ఆర్‌వోఆర్‌లోని 17 సెక్షన్‌తో సాగుదారులు హక్కులు కోల్పోతారు

– సీఎంకు తెలంగాణ రైతు సంఘం సూచనలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ధరణిని భూమాతగా మారుస్తూ 20 సెక్షన్‌లతో తెలంగాణ రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌ చట్టం-2024 పేరుతో ‘ముసాయిదా’ను విడుదల చేసింది. దానిపై రైతు సంఘాలు, రైతుల అభిప్రాయాలను కోరింది. ఈ నేపథ్యంలో ముసాయిదాపై తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీలో చర్చించి, కొన్ని సెక్షన్లకు సవరణలు సూచించింది. ఆ విషయాలను సీఎం రేవంత్‌రెడ్డికి రాతపూర్వకంగా ఇచ్చింది. ఆ విషయాలను బుధవారం ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌, టి. సాగర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.
సవరణలివే…
– పాస్‌ పుస్తకాల చట్టం 1971లోని సెక్షన్‌ 26ను రద్దు చేశారు. దాని వల్ల రెవెన్యూ రికార్డుల్లో భూయాజమాని లేదా పట్టేదారుకు మాత్రమే పాస్‌ పుస్తకం ఇస్తారు. దాని వల్ల పట్టేదారు లేకుండా దశబ్దాల తరబడి సాగులో ఉన్న వారు హక్కులు కోల్పోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాత హక్కులను పునరుద్ధరిస్తామంటూ ప్రకటించింది. ముసాయిదా చట్టంలో ‘సాగుదారులకు హక్కులు’ కల్పించలేదు.
– 19 రకాల భూములకు పాసు పుస్తకాలు చేస్తామనే నిబంధనలో పట్టా ఇచ్చిన పోడు భూములను చేర్చాలి.
– అసైన్డ్‌ చేసిన భూములకు పాస్‌ పుస్తకాలివ్వాలి.
– ఆర్‌ఓఆర్‌ జాబితాను గ్రామాల వారీగా తయారు చేయాలి.
– ఫారం 10లో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ‘సాదా భైనామాలకు’ ఉచితంగా రిజిష్టర్‌ చేసి పట్టా పాసు పుస్తకం ఇవ్వాలి. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌గా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి.
– కుటుంబ సభ్యుల భాగస్వామ్య పత్రం ఇవ్వడంతోనే వారసత్వ మ్యుటేషన్లు ఉచితంగా అమలు జరపాలి.
– సాగుదార్లకు ‘2011 భూ అధికృత రైతుల చట్టాన్ని’ పునరుద్ధరించాలి. దీంతో కౌలు రైతులకు రుణ గుర్తింపు కార్డులు అందుతాయి. పంట రుణాలు, పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాలకు పరిహారం, ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. దీని వల్ల భూ యాజమానులకు ఎలాంటి బాధ్యత ఉండదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2011 భూ అధికృత రైతుల చట్టం’ తెచ్చింది. ఈ చట్టం ప్రస్తుతం తెలంగాణకు వర్తింప జేయబడి ఉన్నది.
– ప్రతి జిల్లా కేంద్రంలో ‘నోడల్‌ ఆఫీసర్‌ను’ నియమించి రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. అప్పీల్‌ చేసిన నెల రోజులలో సమస్య పరిష్కరించాలనే నిబంధన ఉండాలి. జిల్లా స్థాయిలో నోడల్‌ ఆఫీసర్‌, మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలి.
– టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తయారు చేసిన ‘తెలంగాణ పట్టేదారు పాసు పుస్తకాల చట్టం 2020’ను రద్దు చేయాలి.
2024 పాసు పుస్తకాల చట్టాన్ని అమలులోకి తేవాలి.