పోడు భూముల్లో ధైర్యంగా సాగు చేసుకోవచ్చు

– రెండువేల మంది.. నాలుగువేల ఎకరాల పంపిణీ
– మొక్కలు నాటండి.. అడవులను రక్షించండి..
– స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
పోడు భూముల్లో ఇక నుంచి పట్టాలు పొందిన రైతులు ధైర్యంగా వ్యవసాయ పంటలు సాగు చేసుకోవచ్చని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గం బంజారాలకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్య్రమంలో రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణ సమీపంలోని బీర్కూర్ చౌరస్తా వద్ద ఎస్ ఎస్ ఎం బి ఫంక్షన్ హాల్ లో పూడు భూముల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విచ్చేసి పొడుపు లబ్ధిదారులకు పట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతికి సంతాపం తెలుపుతూ సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం చిత్రపటాలకు గిరిజనులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్యేశించి స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంజారాలకు పోడు పట్టాలు అందుతున్నాయన్నారు. దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపుతూ పోడు భూములకు పట్టాలను ఇప్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ బంజారాల తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పోడు భూముల సమస్యను పరిష్కరించడానికి కృషి చేసిన రెవిన్యూ, అటవీ, గిరిజన శాఖల అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.పోడు పట్టాలు కఠినమైన సమస్య. గతంలో వానాకాలం వచ్చిందంటే భూమి దున్నడానికి వెళ్ళే రైతులు, అటవీశాఖ సిబ్బంది మద్య ప్రతినిత్యం గొడవలు జరిగేవని, వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ నేటితో ఈ పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. ఈ రోజు నుంచి మీరు భూమికి హక్కు దారులు. దైర్యంగా సాగు చేసుకుని పంటలు పండించుకోవచ్చున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో గత మూడు సంవత్సరాలుగా నిత్యం అనేక సమావేశాలు ఏర్పాటు చేసి, సర్వేలు చేయించి, అర్హులైన బంజారాల లిస్ట్ తయారు చేయించాను. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో 2100 మంది బంజారాలకు సుమారు 4000 ఎకరాల పొడు పట్టాలు అందజేస్తున్నామన్నారు. ఇంకా ఎవరికైనా పట్టాలు రాకపోతే సర్వేలు చేయించి అర్హులకు పట్టాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల మంది గిరిజన రైతులకు మొత్తం 4,05000 ఎకరాలకు పట్టాలు అందజేస్తున్నారు. ఎటువంటి పైరవీలు, సిఫారసులు లేకుండా అర్హులైన బంజారా లకు పట్టాలు అందుతున్నాయన్నారు. ఈ భూములకు ఇతర రైతులకు లాగానే రైతుబంధు వస్తుంది, రైతులకు రైతుబీమా అమలు చేస్తారు. పండిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి పాస్ బుక్ ద్వారా అర్హత లభిస్తుందన్నారు.
బోర్లు వేసుకోని కరంటు కనెక్షన్ తీసుకోవచ్చు..
ఈ రోజు అందజేస్తున్న ఈ నాలుగు వేల ఎకరాల భూముల విలువ వెయ్యి కోట్ల విలువ ఉంటుందన్నారు.2005 కంటే ముందు అటవీ భూములలో సాగులో ఉన్న గిరిజనులకు పట్టాలు అందజేయాలని కేంద్ర చట్టంలో ఉన్నదన్నారు. పర్యావరణం బాగుండి, వర్షాలు మంచిగా కురవాలంటే వృక్షాలు ఉండాలి. ఇకనుంచి కొత్తగా చెట్లు నరకకుండా అడవులను కాపాడుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత గిరిజనులకు రిజర్వేషన్లను 6 నుండి 10 శాతానికి పెంచారని. ఇప్పటి వరకు రూ. 1306 కోట్లతో 1,55,000 మందికి కళ్యాణలక్ష్మీ అందజేశామన్నరు. 2014 తరువాత 3.5 లక్షల మంది గిరిజన లబ్ధిదారులకు 4,500 కోట్ల ఆసరా పెన్షన్లు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, బాన్సువాడ, బోధన్ ఆర్డీవోలు లు రాజాగౌడ్, రాజేశ్వర్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు డి అంజిరెడ్డి, బాన్సువాడ ఎంపిపి దొడ్ల నీరజావెంకట్రాంరెడ్డి, నియోజకవర్గం పరిధిలోని మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, బంజారా నాయకులు బద్యానాయక్, మోహన్ నాయక్, సంగ్రామ్ నాయక్, పాల్త్య విఠల్‌, హరిదాసు మరియు బంజారా మహిళలు తదితరులు పాల్గొన్నారు.