సాగు నత్తనడక

– 40 లక్షల ఎకరాల్లో తగ్గిన వరి
– నాలుగైదు జిల్లాలో వరి సాగు జీరో
– జొన్న పంట వైపు రైతు మొగ్గు
– లక్ష్యం దాటిన మొక్కజొన్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
యాసంగి పంటల సాగు నత్తనడకన సాగుతున్నది. అందులో వరిసాగు మరింత ఆలస్యమవుతున్నది. ఈసారి ఈశాన్య రుతుపవనాలు సకాలంలో రాకపోవడం, వర్షాలు పడకపోవడంతో దాని ప్రభావం పంటలపై పడింది. జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోవడంతో వరి నాట్లపై కూడా ప్రభావం పడింది. అందువల్ల యాసంగి సీజన్‌లో వరి సాగు ఆశించినంతగా పుంజుకోవడం లేదు. వరి విస్తీర్ణం దాదాపు 40.5 లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది ఈ సమయానికి 3.37 లక్షల ఎకరాల్లో సాగైంది.ఈసారి 2.93 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. జిల్లాల వారీగా నిజామాబాద్‌ మాత్రం రికార్డు స్థాయిలో 1.24 లక్షల ఎకరాలో నాట్లు పడ్డాయి.
మంచిర్యాల జిల్లాలో వరిసాగు సగానికి పడిపోయింది. ఆదిలాబాద్‌, జగిత్యాల, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో జీరో సాగైంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పెరిగింది. దీని ప్రకారం దాదాపు 44 వేల ఎకరాలకు పడిపోయింది. సాగు విస్తీర్ణంలో మొత్తంగా 7.2 శాతంగా నమోదైంది. ఆహార పంటైన గోధుమ 12వేల ఎకరాల్లో వేయాలి. కానీ ఇప్పటికీ మూడువేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇంకా కొన సాగుతున్నది. వర్షాధార పంటగా ప్రసిద్ది పొందిన జొన్న పంట సాధారణం గా వానాకాలంలో సాగు చేస్తారు. అక్కడక్కడ బోర్ల కింద యాసంగిలో సాగు చేస్తారు. ఈ యాసంగిలో లక్ష ఎకరాల్లో సాగు లక్ష్యంగా ఉన్నది. కానీ ఇప్పటికే 44వేల ఎకరాల్లో రికార్డు స్థాయిలో ఆ పంటను వేశారు.
జొన్న పంట 43.82 శాతానికి చేరుకుంది. యాసంగిలో మొక్కజొన్న పంటను అత్యధిక మంది రైతులు సాగు చేస్తారు. ఐదు లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా కాగా, ఇప్పటికే రెండున్నర లక్షల ఎకరాల్లో పంట వేశారు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కూడా మొక్కజొన్నను రెండో పంటగా సాగు చేస్తారు. మార్కెట్లో డిమాండ్‌ కూడా బాగానే ఉన్న నేపథ్యంలో రైతులు మొగ్గు చూపుతున్నారు. నిర్మల్‌, జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. కంది సాగు విస్తీర్ణం పెద్దగా పెరగలేదు. గతేడాది రెండువేల ఎకరాలు కాగా, ఈసారి కూడా అంతే ఉన్నది. శనగ పంట మాత్రం 70శాతానికి పెరిగింది. వేరు శనగ గతేడాది 1.94 లక్షల ఎకరాలు సాగైతే, ప్రస్తుతం 1.80లక్షల ఎకరాల్లో పంట వేశారు. రాష్ట్రంలో పొద్దుతిరుగుడు 19 లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. పొద్దుతిరుగుడు ఇప్పుడిప్పుడే సాగు చేస్తుండటంతో తొమ్మిదివేల ఎకరాలకు చేరుకుంది. వరి, ఆహార పంటలు, చిరుధాన్యాలు, నూనే గింజల సాగు, వాణిజ్య పంటలు ఆశించిన స్థాయిలో సాగు కావడం లేదని వ్యవసాయ శాఖ అందోళన వ్యక్తం చేస్తున్నది.