సీఐటీయూలో చేరిన సీడబ్య్లూసీ హమాలీ కార్మికులు

సీఐటీయూలో చేరిన
సీడబ్య్లూసీ హమాలీ కార్మికులు– సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: సీఐటీయూ నేతలు
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సెంటర్‌ వేర్‌ హౌసింగ్‌ బోర్డుకు చెందిన దాదాపు 200 మంది హమాలీ కార్మికులు, సొసైటీ అధ్యక్షుడు సోమగాని బాలరాజు బీఆర్‌టీయూ (బీఆర్‌ఎస్‌ అనుబంధం)కు రాజీనామా చేశారు. మంగళవారం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.రాంబాబు, కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు సమక్షంలో సీఐటీయూలో చేరారు. ఈ సందర్భంగా నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. హక్కుల సాధన, సౌకర్యాల కోసం హమాలీ కార్మికులను ఐక్యం చేసి సీఐటీయూ పోరాటం చేస్తుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ గిడ్డంగి సంస్థలను కార్పొరేట్‌ కంపెనీలకు అమ్ముతూ ప్రయివేట్‌ వ్యక్తులకు లాభాలు తెచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దేశంలో కోట్లాది మంది హమాలీలు ఎగుమతి, దిగుమతి విభాగాల్లో పనిచేస్తున్నారని, వారి వల్ల ప్రభుత్వానికి, వ్యాపార సంస్థలకు ఆదాయం అందుతోందని చెప్పారు. కానీ, హమాలీలకు కనీసం ఉండటానికి ఇల్లు, పిల్లల చదువులకు ఆదాయం కూడా సరిపోవడం లేదని, సరైన వైద్యం అందడం లేదని తెలిపారు. హమాలీలను నాల్గో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అర్హత ఉన్న వారికి వయస్సుతో నిమిత్తం లేకుండా రూ.5వేల పింఛన్‌ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు హమాలీలకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ గిడ్డంగులను కాపాడాలని, ప్రయివేట్‌ వ్యక్తులకు గిడ్డంగుల నిర్వహణ బాధ్యత ఇవ్వొద్దని అన్నారు. ఈ సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు సోమగాని బాలరాజు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చెరుకు యాకలక్ష్మీ, ఎం.శేఖర్‌, వి.సాయికుమార్‌, శేషగాని సైదులు, నరిగే జాణయ్య, అల్డాస్‌శ్యామ్‌, మొగిలి లింగయ్య, తొంటి వెంకన్న, లునావత్‌ శంకర్‌, కొమ్మగాని శేఖర్‌, నకిరేకంటి పరమేశ్‌, సోమగాని భిక్షం, వీరబోయిన నర్శింహా తదితరులు పాల్గొన్నారు.