అమెరికా ఆర్థిక దిగ్బంధనం – క్యూబా ప్రతిఘటన

US Economic Embargo - Cuban Resistanceఇప్పటికీ అరవైయేండ్ల పైబడి, అమెరికా విధించిన ఆర్ధిక, వాణిజ్య, విత్త దిగ్బంధనం మూలంగా క్యూబా ఎన్నో పరిమితులు, ప్రతికూల పరిస్థితులతో నానా బాధలు పడ్డది. అమెరికా విధించినది ఒక అన్యాయమైన దిగ్బంధనం, కాలం చెల్లిన పధ్ధతి, ఆర్ధికంగా ఊపిరి సలపని పరిస్థితి కల్పించి, క్యూబన్‌ ప్రజలు సాధించిన విప్లవాన్ని నాశనం చేసి, తిరిగి ఆ దేశాన్ని తన ఆర్ధిక వలసదేశంగా మార్చాలనే దుష్ట పన్నాగమిది. అయితే, ఈ విషయంలో క్యూబా చేష్టలుడిగి అచేతనంగా నిలబడలేదు. తన సృజనాత్మక ప్రతిఘటనను పెంచుకుని, ముందుకు సాగి ఒక దేశంగా అభివృద్ధి చెందింది.గత ఐదేండ్లలో క్యూబాపై విధించిన అమెరికా దిగ్బంధనం ఇంకా ఎక్కువైంది. ఈ పరిణామమంతా కోవిడ్‌-19 కల్పించిన ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం నడుమ, అంతర్జాతీయ స్థాయిలో దిగజారుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, సంఘర్షణల మధ్య సంభవించింది. దీని ప్రభావం ఈనాడు క్యూబా అనుభవిస్తున్న ఆర్థిక పరిస్థితిపై గణనీయంగా ఉంది.
2019 రెండో అర్ధ భాగం దాకా క్యూబా ప్రజల జీవితాన్ని, ఆ తర్వాత ఎట్లా ఉన్నది అనే దాన్ని పోల్చి చూసినట్లయితే బలపడిన అమెరికా దిగ్బంధనం ప్రభావం మనకు స్పష్టమవుతుంది. 2019లో క్యూబా ఎగుమతులు నుంచి ఆదాయాన్ని అందుకుంది; ఇతర దేశాల నుంచి వచ్చే రెమిటన్స్‌ (ఇతర దేశాలలో ఉన్న క్యూబా ప్రజలు పంపించిన సొమ్ము) గణనీయంగా ఉండేది; టూరిజం నుంచి చెప్పుకోదగిన ఆదాయం వచ్చేది- ఒక ఏడాదిలో 45 లక్షల మంది టూరిస్టులు క్యూబా సందర్శనకు వచ్చేవారు. అలాగే వివిధ విత్త సంస్థల నుంచి, ప్రభుత్వాల నుంచి అందుకునే రుణాలు, అంతర్జాతీయ కార్యక్రమాలు, సంస్థలు నుంచి వచ్చే సొమ్ము ఉండేది. వీటన్నిటి సహాయంతో వివిధ అభివృద్ధి పథకాలను నిర్వహించేవారు. మరోవైపు, స్నేహపూర్వక దేశాలతో పరిహార ఒప్పందాల మూలంగా స్థిరమైన ఇంధన సరఫరా ఉండేది.
ఈ పరిస్థితులలో, ప్రధాన ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి సరుకు దిగుమతి చేసుకోవడానికి, ప్రభుత్వం ప్రాథమిక ఆహార వస్తువులు సరఫరాకు, అలాగే దేశీయ మార్కెట్లో ఇతర ఆహార పదార్థాలు సరఫరాకు విదేశీ కరెన్సీ ఆదాయం అందుబాటులో ఉండేది. విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో క్యూబా కరెన్సీ నిలకడగా ఉండటానికి అవసరమైన విదేశీ కరెన్సీ అందుబాటులో ఉండేది. ఆర్థిక ఒప్పందాల పరిష్కారానికి ఆమోదయోగ్యమైన స్థాయిలో చెల్లింపు సామర్థ్యం ఉండేది. ఆర్థికరంగం సజావుగా నడవడానికి అత్యంత ముఖ్యమైన విడిభాగాలు, ఉపకరణాల కొనుగోలు చెల్లింపులకు విదేశీ మారక ద్రవ్యం లభ్యంగా ఉండేది. ద్రవ్యోల్బణ స్థాయి కూడా తక్కువలో ఉండేది.సారాంశంలో, దేశం కోరుకున్న సమృద్ధిని సాధించలేక పోయినప్పటికీ, కొంతమేరకు స్థిరత్వాన్ని కలిగివుంది. దానివలన, 2030 నాటిదాకా వేసుకున్న దేశ ఆర్ధిక, సామాజిక అభివృద్ధి ప్రణాళిక ఆధారంగా ఆర్ధికంగా, సామాజికంగా మెరుగుపడి, అభివృద్ధి సాధించటం వీలయింది.
