క్యులినరీలో శిక్షణ పొంది ఉద్యోగాలు పొందటం ఆనందకరం

– డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
క్యులినరీ అకాడమీలో శిక్షణ పొంది ప్రపంచ వ్యాప్తంగానూ మంచి ఉద్యోగాలు సంపాదించడం ఆనందకరమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇలాంటి స్కిల్‌ ఇనిస్టిట్యూట్‌లను రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో క్యులినరీ ఎడ్యుకేషన్‌ గ్లోబల్‌ బ్రాండ్‌ ఆధ్వర్యంలో స్వీట్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. కిలినరీ ఎడ్యుకేషన్‌ సంస్థ విద్యార్థులు తయారుచేసిన కొత్తరకం స్వీట్‌ వంటకాలను డిప్యూటీ సీఎం రుచి చూశారు. వాటి తయారీ వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రూపుమాపడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందనీ, అందుకోసం ఇలాంటి సంస్థలను అధ్యయనం చేసి, పలు రకాల స్కిల్‌ కోర్సులు ప్రవేశపెట్టి నిరుద్యోగ యువకులు దేశ విదేశాల్లోని ఉద్యోగాలు పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోడ్‌ చైన్‌ సిస్టంలో డెవలప్‌ చేసి వండిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచడానికి కోల్డ్‌ స్టోరేజ్‌లను రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. క్యులినరి అకాడమీ ఆఫ్‌ ఇండియా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు.