– గత ఏడాది రూ.4,037 కోట్లు, ఈ ఏడాది రూ.3,317 కోట్లు
– పూర్తి బడ్జెట్‌లో సవరణలకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఏడాదికి ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఐటీ, పారిశ్రామిక రంగానికి నిధుల్లో కోత విధించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రంగాలకు కలిపి రూ.4,037 కోట్లు కేటాయించగా, ఈసారి రెండు విభాగాలకు వేర్వేరుగా నిధులను కేటాయించారు. పరిశ్రమలకు రూ.2,543 కోట్లు, ఐటీ రంగానికి రూ.774 కోట్లు కలిపి మొత్తం రూ.3,317 కోట్లను ప్రతిపాదించారు. ఆ రకంగా గతేడాదితో పొలిస్తే ఈ సారి రూ.720 కోట్లు తగ్గాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల అనంతరం ప్రవేశ పెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లో నిధులను పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో గతేడాది రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు రాగా సారీ రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గతం కంటె ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రెండింతలయ్యాయి. రేవంత్‌ది కొత్త సర్కార్ అయినా అంతర్జాతీయ వేదికపై తమ వాణిని బలంగా వినిపించి పారిశ్రామిక వేత్తలను ఆకర్శించింది. రాష్ట్రంలోని టెక్స్‌టైల్ పార్కులు, ఇతర పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి పీఎం మిత్ర తదితర నిధులను ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్‌లో చెప్పడం కొసమెరుపు.
.