సంస్కారం!!

అసలు గర్భస్థ శిశువుకు భాష అర్థమవుతుందా? ఏ భాష అర్థమవుతుంది. గర్భం నుండి బయటికి వచ్చాక అవి గుర్తుంటాయా? కేవలం శబ్ద తరంగాలను బట్టి తల్లిని గుర్తుపడుతుంది శిశువు. నిజంగా భాషే అర్థమవుతే గర్భంలోనే కాన్వెంట్లు పెడతారు మన విద్యా వ్యాపారులు! పిల్లలు పుట్టాకనే పరిసరం పరిచయమవుతుంది. ప్రతిరోజూ తను చూసే, పెరిగే వాతావరణం, సంభాషణ, పలకరింపులు మొదలైన వాటిని బట్టే ప్రతిచర్యగా ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. పుట్టి పెరిగి, భాషా, భావము తెలిసిన పిల్లలు కూడా కేవలం బోధనలతో సంస్కరించబడరు.
సంస్కారము అనే పదానికి చాలా అర్థాలున్నాయి. సంస్కారం కలవాడు అంటే మంచివాట, మర్యాద ఉన్నవాడని అర్థం. స్పష్టంగా, దోషాలు లేకుండా పలకడం కూడా సంస్కారమే. చక్కచేయుట, బాగుపర్చడం, సముద్యోగము, మంచిపని, దహన సంస్కారము, తైల సంస్కారము అనే మాటలు మనం వింటూ ఉంటాం. అంటే ఆనాటికి, పాకృతికంగా, సామాజికంగా సరి అయినట్లు వ్యవహరించడం. సంస్కారం నుండే సంస్కృతి వచ్చింది. సంస్కృతి అనేది మారుతూ ఉంటుంది. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము, ప్రకృతి సంబంధించిన విజ్ఞానము ప్రపంచం పట్ల మన అవగాహనను పెంచుతాయి. జీవన విధానమూ మారుతుంది. దానికనుగుణమైన సంస్కారమూ మారుతుంది. ‘వీడు సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నాడు’ అని అన్నామంటే చెడుగా వ్యవహరిస్తున్నాడని, మాట్లాడుతున్నాడని అర్థం. సంస్కారం అనేది కేవలం చెబితేనో, బోధిస్తేనో అలవడదు. పరిసరం, సామాజిక ప్రభావాల వల్ల ఒనగూడుతుంది. ఇప్పుడీ సంస్కారం గురించి చర్చేమిటని మీకనిపించవచ్చు. నిజమే. ఈ మధ్య గర్భస్థ శిశువులకు, అంటే కడుపులో ఉన్న పిల్లలకు సంస్కారం నేర్పే పనికి పూనుకుంటున్న వార్తవిని ఎక్కడున్నాం మనం? అనే ఆలోచన చుట్టుముట్టింది.
ఇటీవల ఢిల్లీలో ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ రాష్ట్ర సేవిక సమితి గర్భిణుల కోసం ‘గర్భసంస్కార్‌’ పేరిట మార్గదర్శక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో గర్భిణీతల్లులకు కార్యక్రమాల ద్వారా గర్భస్థ శిశువులకు విలువలు బోధిస్తారు. అంటే సంస్కారాన్ని కడుపులో ఉండగానే అందిస్తారన్నమాట! అయితే ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర గవర్నర్‌ స్వయానా డాక్టరయిన తమిళిసై సౌందర రాజన్‌ పాల్గొని దాన్ని ప్రారంభించారు. గర్భం ధరించిన మహిళలు, ఆ సమయంలో రామాయణం, సుందరకాండ, ఇతిహాసాలు చదివితే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్న పిల్లలు పుడతారని సెలవిచ్చారు. మతమౌఢ్యం, ఆరెస్సెస్‌ భావజాలం ఈ రకంగా తయారుచేస్తుంది మరి! తాను ఆధునిక సైన్సు అందించిన విజ్ఞానంతో డాక్టరునయ్యానన్న ఆలోచన కూడా