తిట్టుడు.. పడగొట్టుడు.. విడగొట్టుడు..

Cursed.. Knocked down.. Broken..కట్టె కొట్టె తెచ్చె ముచ్చటగా మూడు ముక్కల్లో రామాయణాన్ని చెప్పారట ఎవరో. అన్ని సినిమాలు, సీరియళ్ళు వాటిలో ఎన్నో ఎపిసోడులు తీసినా పూర్తి కాని ఆ కావ్యాన్ని మూడు ముక్కలో చెబితే అది ఎలా సరిపోతుంది అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. బాల రాముడి గురించి కూడా అందులో ఉంది అనే కామెంటు కూడా చేయొచ్చు కొందరు. ఎన్నో కాండలున్న ఆ కళా ఖండాన్ని మూడు పదాలతో రామాయణం 3.0 తో సరిపెడితే ఇంకా 4.0, 5.0 ఇలా ఎన్నో రావాలనుకుంటుంటున్న మేము ఈ మూడు ముక్కల నిర్వచనాన్ని అస్సలు ఒప్పుకోము అనే వాళ్ళ ఆశకు అది విఘాతమే మరి. అలాగే భారతాన్ని చదివి ఓ పెద్ద మనిషి ఏక్‌ బుడ్డా, ఏక్‌ లడ్‌కా బినా ఉస్‌మే క్యా హై అన్నాడట అంటే ఓ భీష్ముడు, ఓ అభిమన్యుడు వీరిద్దరిని తప్పించి తనకు ఏ పాత్రా నచ్చలేదన్నాడట.
ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలను చూసినా, దేశ రాజకీయాలను చూసినా తిట్టుడు పడగొట్టుడు విడగొట్టుడు అని మూడు ముక్కల్లో చెప్పొచ్చు. ఏ దేశ చరిత్ర చూసినా అన్న మహాకవి మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటే నిజంగా మనం గర్వపడాల్సినంత ఏముంది, ఎందులో ఉంది అని మన మీద మనకే అనుమానం వస్తుంది. ఇక్కడ మన మీద అంటే మన తరం మీద అని అర్థమన్న మాట. నిజంగా ఈ తరం చరిత్రగా మారినప్పుడు ఏమున్నది గర్వకారణం అనే ప్రశ్న వచ్చినా, ఇదిగో ఫలానా పనులు చేశాం, ఫలానా ప్రాజెక్టులు కట్టాం, ఇన్ని ఉద్యోగాలు తెచ్చాం, అన్ని మతాలవాళ్ళను ఒక తాటి మీదకు తెచ్చాం… ఇలా చెప్పుకోడానికి ఇంకా ఎన్నో మంచి పనులు చూపించగలగాలి. అప్పుడే నిజమైన గర్వం. లేకుంటే సర్వం విషతుల్యం.
తిట్టుడు పని మీదున్నోళ్ళ నోరు ఊరకే ఉండకపోగా అవతలి నోళ్ళకూ పని కల్పిస్తుంది. అసలు ఆ తిట్టుడే తమను పైన కూచోబెట్టిందని ఆనందపడ్డవాళ్ళు అదే తమను మళ్ళీ ఇండ్లలో కూచోబెట్టిందని బాధ పడినా అది కనబడనీయక తమ నోటి దురుసును అలాగే కొనసాగిస్తూ తమ వారసత్వ మిదేనని పొంగిపోతా రన్నమాట. ఆవు మీద వ్యాసంలా మాకు వచ్చేది ఇదే, ఆ తరువాత మీ ఖర్మ అని ప్రజలకు, మీడియాకు తెలిసేలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. ఐనా ఎవరి నోళ్ళు బాబున్నాయి చెప్పండి? మేమన్నా ఒకరిని తిడితే వారి మీదే ఉంటాయి మా తిట్లు అంతేగాని మీలాగ ఒకరిని తిట్టడం మొదలు పెట్టి దాన్ని ఇంకొకరి మీదికి తీసుకుపోయి కోర్టుకు పోయేలాగ ఉండవు మా మాటలు అని కూడా పొంగి పోవచ్చు. తిట్టుడుకు కూడా కొన్ని రూల్సుంటాయి బాబూ, వాటిని దాటితే తిప్పలే. అలా మేమూ దాటినందుకే అనుభవిస్తున్నామనీ తమ అనుభవాలను నెమరేసుకోవచ్చు కూడా.
