సీజనల్ వ్యాధుల పట్ల అప్రమతంగా ఉండాలి. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో పారిశుధ్యం ముఖ్యమని, కిచెన్, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండాలని, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, డెంగీ, మలేరియా, అతిసారా వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆశా, ఎ.ఎన్. ఎం.  సిబ్బంది క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా ఉండాలని, ఆరోగ్య కేంద్రాలలో మందులు అందుబాటులో ఉండాలని సూచించారు.
వ్యవసాయ రంగం సంబంధించి ఎరువులకు ఎలాంటి కృత్రిమ కొరత లేకుండా చూడాలని,  రైతు భరోసా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రైతు నేస్తం ప్రోగ్రాముల ద్వారా రైతులకు కావలసిన సలహాలు, నూతన సాగు విధానాలపై ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులలో పూర్తి కాని పనులను వెంటనే చేయాలని తెలిపారు. టీచర్ల బదిలీలు విజయవంతంగా జరిపిన విధంగానే ఉద్యోగుల బదిలీలు నిబంధనలను పాటిస్తూ ఈనెల 20 లోగా ముగించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కే. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, పూర్ణచంద్ర, డిఆర్ఓ రాజ్యలక్ష్మి,జిల్లా పరిషత్ సిఈఓ ప్రేమ కరణ్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, డిపిఓ మురళి, డిఎంహెచ్ఓ. డా. కళ్యాణ చక్రవర్తి, ఐసిడిఎస్ పీడీ సక్కుబాయి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.