జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్
భారత జాతీయ భద్రతా సలహాదారుగా మాజీ ఐపిఎస్ అధికారి అజిత్ దోవల్ మరొకసారి తిరిగి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకానికి కేబినేట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. గతంలో ఇంటిలిజెన్స్ బ్యూరో డైరక్టర్‌గా పనిచేసిన డోవల్ తొలిసారి 2014 మే 30న మొదటి సారి జాతీయ భద్రత సలహాదారుడిగా నియమితులయ్యారు. వరుసగా 3వ సారి ఆయన ఈ పదవిలో నియమితులు కావటం విశేషం. ఇదిలావుండగా దేశ ప్రధాని మోడీ ప్రిన్సిపాల్ సెక్రటరీగా మాజీ ఐఎఎస్ అధికారి పీకె మిశ్రా నియమితులు కాగా, అమిత్ ఖరే, తరుణ్ కపూర్‌లు ప్రధానికి సలహాదారులుగా నియమితులయ్యారు.
ఒడిశా సిఎంగా మోహన్ చరణ్ మారి
ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదివాసీ రాజకీయ నాయకుడు మోహాన్ చరణ్ మారి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఒడిశాలో బిజెపి మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయ్యింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 147 అసెంబ్లీ స్ధానాలకు జరిగిన పోటీలో 78 సీట్లు సాధించి బిజెపి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆదివాసీల నుండి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో మూడవ వ్యక్తిగా మారి గుర్తింపు పొందారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్‌లు ఆదివాసీల నుండి ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఇదిలావుండగా, ఈ ఎన్నికలలో బిజూ జపతాదళ్ ఓడి పోవటంతో దాదాపు 24 ఏళ్ల పాటు అధికారం చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ అధికారం కోల్పోయారు.
అరుణాచల్ ప్రదేశ్ సిఎంగా పెమా ఖండూ
అరుణాచల్ నూతన ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడవ సారి భాద్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో మొత్తం 60 స్థానాలకు గాను, 46 సీట్లు గెలుచుకున్న బిజెపి పార్టీ ముఖ్యమంత్రిగా పెమా పదవీ భాద్యతలు చేపట్టారు. లింగ సమానత్వంలో మరింత దిగజారిన భారత్ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరమ్ ఫర్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ వివిధ దేశాలో లింగ సమానత్వంపై విడుదల చేసిన తాజా నివేదికలో భారత్ 127 స్థానం నుండి 129వ స్థానానికి పడి పోయింది. ప్రపంచవ్యాప్తంగా 146 దేశాల సమాచారం ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో ఐస్‌ల్యాండ్ మొదటి స్థానంలో నిలిచింది. గత 14 ఏళ్లుగా లింగ సమానత్వంలో ఐస్‌లాండ్ అగ్రస్థానంలో కొనసాగటం విశేషం. లింగ సమానత్వం సాధించిన దక్షిణాసియా దేశాల జాబితాలో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ దేశాల తర్వాత భారత్ 5వ స్థానంలో నిలవగా, పొరుగు దేశమైన పాకిస్థాన్ చివరి స్థానంలో నిలిచింది.
మంగోలియాను వణికిస్తున్న ‘జడ్ విపత్తు’
ప్రపంచంలో అరుదైన ప్రకృతి విపత్తులలో జడ్ విపత్తుతో మంగోలియా తీవ్రమైన విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. తీవ్రమైన అనావృష్టి తర్వాత సంభవించే అతి శీతల చలికాలాన్ని మంగోలియాలో ‘జడ్’ విపత్తు అంటారు. దేశమంతా విస్తరించిన అతి శీతల వాతావరణ పరిస్థితులు ఆయా ప్రాంతాల్లోని పర్యావరణ వ్యవస్థల్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. మంగోలియాలో ఏర్పడిన ఈ జడ్ విపత్తు వల్ల ఆ దేశవ్యాప్తంగా గడ్డి మైదానాలన్నీ మంచుతో కప్పివేయటం వల్ల, గడ్డి మొలవటం ఆగి పోయింది. దీంతో పశుగ్రాసం దొరకక ఇప్పటి వరకూ ఆ దేశంలో 71లక్షలకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. గతంలో 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జెడ్ విపత్తు గడిచిన 10 సంవత్సరాలలో ఆరు సార్లు సంభవించిందని, తాజాగా సంభవించిన ఈ విపత్తు వల్ల మంగోలియా రానున్న రోజుల్లో తీవ్రమైన కరువు, కాటకాల బారిన పడే ప్రమాదముందని ఆ దేశ ఉపప్రధాని ఎస్.అమార్ సైఖాన్ తెలిపారు.
