కరెంట్‌ అఫైర్స్‌

Current Affairsసంపూర్ణతా అభియాన్‌ని ప్రారంభించిన నీతి ఆయోగ్‌
భారతదేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్‌ ఇటీవల సంపూర్ణతా అభియాన్‌ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 3 నెలల పాటు జరిగే ప్రచారం ద్వారా 112 ఆకాంక్షాత్మక జిల్లాలు, 500 ఆకాంక్షాత్మక బ్లాక్‌లలో ముఖ్యమైన సూచికలలో గణనీయమైన పురోగతి సాధించాలని నీతి ఆయోగ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. చారిత్రకంగా వెనుకబడిన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించటం ద్వారా సంపూర్ణతా ఉద్యమంగా మార్చడానికి ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఈ లక్ష్యం సాధించడానికి ఆరోగ్యం, పోషణ, విద్య, నీటి వసతి, పారిశుధ్యం వంటి ఆరు ప్రధాన అంశాలలో అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం నీతి ఆయోగ్‌కి ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్రమోడీ, వైస్‌ ఛైర్మన్‌గా సుమన్‌ బేరీలు ఉన్నారు.
భారతీయ న్యాయ వ్యవస్థలో నూతన చట్టాలు
భారతీయ న్యాయవ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. దీంతో ఇప్పటి వరకూ భారతీయ శిక్షాస్మృతి(ఐపిసి), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సిఆర్‌పిసి) వంటి భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర ముగిసినట్లయ్యింది. కొత్త చట్టాలతో పాటు వివిధ నేరాలకు శిక్షలలో కూడా మార్పులు చేయటం జరిగింది. భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహాంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హాత్యలకు పాల్పడితే ఐపిసి ప్రకారం 7 సంవత్సరాలు శిక్ష ఉండేది, దానిని ఇప్పుడు యావజ్జీవంగా మార్చారు. బ్రిటీష్‌ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా, న్యాయం అందించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందనీ, పూర్తి భారతీయ ఆత్మతో రూపొందించిన ఈ కొత్త చట్టాలు రాజకీయ, ఆర్ధిక, సామాజిక న్యాయాన్ని అందించటంలో ముందుంటాయని కేంద్రం పేర్కొంది.
రెమిటెన్స్‌లో భారత్‌ టాప్‌
మాతృదేశాలకు నిధులు పంపించటంలో (రెమిటెన్స్‌) ప్రపంచ దేశాల్లోనే భారత్‌ ప్రధమ స్థానంలో నిలిచింది. 2023 వార్షిక సంవత్సరానికి గాను దాదాపు 120 బిలియన్‌ డాలర్ల (సుమారు 10 లక్షల కోట్లు) రెమిటెన్స్‌లను భారత్‌ అందుకున్నట్టు ప్రపంచ బ్యాంక్‌ తాజాగా ప్రకటించింది. అదే ఏడాది మెక్సికోకి వెళ్లిన 66 బిలియన్‌ డాలర్ల రెమిటెన్స్‌తో పోల్చి చూస్తే భారత్‌కు రెట్టింపు వచ్చినట్టు తెలిపింది. చైనాకు 50 బిలియన్‌ డాలర్లు, ఫిలిఫీన్స్‌కు 39 బిలియన్‌ డాలర్లు, పాకిస్థాన్‌కు 7 బిలియన్‌ డాలర్లు రెమిటెన్స్‌ అందాయి. 2023లో భారత్‌కు అమెరికా, యుఎఇ నుండి ఎక్కువ రెమిటెన్స్‌ వచ్చాయి.
హిజాబ్‌పై నిషేదం
తజికిస్థాన్‌లో ముస్లిం స్త్రీలు ధరించే హిజాబ్‌పై నిషేదం విధించింది. హిజాబ్‌తో పాటు ఇతర ముస్లిం సాంప్రదాయ దుస్తుల ధారణపైన కూడా ఆ దేశం నిషేదం విధించింది. వివాదాస్పదమైన ఈ బిల్లును తజికిస్థాన్‌ పార్లమెంట్‌ సైతం ఆమోదం తెలిపింది. మాజీ సోవియట్‌ రిపబ్లిక్‌ దేశమైన తజికిస్థాన్‌లో, అందులోను ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశంలో ఇలాంటి బిల్లు ఆమోదం పొందటం సంచలనం కలిగించింది.
కేరళ పేరు మార్పుకై ప్రతిపాదన
కేరళ రాష్ట్రం పేరు ‘కేరళం’గా మార్చాలని ప్రతిపాదిస్తూ కేరళ రాష్ట్ర శాసనసభ ఇటీవల ఒక తీర్మానం చేసింది. ఈ మేరకు పినరాయి విజయన్‌ నేతృత్వంలోని కేరళ రాష్ట్ర ప్రభుత్వం 8వ షెడ్యూల్‌లోని భాషలతో సహా అన్ని భాషల్లోనూ కేరళ రాష్ట్రం యొక్క పేరును కేరళంగా మార్చడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఎల్డీఎఫ్‌ సర్కార్‌ 2023లో తీర్మానం చేయగా, కేంద్రం సాంకేతిక కారణాలతో అభ్యంతరం తెలిపింది. దీంతో మరొక్క సారి తమ ప్రతిపాదనను పరిశీలించి, కేరళ రాష్ట్రం పేరును మార్చాలని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రాల పేరు మార్చే అధికారం ఒక్క కేంద్రానికి మాత్రమే ఉంటుంది.