2019 సంవత్సరం రెండో సగభాగంలో, క్యూబాకు వ్యతిరేకంగా దిగ్బంధంపై మరింత పట్టుబిగించేందుకు ట్రంప్‌ పాలన యంత్రాం గం 240కి పైగా చర్యలు తీసుకుంది. ఈ చర్యలతో దేశానికి వచ్చే విదేశీ నగదు ఆదాయానికి హఠాత్తుగా కోతపడింది. కృయిజ్‌ షిప్పులు (నౌకవిహారం)మూతపడటంతో, టూరిజం చాలావరకు పడిపోయింది. అమెరికా అమిత శక్తితో ఆర్థికంగా పీడించడంవల్ల నిధులు అందు కోవటం, ఉత్పత్తి ప్రక్రియకి అవసరమైన ముడి సరుకులు పొందటం, ఇంధనం కొనడం అసాధ్యమైంది. 92 కంటే ఎక్కువ బ్యాంకులు, అంతర్జాతీయ విత్త సంస్థలపై ఆంక్షలు విధించడం, క్యూబాతో వాటికున్న సంబంధాలు నిలిపివేయాలని అమెరికా ఒత్తిడి చేసింది. రెమిటెన్స్‌ల రాకలో కూడా కోత పడ్డది.దీని ప్రభావం జాతీయ విద్యుత్‌- వ్యవస్థపై భారీగా పడి, ప్రజలకు, పరిశ్రమలకు తీవ్ర ఇబ్బందులు కలగజేసే విద్యుత్‌ కోతలకు దారితీసింది.
2020వ సంవత్సరం మొదటి నెలలో, వైట్‌ హౌస్‌ వదిలి వెళ్లటానికి పది రోజులు ముందు, క్యూబా టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశంగా ఆరోపిస్తూ అటువంటి దేశాల జాబితాలో క్యూబాను చేరుస్తూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అన్ని బ్యాంకింగ్‌, విత్తసంస్థలు దేశానికి అప్పు ఇవ్వటం ఆకస్మికంగా నిలుపు చేశాయి. దీని మూలంగా ఆర్థిక చెల్లింపుల బాధ్యతలు నెరవేర్చ టానికి అవసరమైన విదేశీ కరెన్సీ లభ్యతకు పెద్దదెబ్బ తగిలింది. దీనితో దేశంలోని స్థాపిత సామర్థ్యానికి అనుగు ణంగా, వస్తు సేవల సరఫరాను నిలకడగా నిర్వహించడానికి చేపట్టవల్సిన ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాల అడ్డంకి ఏర్పడ్డది. సప్లరు డిమాండ్ల మధ్య భారీ అంతరం ఏర్పడ్డది. ఆ ప్రభావంతో అధిక ద్రవ్యోల్బణం వలన ధరలు పెరగడం జరిగింది. విదేశీ కరెన్సీ కొరత కారణంతో దేశం న్యాయబద్ధమైన మారకపు మార్కెట్‌ ను సమర్థవంతంగా నిర్వహించలేకపోయింది. మారకపు రేటులో మోసం జరగటానికి అవకాశమున్న ఇది ఒక చట్ట విరుద్ధమైన మార్కెట్‌ సృష్టించబడటానికి కారణమైంది. ధరలు నిర్ణయించడంలో ఇది ఒక అంశంగా మారింది, ద్రవ్యోల్బణం పెరగడానికి సహాయ పడ్డది.