జీ7 సదస్సుకి హాజరైన మోడీ
అత్యాధునిక ఆర్ధిక వ్యవస్థల శిఖరాగ్ర సదస్సు జి7కి భారత ప్రధాని మోడీ హాజరయ్యారు. ఇటలీలోని అపూలియా ప్రాంతంలోని అత్యంత విలాసవంతమైన బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో ఈనెల 13వ తేది నుండి 15వ తేది వరకు జరుగుతుంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తున్న యుద్ధాలను ఆపటంతో పాటు కృత్రిమ మేధ, ఇంధన వనరులు, ఆఫ్రికాతో పాటు మధ్యదరా ప్రాంతాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఈ శిఖరాగ్ర సదస్సు విస్తృతంగా చర్చించనున్నారు. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, జపాన్ ప్రధాని పుమియో కిషిరా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీలతో పాటు, భారత్ ప్రధాని మోడీ కూడా ఈ సదస్సుకి హాజరయ్యారు. జీ7లో భారతదేశానికి సభ్యత్వం లేదు, కాగా ఈ సమావేశానికి ప్రధాని మోడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హజరవుతున్నారు. ఫ్రాన్స్, కెనడా, జపాన్, జర్మనీ, ఇటలీ, యూకే, యునైటెడ్ స్టేట్స్ దేశాలు మాత్రమే జీ7లో సభ్య దేశాలుగా ఉన్నాయి.
ఉక్రెయిన్‌కి 4.17 లక్షల కోట్ల రుణం
రష్యా యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కి ఈ కష్టకాలంలో అండగా నిలవాలని, దానికి తోడు కొంతమేరకు ఆర్థిక సాయం అందించాలని జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఇటలీలో జరుగుతున్న జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సుకి హాజరయిన దేశాధినేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కష్టకాలంలో ఉక్రెయిన్‌కి సుమారు 4.17 లక్షల కోట్ల (5వేల కోట్ల డాలర్లు) రుణ సాయాన్ని అందించాలని నిర్ణయించాయి. దీంతో పాటు ఉక్రెయిన్‌కి సైనికేతర సాయం కింద తాము సొంతంగా 31 కోట్ల డాలర్లు అందచేయనున్నట్లు బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ తాజాగా ప్రకటించారు.
యాడైస్ ప్లస్ పోర్టల్ ప్రారంభించనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోను విద్యనభ్యసిస్తున్న విద్యార్ధులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘యాడైస్ ప్లస’ అనేక పోర్టల్‌ను ప్రారంభించింది. ఇకపై ప్రతి విద్యార్ధికి సంబంధించిన అన్ని వివరాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్’ ప్లస్ (యాసైడ్)లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 2024-25 విద్యా సంవత్సరం నుండి ఈ యూనిక్ విధానాన్ని కేంద్ర పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ దేశవాప్తంగా తప్పని సరి చేసింది. పాఠశాల విద్యార్ధులకు సంబంధించిన మధ్యాహ్నా భోజనం, అల్పాహారం, ఏకరూప దుస్తులు (యూనిఫారం) పుస్తకాలు, ఉపకార వేతనాలు, రవాణా భత్యం తదితర పథకాలకు సంబంధించిన నిధులను యాడైస్‌లో పొందుపరిచిన వివరాల ఆధారంగా కేటాయించనుంది. దీంతో పాటు 2020 నూతన విద్యా విధానం అమలులో భాగంగా దేశంలోని ప్రతి విద్యార్థికి ‘పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్’ను కేటాయించనుంది. 2024-25 విద్యాసంవత్సరంలో ప్రీ ప్రైమరీ విద్యార్ధులతో పాటు, ప్రస్తుతం స్కూల్ స్థాయి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 86 లక్షల మందికి ఈ ‘పెన్’ నెంబర్‌ని కేటాయించనున్నారు.
డాక్టర్ కె. శశిధర్
పర్యావరణ నిపుణులు
94919 91918