ఊపందుకున్న వానాకాలం పంట సాగు..

– అరకలతో, ట్రాక్టర్లతో, సోయా, పెసర,మినుము, సాగు కూలీలతో పత్తి పంట సాగు

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో వానాకాలం పంట సాగు గురువారం నాడు ఊపందుకున్నాయి. వానాకాలం పంట సాగు కోసం వ్యవసాయ రైతులు వర్షాల కోసం దాదాపు 20 రోజులుగా ఆకాశం వైపు ఎదురు చూస్తుండగా.. గత రెండు రోజులు అడపాదడపా తొలకరి జల్లులు కురియడంతో వ్యవసాయదారులు వానాకాలం పంట సాగును ముమ్మరంగా చేపట్టారు. ట్రాక్టర్ల మిషిన్లతో అలాగే ఎడ్ల అరికలతో, పెసర, మినుము, సోయా పంట సాగు అధికంగా చేస్తున్నారు. ఇక పత్తి పంట సాగును వ్యవసాయ కూలీలతో చేపడుతున్నారు. మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూరు డోంగ్లి మండలాల పరిధిలో వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 46 వేల పైచిలుకు ఎకరాల సాగు కోసం రైతన్నలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఈ ఉమ్మడి మండలంలో అత్యధికంగా సోయా పంట సాగు చేస్తున్నారు. ఈ పంటతోపాటు మినుము, పెసర, పంటలు మోతాదులోనే సాగు చేస్తుండగా.. ఈసారి పత్తి పంట సాగుపట్ల రైతులు కొంత మేరకు గత ఏడాది కంటే అధికంగా సాగుకు ముందుకు వచ్చారు. తొలకరి జల్లులతోనే ఈ ఇమ్మడి మండల రైతులు వానాకాలం పంట సాగును ఉధృతం చేయడంతో పంటల సాగు ఊపందుకున్నాయి. పంట సాగు చేయడానికి ట్రాక్టర్ మిషన్ యజమానులు ఎకరానికి రూ.800 రూపాయలు చొప్పున తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఎడ్ల అర్కలతో సాగుచేసే పంటలకు వ్యవసాయదారులు బట్టాయి, బాగేల్లి, అనే వివరాలతో పంట సాగును కొనసాగిస్తున్నారు. కూలీలతో కొనసాగుతున్న పత్తి పంట సాగును పురుషులకు రూ.600 మహిళలకు రూ.300 కూలీలు చెల్లించాలని డిమాండ్ కొనసాగుతోంది. ఏది ఏమైనా మద్నూర్ ఉమ్మడి మండలంలో వర్షాధారంపైనే ఆధారపడే వ్యవసాయం వానాకాలం పంట సాగు రైతన్నలు ముమ్మరంగా చేపడుతున్నారు.