మత్స్యశాఖలో అవినీతిని అరికట్టండి

నవతెలంగాణ- మెదక్‌
మత్స్య శాఖలో జరిగిన అవినీ తిని అరికట్టి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం మెదక్‌ కలెక్టరేట్‌ ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె. మల్లేశం మాట్లాడుతూ.. మత్స్య కార్మిక సహకార సంఘం కార్యాలయంలో పనిచేస్తున్న టైపిస్టు నరేష్‌, ఏడి నరసింహారావులను గతంలో అవినీతికి పాల్పడినట్లు నిర్దరణయి సస్పెండ్‌ కావడం జరిగిందన్నారు. సస్పెండ్‌ అయిన టైపిస్ట్‌ నరేష్‌ తిరిగి విధుల్లో కొనసాగటం పై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. 2022 నవంబర్‌ 14వ తేదీన టైపిస్టు నరేష్‌ ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, మళ్లీ 2023 ఫిబ్రవరి 23న రోజున సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రెండుసార్లు సస్పెండ్‌ చేసిన టైపిస్టు మళ్లీ ఉద్యోగంలో కొనసాగడం అనుమానాలకు దారితీస్తుందన్నారు. సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఎవరి ప్రమేయంతో ఉద్యోగంలోకి చేరడాని ప్రశ్నించారు. 38 కుటుంబాలకు నష్టం చేసిన జిల్లా మత్స్య కార్మిక సహకార సంఘానికి నష్టం చేసిన ఉద్యోగిని ఎలా ఉద్యోగంలో పెట్టుకున్నారని నిలదీశారు. 38 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 6 లక్షల చొప్పున రావలసిన పరిహారం అందలేదని, సస్పెండ్‌ అయిన ఉద్యోగిని మాత్రం విధుల్లోకి చేర్చుకోవడం దారుణమన్నారు. ఈ నష్టానికి జిల్లా కలెక్టర్‌ బాధ్యత వహించి ప్రమాదంలో చనిపోయిన 38 కుటుంబాలకు ప్రమాద భీమాపరిహారం చెల్లించాలన్నారు. ఈ సమస్య పై కలెక్టర్‌ స్పందించకుంటే జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదమ్మ, పోచమ్మ, విమోచన, సిద్ధమ్మ, విజరు, తదితరులు పాల్గొన్నారు.