దిగ్బంధనాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న ఆర్థిక పరిస్థితుల్లో కోవిడ్‌- 19 మహమ్మారి నుంచి క్యూబా కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. కోవిడ్‌ -19 అనుసరిస్తూనే అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల, బహుముఖాలుగా సాగిన భౌగోళిక సంక్షోభం, పర్యావరణ మార్పుల ప్రభావం, దాని మూలంగా తీవ్రమైన కరువు, విపరీతమైన వర్షాలు, జల-వాతావరణ సంఘటనలు క్యూబా ఆర్థికరంగాన్ని గణనీయంగా దెబ్బతీశాయి.ఈ రెండింటి సమిష్టి ప్రభావం వలన దేశంలో మందులు, ఆహారం, ఇంధనం కొరతపడే వాతావరణం ఏర్పడ్డది. ఆ ఫలితంగా క్యూబా విప్లవ సామాజిక కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం కుంటుపడ్డాయి. దేశ పురోభివృద్ధికి దిగ్బంధన ప్రధాన అడ్డంకిగా మారింది. ఇంతటి తీవ్రమైన దిగ్బంధన నాలుగేళ్ల పాటు కొనసాగిందని గమనించాలి. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొదలైన ఈ తీవ్ర దిగ్బంధన, బైడెన్‌ కాలంలోనూ,చివరికి కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కొనసాగింది. దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే కర్మాగారం చెడిపోతే, క్యూబాకు ఆక్సిజన్‌ సరఫరా చేసే కంపెనీల మీద ఒత్తిడి పెట్టి ఆక్సిజన్‌ సప్లరుని అడ్డుకోవడం దీనికి ఉదాహరణ.
క్యూబా – అమెరికా ఇరు సంబంధాల మధ్య నెలకొన్న అన్ని సమస్యలను, ఎటువంటి ఆంక్షలు, షరతులు విధించుకోకుండా, సమాన స్థాయిలో అమెరికాతో చర్చలు జరుప టానికి సిద్ధంగా ఉన్నట్టు క్యూబా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అమెరికాకు తెలిపింది. అయినప్పటికీ, ఇరుగు పొరుగు దేశాల మధ్య గౌరవప్రదమైన సంబంధాలు కలిగి ఉండటానికి ఆస్కారమున్న చోట, రెండు దేశాల మధ్య ఇప్పుడున్న సైద్ధాంతిక విభేదాలు పక్కనబెట్టి, వ్యాపార-ఆర్ధిక, సాంకేతిక, సాంస్కృతిక తదితర అన్ని రంగాలలో సహకారం ఉండాల్సిన చోట అమెరికా పాలనా యంత్రాంగం క్యూబా పట్ల తన ధోరణిని మార్చుకోవటానికి మొగ్గు చూపటం లేదు. 60 ఏండ్లకు పైగా విప్లవంలో అభివృద్ధి పరుచుకున్న మానవ ప్రతిభను ఉపయోగించుకుని తన స్వయంకృషితో, సొంత సామర్ధ్యంతో ఈ దిగ్బంధనాన్ని అధిగమించగలమని క్యూబా విశ్వసిస్తోంది.
పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెంచడంలో, ముఖ్యంగా ఫోటో వాల్టాయిక్‌ సోలార్‌ విద్యుత్‌ వాడకంలో క్యూబా ఈ అభివృద్ధిని సాధించింది. దీనివలన విద్యుత్‌ ఉత్పాదనకి పెట్రోలు, సహజ వాయువు, బొగ్గు లాంటి హైడ్రోకార్బన్ల దిగుమతులపై ఆధార పడవలసిన అవసరం తగ్గింది. ప్రస్తుతం దేశం 2000 మెగావాట్ల ఫోటోవాల్టాయిక్‌ సోలార్‌ పార్కులను రెండేళ్లలో నిర్మించాలనే లక్ష్యంతో అనేక ఒప్పందాల మీద సంతకాలు చేసింది. దీనివలన ఆర్థిక రంగానికి చెప్పుకోదగిన పరిమాణంలో ఇంధనం లభ్యమవుతుంది. ఇది ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
