ప్రతి పోలీసు స్టేషన్‌లో సైబర్‌ వారియర్స్‌

– నేరాల కట్టడే లక్ష్యంగా..
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలను అరికట్టడానికి శిక్షణ పొందిన సైబర్‌ వారియర్లను రంగంలోకి దించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలీసు స్టేషన్‌లో ఒక సైబర్‌ వారియర్‌ను నియమించారు. మొత్తం 858 మంది కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లకు సైబర్‌ నేరాల నిరోధంపై దాదాపు రెండు వారాల పాటు శిక్షణనిచ్చారు.
రాష్ట్ర సైబర్‌ నేరాల నిరోధక విభాగం ఆధ్వర్యంలో వీరికి శిక్షణ ఇచ్చారు. సైబర్‌ నేరాలు పసిగట్టడం వాటి రూపురేఖలపై ప్రజలను చైతన్యపర్చడం, ఆ నేరాలు జరిగినప్పుడు ఆ కేసును పకడ్బందీగా ఏ విధంగా దర్యాప్తు చేయాలి, నేరస్తులను ఏ విధంగా గుర్తించాలి, వారి నేరాలకు సంబంధించి ఆధారాలు ఏ విధంగా సేకరించాలి తదితర అంశాల్లో వీరికి సమగ్రంగా శిక్షణనిచ్చారు. వీరు ఈ నేరాల దర్యాప్తులో ఆయా స్టేషన్ల పోలీసు ఉన్నతాధికారులకు సహకరించి ఆ కేసు కోర్టులో పకడ్బందీగా చార్జ్‌షీట్‌ అయ్యేవరకూ వారి విధులను నిర్వర్తిస్తారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.