పడగొట్టుడు వాళ్ళు మొదట మామూలుగానే అవి కడతాం, ఇవి కడతామని చెప్పి వచ్చినోళ్ళే. కానీ కొన్ని సరిచేయవలసిన సంగతులున్నాయని చేస్తున్నామని, అవి కొందరికి సరిపడని సంగతులుగా కనబడతాయని, అంతెందుకు దురాచారాలను రూపుమాపడానికి సరిపడని సంగతులు అన్న సాంఘిక నాటకం రాసిన బళ్ళారి రాఘవని కూడా విమర్శించినోళ్ళు ఉన్నారనీ, కాబట్టి మేము ఎవ్వరినీ పట్టించుకోమని, చేసేది చేసుకుంటూ, పడగొట్టేది పడగొట్టుకుంటూ, కట్టేది కట్టుకుంటూ, విగ్రహాలు పెట్టేది పెట్టుకుంటూ పోతామని, ఎవరి విగ్రహం ఎక్కడ పెట్టాలో మాకు తెలుసునని ఇతరులు మాకు సలహాలు ఇవ్వనవసరంలేదనీ చెప్పొచ్చు. ఐనా పాత దాన్ని పడగొట్టకుండా కొత్తవి కట్టలేరని ఒక సూత్రం ఉంది, మా సూత్రమూ అదే ఇప్పటికే మధ్యలో వచ్చిన వాళ్ళని పడగొట్టి మేమొచ్చాము. అలాగే రూల్సుకు వ్యతిరేకంగా కట్టినవాళ్ళెవరైనా రాజకీయులైనా, సినిమా వాళ్ళైనా, అధికారులైనా, పెద్దోళ్ళైనా ఎవరైనా సరే కట్టకూడని చోట కడితే పడగొట్టుడే. మా అన్న కట్టింది కూడా పడగొట్టేలోపు ఆయనే పడగొట్టుకుంటానన్నాడు కదా, అదీ మా నిజాయితీ అనీ అనొచ్చు.
ఇక మూడో టీము అంటే జట్టు విడగొట్టుడు టీం, వీళ్ళకు దేశమైనా, ఏ రాష్ట్రమైనా, జిల్లా ఐనా, లేక ఒక ఊరైనా వారి వరస ఒకటే, విడగొట్టుడు, విషమెక్కించుడు. తెల్లవాళ్ళు విభజించు పాలించు అన్న సూత్రాన్ని ఎలాగైతే మన పైన ఉపయోగించారో దాన్ని మనమే మన పైన వాడుకుంటె ఎలాగుంటదని మేము ఎన్నో ప్రయోగాలు చేస్తున్నామని, ఆ ప్రయోగాలు కొన్ని ఫలితాలిచ్చాయని చెబుతారు. మొన్న అవి తారుమారైనాయి కదా అంటే మేమిప్పుడు మూడు పాయింట్‌ సున్నా దగ్గర ఉన్నమని, నాలగు పాయింట్‌ సున్నాకు కూడా పోతామన్న మా ధీమాను వ్యక్తం చేసి దానిని ఎవ్వరూ ఆపలేరనీ కూడా ప్రకటించవచ్చు. నాలగు పాయింట్‌ సున్నా ఏమో కాని సున్నా మాత్రం ఈసారి మీకు గ్యారెంటీ అని అవతలి వాళ్ళు వ్యంగ్యంగా అనవచ్చు కూడా.
దంచుడు, బాదుడు, తోలు తీసుడు దాటి నేనూ విడగొట్టుడే అని ఆ అరుపులు ఢిల్లీదాకా వినబడాలని ఇంగ్లీషులో షౌటుతారు అంటే అరుస్తారు. మనిషిగా దిగజారుతున్నా రాయకీయల్లో రోజూ ఓ మెట్టు పైకి ఎక్కుతున్నానా లేదా అన్నదే ఇలాంటోళ్ళ జీవిత లక్ష్యం. ప్రజలేమి, వాళ్ళ బాగోగులేమి, వాళ్ళను ఎలా కలిపి ఉంచాలి అన్న ఆలోచన మరచి విడగొట్టుడే పనిగా పెట్టుకున్నోళ్ళ సరసన చేరి సినిమా చూసే రకం చూపే రకం, చూసే రకం. ఇలాంటోళ్ళను చూసే ప్రజలు మాత్రం తమను తాము రక్షించుకొడు ఏలా అని మాత్రమే చూడాలి. భావావేశాలకులోనై నాయకులు చెప్పే మాటల్ని ఎలా ఉన్నా పాటిస్తూ పోతే చివరకు తల బరుకుడు చేసుకోవాల్సి వస్తుంది. క్లౌడ్‌ బరస్టింగ్స్‌ అని వింటున్నాం కాని ఎలా మాటల ద్వారా, వాటిని మబ్బులు పేలినట్లుగా పేల్చి జనాలపై విషాన్ని చల్లే వారిగురించి జాగ్రత్త పడాలి.
ప్రజలకు నష్టాన్ని తెచ్చే వారెవరైనా సరే కనుక్కోని వారిని విరగ్గొట్టుడు చేయాలి. అప్పుడే తమ శక్తి తాము తెలుసుకున్నట్టు లెక్క. ఆ తెలుసుడు జరిగాక ఇక ఎలాంటి వారినైనా వాళ్ళ మాటలను బట్టి, చేతలను బట్టి ఈ నాయకులు ఏ ”డు” కిందికి పోతారు అసలు ప్రజలకు చెందినవాడు ఎవ్వరు అని తెలుస్తుంది. మాటలు కోటలు దాటడం కాదు ఆ కోటలో ఉన్నవారే ప్రజల వద్దకు వచ్చుడు ముఖ్యం.
జంధ్యాల రఘుబాబు
9849753298