కోటా రద్దు
బీహార్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలు, విద్యాసంస్థలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారికి రిజర్వేషన్లు 50 శాతం నుండి 65 శాతానికి పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు ఇటీవల రద్దు చేసింది. రిజర్వేషన్లు 65శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని బీహార్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళ్లనున్నట్లు బీహార్‌ ప్రభుత్వం ప్రకటించింది.
మళ్లీ జార్ఖండ్‌ సిఎంగా హేమంత్‌
జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జిఎంఎం) నేత హేమంత్‌ సోరేన్‌ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ సిపి రాధాకృష్ణన్‌ హేమంత్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. భూకుంభకోణంలో అరెస్టు అయి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన సోరెన్‌ 5 నెలల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 2013లో తొలిసారి ముఖ్యమంత్రి భాద్యతలు చేపట్టిన సోరెన్‌, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు నమోదు చేశారు.
వ్యవసాయ రుణాలకు ఎస్‌బీఐ ప్రత్యేక కేంద్రాలు
వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చరల్‌ సెంట్రలైజ్డ్‌ ప్రొసెసింగ్‌ సెల్స్‌ పేరుతో 35 ప్రత్యేక కేంద్రాలను భారత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రారంభించింది. ఇప్పటికే గృహరుణాలు మంజూరు చేయడానికి రిటైల్‌ అసెట్స్‌ సెంట్రల్‌ ప్రొసెసింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసిన ఎస్‌బీఐ, ఇప్పుడు వ్యవసాయ రుణాల మంజూరుకి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇటీవల నిర్వహించిన 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వీటితో పాటు మరొక 11 నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇళ్ల పైకప్పులపై సౌరఫలకాలు ఏర్పాటు చేసుకోడానికి ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకం కింద రుణాలు ఇవ్వటానికి ఎస్‌బిఐ సూర్యఘర్‌ లోన్‌ పథకాన్ని ప్రారంభించింది. 10 కిలో వాట్‌ సామర్ధ్యం వరకూ ఈ పథకం క్రింద రుణాలు మంజూరు చేయనున్నట్టు ఎస్‌బిఐ ప్రకటించింది.
హాథ్రాస్‌లో 116 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో భోల్‌బాబా పాదధూళి కోసం వచ్చిన భక్తుల్లో 116 మంది దుర్మరణం పాలయ్యారు. భోల్‌బాబా దర్శనం కోసం వచ్చిన భక్తులు అతని పాదధూళిని సేకరించడానికి పెద్దయెత్తున్న ఎగబడటంతో జరిగిన తోపులాటలో వీరంతా చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 108 మంది మహిళలు, 7గురు చిన్నారులు ఉన్నారు.
భారతీయ చిత్రానికి కేన్స్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డు
కేన్స్‌ చలన చిత్రోత్సవంలో పాయల్‌ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం ‘ఆల్‌ ది ఇమాజిన్‌ యాడ్‌ లైట్‌’ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రోత్సవంలో రెండవ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డును సొంతం చేసుకుంది. ‘పాల్‌ డి ఓర్‌’ పురస్కారం అత్యున్నత పురస్కారంగా పరిగణిస్తారు. గతంలో ఏ భారతీయ చిత్రం ఈ గ్రాండ్‌ ప్రిక్స్‌ పురస్కారాన్ని అందుకోలేదు.
ఉత్తమనటిగా అనసూయ గుప్తా
77వ కేన్స్‌ చలన చిత్రోత్సవాలలో ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌’ విభాగంలో భారతీయ నటి అనసూయ గుప్తాను ఉత్తమ నటిగా ప్రకటించారు. ‘ది షేమ్‌లెస్‌’ అనే సినిమాలో ఆమె ప్రదర్శించిన అత్యుత్తమ నటనకుగాను ఆమెకు ఈ అవార్డు లభించింది. ఈ విభాగంలో పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ చరిత్ర సృష్టించారు. ‘విధిలేని పరిస్థితులలో వేశ్యా వృత్తిని కొనసాగిస్తున్న వారికి, తమ హాక్కుల కోసం గళమెత్తుతున్న అణగారిన వర్గాలకు ఈ అవార్డుని అంకితమిస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
రిషి సునాక్‌ ఓటమి
ఇటీవల జరిగిన బ్రిటీషు సార్వత్రిక ఎన్నికలలో భారత్‌ సంతతికి చెందిన రిషి సునాక్‌ ఓటమి పాలయ్యారు. ఆయన సారధ్యంలో ఎన్నికలలో పాల్గొన్న టోరీల (కన్జర్వెటీవ్‌ల) పార్టీ ఓటమి పాలు కావటంతో సునాక్‌ తన పదవినీ కోల్పో యారు. దీంతో 14 ఏళ్ల కన్జర్వేటివ్‌ల పాలనకు తెరపడి నట్లయ్యింది. రిషి సునాక్‌ తర్వాత లేబర్‌ పార్టీకి చెందిన కీర్‌ స్టార్మర్‌ నూతన ప్రధానిగా భాద్యతలు చేపట్టనున్నారు. జూలై 5న జరిగిన ఎన్నికలలో లేబర్‌ పార్టీ 400కి పైగా ఓట్లు సాధించగా, కన్జర్వేటివ్‌ల పార్టీ 120 సీట్లను మాత్రమే సాధించి ఓటమి పాలయ్యింది. ఈ ఓటమికి తానే సంపూర్ణ భాద్యత వహిస్తున్నాని రిషి సునాక్‌ ప్రకటించారు.