మోడీకి రష్యా పురస్కారం
భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసు కోవాలన్న లక్ష్యంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచ డానికి మోడీ చేస్తున్న సేవలకి గుర్తింపుగా రష్యా అందించే అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్తల్’ని పుతిన్ అందచేశారు. దీంతో ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా మోడీ రికార్డు సృష్టించారు. రష్యా తొలి క్రైస్తవ మత భోదకుడైన సెయింట్ ఆండ్రూ పేరిట 1698 నుండి రష్యా చక్రవర్తి పీటర్ కృషితో ఈ అవార్డును ప్రధానం చేస్తున్నారు.
భూమిని పోలిన మరొక గ్రహాం
భూమిని పోలిన మరొక గ్రహాన్ని కెనడా దేశానికి చెందిన యూనివర్సిటి ఆఫ్ మాట్రియల్‌కి చెందిన శాస్త్రవేత్తల బృందం తాజాగా గుర్తించింది. ఎల్‌హెచ్‌ఎస్ 1140బి పేరుతో పిలుస్తున్న ఈ గ్రహాంలో వాతావరణ పరిస్థితులు సరిగ్గా భూమి మీద ఉన్నట్టే వారు గుర్తించారు. జేమ్స్ మోర్ స్పేస్‌తో పాటు, స్విట్జర్, హాబుల్ వంటి అంతరిక్ష టెలిస్కోపుల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ గ్రహాంపై ఉన్న వాతావరణ పరిస్థితులను వారు అంచనా వేస్తున్నారు. భూమికి 48 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహంపై నీరు చాలా వరకూ ద్రవ రూపంలోనే ఉందని, భూమి పైన మాదిరిగానే నైట్రోజన్‌తో కూడిన వాతావరణ వ్యవస్థ ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
వాయుకాలుష్యంతో భారత్‌లో ఏటా 33వేల మరణాలు
దేశంలో రోజురోజుకి పెరుగుతున్న వాయుకాలుష్యం వల్ల ఒక్క భారతదేశంలోనే ప్రతి ఏటా దాదాపు 33వేల మంది మరణిస్తున్నారని లాన్సెట్ జరిపిన ఒక అధ్యయనంతో తేలింది. ప్రపంచ ఆరోగ్య, వాతావరణ సంస్థలు నిర్దేశించిన ప్రమాణాల కన్నా అధికంగా కాలుష్యం కలిగి ఉండటం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ నివేదిక స్పష్టం చేసింది. వాయుకాలుష్యం అధికంగా ఉన్న అహ్మాదాబాద్, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కత్తా, ముంబై, పూణే, సిమ్లా వారణాసి వంటి నగరాల్లో ఈ మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని ఆ నివేదిక తెలిపింది.
జనాభాలో దూసుకుపోతున్న భారత్
భారతదేశంలో జనాభా విస్ఫోటనం వేగంగా కొనసాగు తుందని ఐక్యరాజ్యసమితి తాజాగా ప్రకటించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2100 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలుస్తుందని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 145కోట్ల మంది జనాభా ఉన్నారని, 2060 నాటికి భారత్ జనాభా 170 కోట్లకి చేరుకుంటుందని ‘ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 పేరుతో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఆర్ధిక, సామాజిక వ్యవహారాలు, జనాభా విభాగం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. దీంతో పాటు ప్రస్తుతం 820 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా 2080 దశకం నాటికి 1030 కోట్లకు చేరుకుంటుందని లెక్కగట్టింది. ఇదిలావుండగా, ప్రపంచలోనే అత్యధిక జనాభా కలిగిన నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ రెండవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఢిల్లీలో 3.3 కోట్ల మంది నివాసం ఉంటున్నారు. 2028 నాటికి ఢిల్లీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రాస్పెక్ట్స్ నివేదిక వెల్లడిరచింది.
జూన్ 25 రాజ్యాంగ హత్యా దినం
భారత్ చరిత్రలో చీకటి అధ్యాయంగా అనేక మంది భావించే ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదిన రాజ్యాంగ హత్యా దినంగా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. 1975లో దేశంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి దృష్ట్యా జూన్ 25న అత్యవసర స్థితిని విధించారు. ఎమర్జెన్సీ సమయంలో ఎంతో వేదనను అనుభవించి, త్యాగాలకు సిద్ధపడిన వారిని గుర్తు చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేసింది.