వారికి రాకపోవడం విచారించాల్సిన విషయం. నిజంగా రామాయణం చదివితే దృఢంగా పిల్లలు పుడితే వైద్యమెందుకు? టెస్టులెందుకు? మందులెందుకు? దేశంలో వేలాది మంది పిల్లలు పౌష్టికాహారలోపంతో, తల్లులు రక్తహీనతతో బాధపడటం, చనిపోవటం రామాయణం చదవకనేనా! తల్లులు ఏ ఆహారం తీసుకుంటే పిల్లలు బలంగా పుడతారో కూడా తెలియని ఒక డాక్టరు మన రాష్ట్రానికి గవర్నరుగా ఉండటం విడ్డూరం! రామాయణాలు, భారతాలు చదవకపోయినా, శారీరకంగా, మానసికంగా, దృఢంగా పుట్టిన పిల్లలు ఏకారణాల వల్ల అలావున్నారో తెలియదా! విదేశాలలో పిల్లలు పుష్టిగా పుడుతున్నారు కదా! అసలు రామాయణం, సుందరకాండలు తెలియని, చదవని ఇతర ప్రాంతాల పిల్లల దృఢత్వానికి కారణం ఏమిటి! ఏదైనా చదివితే విజ్ఞానం పెరుగుతుంది గాని ఆకలి తీరుతుందా! ఏమిటీ అనాగరిక మూఢత్వం! తల్లి కడుపులో ఉండి అభిమన్యుడు పద్మవ్యూహ రహస్యాలను తెలుసుకున్నాడన్న భారత కథలోని కల్పనాత్మక కథనాన్ని, వినాయకుడు ప్లాస్టిక్‌ సర్జరీ చేసుకున్నాడని, పురాణ విషయాలను ఆధునిక విజ్ఞానంతో మేళవించి మౌఢ్యాన్ని కుమ్మరించడం, దానికి మతాన్ని జోడించడం యధేచ్ఛగా జరిగిపోతోంది.
అసలు గర్భస్థ శిశువుకు భాష అర్థమవుతుందా? ఏ భాష అర్థమవుతుంది. గర్భం నుండి బయటికి వచ్చాక అవి గుర్తుంటాయా? కేవలం శబ్ద తరంగాలను బట్టి తల్లిని గుర్తుపడుతుంది శిశువు. నిజంగా భాషే అర్థమవుతే గర్భంలోనే కాన్వెంట్లు పెడతారు మన విద్యా వ్యాపారులు! పిల్లలు పుట్టాకనే పరిసరం పరిచయమవుతుంది. ప్రతిరోజూ తను చూసే, పెరిగే వాతావరణం, సంభాషణ, పలకరింపులు మొదలైన వాటిని బట్టే ప్రతిచర్యగా ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. పుట్టి పెరిగి, భాషా, భావము తెలిసిన పిల్లలు కూడా కేవలం బోధనలతో సంస్కరించబడరు. మన చేతల నుండే ప్రేరణపొంది రూపుదిద్దు కుంటారు. అంతేకాని కాకమ్మకథలతో విలువలు, సంస్కారం ఏర్పడదు. మనం కథలలో సరదాగా చదువుకోవటానికి బాగుంటాయి కానీ శాస్త్రీయతకు నిలబడేవి కావు. బలహీనమైన పిల్లలు పుట్టటానికి తల్లులకు బలవర్థక ఆహారం దొరక్కపోవటం కారణం. గోడౌన్లలో కోట్లాది టన్నుల ఆహారపు నిల్వలున్నా రోజు రెండు పూటలా ఆహారం దొరకని పేదలు, పిల్లలు కోట్లాది మంది ఉన్నారు. వీరి గురించి ఆలోచన చేయకుండా, అడుగుతారేమోనని ప్రశ్నిస్తారనీ అసలు కారణాలను దాచే ప్రయత్నంలో భాగమే పాలకులు ఈ ఎత్తుగడలు. ఒకవైపు మూఢ విశ్వాసాలు, ఆర్థిక భారాలతో గర్భస్థ శిశువులనే చంపుతున్నారు. అలా చంపొద్దనే సంస్కారాన్ని నేర్పాలి. గర్భవతులకు పౌష్టికాహారాన్ని అందించాలనే బుద్ధిని పెంచేందుకు కృషి చేయాలి. ఏ బిడ్డ పుట్టినా వివక్షత చూపకూడదన్న సంస్కారాన్ని ఇవ్వాలి. కుల, మత, జాతి, లింగ వివక్షత లేకుండా పుట్టిన బిడ్డలు బతికే సంస్కారాన్ని అందరికీ అందించాలి. అదే సంస్కారం.