ఎగుమతి కోసం నూతన ఉత్పత్తులు తయారు చేసే పధ్ధతిలో దేశంలోనే ముడి చమురుత్పత్తిని పెంచడానికి, ఆ చమురు శుద్ధి చేసే సామర్థ్యాన్ని పెంచడానికి క్యూబా చర్యలు తీసుకుంటున్నది. ఇటువంటి కష్టమైన ఆర్థిక పరిస్థితులో, క్యూబా ఆరోగ్యరంగంలో ముఖ్యమైన మైలురాళ్లని చేరుకుంది. ఆ రంగంలో నూతన విజయాల అంది పుచ్చుకోవడానికి కృషి చేస్తున్నది. కోవిడ్‌- 19కి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో క్యూబా విప్లవం మానవతా స్ఫూర్తిని కొనసాగించింది. తమ కృషివల్ల దేశంలోకి వచ్చిన అతికొద్ది ధనం మనుషుల ప్రాణాలు కాపాడటానికే వెచ్చించింది. దేశంలోని సైంటిస్టుల కృషితో, బయో ఫార్మాసుటికల్‌ పరిశ్రమ సహాయంతో క్యూబా సొంతంగా వ్యాక్సిన్‌ తయారు చేసుకోగలిగింది. సొంతంగా వ్యాక్సిన్‌ తయారుచేసిన అతి కొద్ది దేశాలలో క్యూబా ఒకటి. దేశంలోని ప్రజలందరికి వ్యాక్సిన్‌ వేయగలిగింది. అంతులేని దిగ్బంధన కింద, పరిమితమైన వనరులు కలిగి ఉన్న క్యూబా సాధించిన ఈ విజయం అసాధారణమైనది. మూడు నెలల్లో, మొదటి వ్యాక్సిన్‌ ఇంజక్షన్‌ అభివృద్ధి చేయగలిగింది. ఆ తర్వాత ఐదు రకాల వ్యాక్సిన్‌ ఇంజక్షన్లను తయారు చేసింది. వాటిల్లో మూడు వ్యాక్సిన్ల పనితీరు అద్భుతంగా ఉందని నిరూపించబడింది. ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ క్యూబాకున్న ఆరోగ్య పరిరక్షణా సామర్ధ్యం చెక్కు చెదరలేదని ఆరోజు రుజువు అయింది.అంతేకాక, ఆనాడు కోవిడ్‌-19 విస్తృతంగా ఉన్న దేశాలతో సహా 46 కంటే ఎక్కువ దేశాలకు వైద్య బృందాలను పంపి క్యూబా తన చారిత్రాత్మక అంతర్జాతీయ వైద్య సహకారాన్ని కొనసాగించింది.
అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌, ఇతర కుంగదీసే వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్‌ వ్యాధులకు బయోటెక్నాలజికల్‌ ఔషధాలతో అధునాతన పద్ధతులతో చికిత్సలగురించి అధ్యయనంలో నేడు క్యూబా ముఖ్యమైన పురోగతిని సాధిస్తున్నది. అదే సమయంలో, అన్ని రకాల డెంగ్యూ జ్వరాలకు వ్యతిరేకంగా సమర్థవంతమైన వ్యాక్సిన్‌ తయారీకోసం పని జరుగుతోంది, ఇది ఇప్పుడు పూర్తయ్యే దశలో ఉంది.అమెరికా దిగ్బంధనకు వ్యతిరేకంగా క్యూబా సాగిస్తున్న పోరాటానికి విస్తృతమైన అంతర్జాతీయ మద్దతు లభిస్తున్నది. గత మూడు దశాబ్దాలుగా ప్రతి ఏడు, ఈ దిగ్బంధన విధానానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ సమావేశంలో క్యూబా గొప్ప విజయాలు సాధించింది. ఇజ్రాయిల్‌ మరికొన్ని దేశాలు మినహాయిస్తే, ఐక్యరాజ్యసమితిలో ఉన్న 180 దేశాలలో క్యూబా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. అయినా సరే, అమెరికా అంగీకరించట్లేదు. దిగ్బంధనం ఎత్తివేయలేదు. ఇది అమెరికా దురహంకారాన్ని, ప్రపంచ దేశాల అభిప్రాయం పట్ల ధిక్కరణను రుజువు చేస్తున్నది.
ప్రతి ఏడు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలలో అమెరికా దిగ్బంధనానికి వ్యతిరేకంగా మాట్లాడే దేశాధినేతల సంఖ్య పెరుగు తున్నది. గత సమావేశాల్లో, ఈ సమస్య పైన చర్చ జరుగుతున్నప్పుడు 44 మంది ప్రపంచ నాయకులు దిగ్బంధం వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం దేశాలు, సంస్థలు, ప్రాంతీయ కూటములు, అంతర్జాతీయ సంస్థలు దిగ్భంధనాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయటం సాధారణ విషయంగా మారింది. అదే సమయంలో ఈ దిగ్బంధన విధానానికి వ్యతిరేకంగా ప్రపంచమంతటా నిరసన కార్యక్రమాలు జరగటం పెరిగింది. ఒక్క 2023 సంవత్సరంలోనే క్యూబాకు మద్దతుగా రెండు వేలకు పైగా ప్రదర్శనలు జరిగాయి.
(క్యూబా రిపబ్లిక్‌ అధ్యక్షుడు అయిన మిగ్యుల్‌ డయాజ్‌-కానెల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ వ్యాసం)
– అనువాదం : కర్లపాలెం