తగ్గుతున్న భూగర్భ జలాలు
మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల దేశంలో భూగర్భ జలాలు అత్యంత వేగంగా తగ్గి పోతున్నాయని హైదరాబాద్‌లోని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఎఫ్) మరి కొంత మంది ఐఐటి శాస్త్రవేత్తలతో సంయుక్తంగా జరిపిన ఒక తాజా అధ్యయనం తెలియచేసింది. సకాలంలో వర్షాలు పడకపోవటం, నీటి వనరులను తగిన రీతిలో సంరక్షించుకోక పోవటంతో పాటు, పెద్దఎత్తున్న భూగర్భ జలాలను తోడేయటం కూడా దేశవ్యాప్తంగా భూగర్భ జలాల లభ్యత తగ్గిపోవడానికి కారణాలని ఆ అధ్యయనం తేల్చి చెప్పింది. దక్షిణ భారతదేశంతో పోల్చుకుంటే, ఉత్తర భారతదేశంలోనే భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్నాయని, 2002-2021 మధ్య కాలంలో ఉత్తర భారతం దాదాపుగా 450 క్యూబిక్ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలను కోల్పోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇంగ్లీషు ఛానెల్‌ని ఈదిన తల్లి తన్వీ చవాన్ దేవరే
ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఛానల్స్‌లో ఒకటైన ఇంగ్లీషు ఛానల్‌ని ఇద్దరు పిల్లలకి తల్లైన తన్వీ చవాన్ దేవరే ఈది రికార్డు సృష్టించింది. బ్రిటన్‌లోని డోవర్ నుండి ఫ్రెంచ్ తీరం వరకు సుమారు 42 కిలోమీటర్ల దూరం కలిగిన ఇంగ్లీషు ఛానెల్‌ని 17.42 గంటల వ్యవధిలో తన్వీ చేరుకున్నారు. దీంతో ఇంగ్లీషు ఛానల్‌ని ఈదిన మొదటి మాతృమూర్తిగా మహారాష్ట్రకి చెందిన తన్వీ చవాన్ చరిత్రలో నిలిచారు. ఎటువంటి విరామం, విశ్రాంతి లేకుండా ఈ లక్ష్యాన్ని ఆమె సాధించటం మరో విశేషం.
రోష్ని నాడార్‌కి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
కంప్యూటర్ రంగంలో దిగ్గజ సంస్థ అయిన హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రాకి ఫ్రాన్స్ ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే పౌర పురస్కారం ‘షెవెలియర్ డెలా లీజియన్ డీ హానర్’ లభించింది. వ్యాపారంలో స్థిరత్వం సాధించడానికి ఆమె అందించిన సేవలకుగానూ ఈ గుర్తింపు లభించిందని హెచ్‌సిఎల్ ప్రకటించింది. వివిధ రంగాల్లో సమర్ధులైన వారికి అందించే ఈ పౌర పురస్కారం అందుకోవటం చాలా ఆనందంగా ఉందని, భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక బంధాలను ఇది మరింత బలపరుస్తుందని రోష్ని తెలిపారు.
రికార్డు స్థాయిలో దేశంలో ఆయుధాల ఉత్పత్తి
భారతదేశ వార్షిక ఆయుధ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరుకుందని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్‌సింగ్ తెలిపారు. 2022-23లో దేశీయ ఆయుధాల ఉత్పత్తి విలువ 1,08,684 కోట్లు ఉంటే, 2023-24లో 16.8 శాతం వృద్ధి రేటుతో దాదాపు 1.27 కోట్లకు చేరుకుందని ఆయన తెలిపారు. అయితే ఆయుధాల ఉత్పత్తి వ్యయంలో 79.2 శాతం వాటాని ప్రభుత్వ రంగ ఆయుధ పరిశ్రమలు కలిగి ఉంటే, ప్రైవేటు రంగం 20.8 శాతం వాటాను కలిగి ఉంది.
కేంద్రానికి కెనరా బ్యాంక్ 1838 కోట్ల డివిడెంట్ చెల్లింపు
గత వార్షిక ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కెనరా బ్యాంక్ సుమారు 1838 కోట్ల రూపాయల డివిడెంట్‌ను చెల్లించింది. ఈ మేరకు దీనికి సంభందించిన చెక్కును కెనరా బ్యాంకు ఎండీ, సిఇఒ కె.సత్యనారాయణ రాజు నేతృత్వంలోని అధికారుల బృందం ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కి అందచేశారు.
ఎన్‌బిడిఏ అధ్యక్షుడిగా రజత్‌శర్మ
దేశంలోనే వార్తా పత్రికలు, డిజిటల్ మీడియా రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద సంఘం ‘న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ డిజిటల్ ఆసోసియేషన్ (ఎన్‌బిడిఏ) అధ్యక్షుడిగా ఇండియా టీవీ ఛైర్మన్ రజత్‌శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్‌బిడిఏ బోర్డు సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. దేశంలోని దాదాపు అన్ని పెద్ద న్యూస్ నెట్‌వర్క్ సంస్ధలకీ ఎన్‌బిడిఏలో సభ్యత్వముంది.
సుప్రీం కోర్టుకు 75 ఏండ్లు
దేశం అత్నున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఏర్పడి 75 ఏండ్లు కావస్తున్న సందర్భంగా 75 రూపాయల వెండి నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 99.9 వెండితో తయారు చేసే ఈ నాణెం 40గ్రాముల బరువుతో ఒక వైపు ఆశోక స్థూపం, మరొక వైపు సుప్రీం కోర్టు చిత్రాలతో రూపొందించనున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మణిపూర్ వాసి
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తొలిసారిగా మణిపూర్‌కి చెందిన జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ పేరును సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవికీ, భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. వీరితో పాటు మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహాదేవన్ పేరును కూడా కొలిజీయం సిఫార్సు చేసింది. దీనిపై కేంద్రం ఆమోద ముద్ర వేస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన మొదటి మణిపూర్ వాసిగా జస్టిస్ ఎన్ కోటేశ్వర్‌సింగ్ రికార్డు సృష్టిస్తారు. ప్రస్తుతం ఆయన జమ్మూ కాశ్మీర్, లద్ధాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు.