ఇజ్రాయిల్‌తో సంబంధాలు తెగతెంపులు చేసుకోండి

ఇజ్రాయిల్‌తో సంబంధాలు తెగతెంపులు చేసుకోండి– ముస్లిం దేశాలను కోరిన ఇరాన్‌
టెహరాన్‌ : గాజా, లెబనాన్‌లపై విచక్షణారహితంగా దాడులకు దిగుతూ వేలాదిమంది అమాయకులను పొట్టన బెట్టుకుంటున్న ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని ముస్లిం దేశాలకు ఇరాన్‌ విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయిల్‌ రాయబారులను బహిష్కరించి, ఇజ్రాయిల్‌ దేశంపై ఆంక్షలు విధించాలని కోరింది. ఈ మేరకు ఇరాన్‌ రక్షణ మంత్రి బ్రిగేడియర్‌ జనరల్‌ అజీజ్‌ నజిర్‌జదా లెబనాన్‌ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. లెబనాన్‌లో దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం టెహరాన్‌ తరలించారు. కేవలం ఇజ్రాయిల్‌ చేస్తున్న నేరాలను నిరసిస్తే సరిపోదు, ఈ ఊచకోతను ఆపేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. ఆ దేశంతో రాజకీయ సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని, రాయబారులను బహిష్కరించాలని, పరస్పర ఆర్థిక లావాదేవీలను ఆపాలని కోరారు. బాంబు దాడులతో, మూకుమ్మడి హత్యలతో ప్రతిఘటనా శక్తిని అణచివేయలేరని వ్యాఖ్యానించారు. అమెరికా, యూరప్‌ దేశాల మద్దతుతో ఇజ్రాయిల్‌ యూదు ప్రభుత్వం ఇటువంటి అమానుష చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇటీవల లెబనాన్‌లో పేజర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాల దాడులను ప్రస్తావిస్తూ, ఇలాంటి పద్దతుల వల్ల దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయన్నారు. కమ్యూనికేషన్‌కు ప్రాధమికంగా అవసరమైన ఇటువంటి పరికరాలను బాంబులుగా మార్చి దాడులకు దిగడాన్ని అస్సలు జీర్ణించుకోలేమన్నారు.