
నవతెలంగాణ – ముధోల్
నియోజవర్గం కేంద్ర మైన ముధోల్ లో గల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న చెట్లను ఆదివారం రోజు నరికి వేయటం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఒకపక్క మొక్కలు నాటుమని పిలుపునిస్తుండగా మరోపక్క ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేయటం చర్చనీయాంశం గా మారింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక యువకులు ఆస్పత్రికి వెళ్లి వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. అనుమతి లేకుండా చెట్లను నరకడం సబబు కాదని అన్నారు. చెట్లు నరికిన విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఫోన్ లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఒకపక్క హరితహారాన్ని ప్రోత్సహిస్తుండగా మరోపక్క ప్రభుత్వం అధికారులే ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేయించటం విమర్శలకు తావిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెట్లను నరికివేయాలంటే ముందుగా సంబంధిత శాఖ అధికారుల నుండి అనుమతి తీసుకున్న తర్వాత చెట్లను నరకాల్సి ఉంటుంది. అయితే ఏలాంటి అనుమతులు లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం పై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి . ఈ విషయం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ జాదవ్ నవతెలంగాణ ఆదివారం పోన్ లో వివరణ కోసం ప్రయత్నించగా ఎట్టకేలకు స్పందించారు. ఈ విషయం నాకు ఆలస్యంగా తెలిసిందని ఆయన చెప్పారు. చెట్లను నరికిన వ్యక్తికి కొమ్మలు తీసి వేయాలంటే అంటే చెట్టును పూర్తి గా తీసివేసినట్టు తన దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే చెట్లపై గబ్బిలాలు ఉండడంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అయితే కొమ్మలు తీసేయమని సదరు వ్యక్తి కి చెప్పగా అర్థం కాక చెట్టును పూర్తి గా నరికి వేసిన్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చారు.