– ప్రజలకు తగిన అవగాహన కల్పించాలి : డీజీపీ జితేందర్ పిలుపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సైబర్ నేరాలకు పాల్పడేవారి గుండెల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) అధికారులు రైళ్లు పరుగెత్తించాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల గురించి ప్రజల్లో ఎప్పటికప్పుడు తగిన అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. సోమవారం లక్డీకాపూల్‌లోని సీఎస్‌బీ కార్యాలయాన్ని సందర్శించిన జితేందర్.. ఆ విభాగం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్‌బీ ఇంఛార్జ్ అయిన సీఐడీ డీజీపీ షికా గోయెల్ ఆయనకు తమ కార్యాలయంలోని సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వివిధ విభాగాలలో పని తీరును డీజీపీకి వివరించారు. ఇందులో వివిధ విభాగాల అధిపతులను ఆమె జితేందర్‌కు పరిచయం చేశారు. సీఎస్‌బీ ఈ మధ్యకాలంలో సాధించిన విజయాలు, పట్టుకున్న నేరస్థుల వివరాలను తెలియజేశారు. కోర్టులలో వారిపై వేసిన చార్జిషీట్ల వివరాలతో పాటు ఆ కేసులకు సంబంధించిన ఎంతమంది నేరస్థులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది ఆయనకు వివరించారు.
సైబర్ నేర ప్రపంచంలో నేరస్థులు కొత్తగా అనుసరిస్తున్న వ్యూహాలు, ఎత్తుగడలు, మోసాల రూపురేఖలను, వాటిని నియంత్రించటానికి తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం గురించి కూడా డీజీపీకి షికా గోయెల్ తెలిపారు. రాష్ట్రాన్ని టార్గెట్‌గా చేసుకుంటూ.. ఇతర రాష్ట్రాల నుంచి పని చేస్తున్న సైబర్ నేరస్థులను పట్టుకోవటానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్‌ల పని విధానాన్ని కూడా డీజీపీ వివరించారు. వాటిపై స్పందిస్తూ సైబర్ నేరస్థుల కుట్రలను ఛేదించటానికి సీఎస్‌బీ విభాగంలో ప్రత్యేకంగా అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేయాలని జితేందర్ సూచించారు.
డిజిటల్‌తో పాటు పోలీసు అధికారుల పేరిట.. అమాయకులను వారిపై కేసులున్నాయని బెదిరించి డబ్బులు దండుకుంటున్న ఆన్‌లైన్ మోసాలను కట్టడి చేయటానికి ప్రత్యేకంగా దృష్టిని సారించాలని ఆయన కోరారు. ముఖ్యంగా, ఆన్‌లైన్‌లలో సైబర్ నేరస్థులు పెడుతున్న ప్రలోభాలను ప్రజలు నమ్మకుండా నేరస్థులు అనుసరిస్తున్న కుట్రల గురించి వారిలో అవగాహనను పెంచాలని సూచించారు. సైబర్ నేరాలపై నగర కమిషనరేట్లు, జిల్లాల పోలీసులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వటానికి పని చేస్తున్న విభాగాన్ని మరింతగా పటిష్టపర్చాలని ఆయన అధికారులను కోరారు.