ఓరుగల్లు సాహిత్య, సాంస్కృతిక, విప్లవ పోరాటాల వారసత్వాన్ని పునికిపుచ్చు కున్నారు. చదువుతో పాటు క్రీడలు, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ప్రతిభ కనబరిచారు. ఉన్నత చదువులు అభ్యసించి ఇరవై ఏండ్లుగా వైద్య వృత్తిలో ఉంటూనే పలు సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. ఆమే వర్తమాన రచయిత్రి డా.సంధ్య విప్లవ్. కవిత్వం, కథలు, నవల, జీవితచరిత్ర, నాటకం, ఏకపాత్రాభినయం మొదలగు అనేక సాహిత్య ప్రక్రియలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…
నా బాల్యం ఎంతో అపురూపంగా సాగింది. అమ్మ నాన్న ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం వల్ల మంచి స్కూల్లో చదువుకునే అవకాశం లభించింది. అమ్మమ్మ, తాతయ్య, బంధు మిత్రుల ఆలనా పాలనతో మంచి వాతావరణంలో పెరిగాను. అలాగే నా పాఠశాల విద్య మొత్తం మిషనరీ స్కూల్ అయిన ఫాతిమా గర్ల్స్ హైస్కూల్‌లో కొనసాగింది. దర్గా, కాజీపేట్ పరిసరాలల్లో పెరగడం వల్ల విభిన్న మతాల, కులాల మధ్య మత సామరస్య సానుకూల వాతావరణంలో ఎదిగాను. మనుషులందరితో కలిసి మెలిసి బతకడం నేర్చుకున్నాను. నా స్కూల్లో వాతావరణం చదువుతో పాటే అనేక రంగాలలో ప్రావీణ్యం పొందడానికి అవకాశం ఇచ్చింది. అందుకే క్రీడలు, సాంస్కృతిక రంగాలలో రాణించగలిగాను. అనేక పోటీలలో పాల్గొని బహుమతులు పొందాను.
తాతయ్య ప్రభావంతో…
మా తాతయ్య కె.బి.మంగ్య నాయక్, గొప్ప కమ్యూనిస్టు ఉద్యమకారుడు. ఆయన వరంగల్ ఆజంజాహీ మిల్ కార్మిక నాయకుడు కూడా. మార్స్కిజం, సోవిట్ యూనియన్ గురించిన సాహిత్య పుస్తకాలు బాగా చదివేవారు. చిన్నతనం నుండి తాతయ్య ప్రభావం నాపై బాగా ఉండేది. అలా తాతయ్య ప్రభావంతో ఏడో తరగతిలో ఉన్నప్పుడు శ్రీ శ్రీ మహా ప్రస్థానం మా స్కూల్ లైబ్రరీలో చదివాను. అప్పుడు పడిన శ్రీ శ్రీ ప్రభావం ఇప్పటికీ నాలో ప్రగతిశీల ఒరవడిని కొనసాగిస్తూనే ఉందని చెప్పాలి. అలాగే మా అమ్మకు నవలలు చదివే అలవాటు ఉండేది. తను స్త్రీవాద సాహిత్యం బాగా చదివేది. అలా చిన్నతనం నుండే ఫెమినిస్ట్ భావజాలంతో పెరిగాను. అందుకే నేను ఏ రచన ఎంచుకున్నా స్త్రీ వాద కోణం నుండే మొదలుపెడతాను.
ఉరకలెత్తించే సాహిత్యం
నేను రాయడానికి స్ఫూర్తి శ్రీ శ్రీ అనే చెప్పాలి. ఎందుకంటే మహాప్రస్థానం చదవడానికి కూడా లయబద్ధంగా ఉంటూ జీవధారని ఉరకలెత్తిస్తుంది. అలాంటి ఉరకలెత్తించే సాహిత్యం నేను తెలంగాణ మలిదశ ప్రజా ఉద్యమ పోరాటాన్ని ఆవిష్కరిస్తూ రాసాను. అదే ‘నా తెలంగాణా నేల గ్రహణం వీడిన వేళ’ అనే దీర్ఘ కవిత. అదే స్ఫూర్తితో తెలంగాణ 60 ఏండ్ల పోరును, పీడిత వర్గ ప్రజల గోడును ఆవిష్కరిస్తూ 60 ఇంగ్లీష్ కవితలు రాసాను. ఆ పుస్తకమే నీల్‌కమల్ పబ్లిషర్స్ ప్రచురించిన తెలంగాణ ది ఎపిక్ సాగ ఆఫ్ సాయిల్ అండ్ సాల్ వేషన్.
నా రచనలు
స్కూల్ దశలో స్కూల్ మ్యాగజైన్‌లో నా మొదటి కవిత అచ్చయింది. 2014లో నా తెలంగాణ నేల గ్రహణం వీడిన వేళ 2016లో తెలంగాణ ది ఎపిక్ సాగ ఆఫ్ సాయిల్ అండ్ సాల్ వేషన్, 2022లో ఆద్యంతం వన జీవన విధ్వంసం దీర్ఘ కవిత, దాల్చ (అసాధారణ బహుజన మహిళా కథలు 2023), త్రికాల నవల – 2024, అరుణిమ జీవిత చరిత్ర నవల – 2024, THE BEAT GOES ON ఇంగ్లీష్ నవల (ఆముద్రితం)
స్ఫూర్తిదాయక రచనలు రావాలి
సమాజంపై సాహిత్యం చాలా బలమైన ప్రభావం చూపిస్తుంది. అందుకే రచయితలు సమాజానికి అవసరమైన రచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను, నా దు:ఖం, నా బాధలు, నా కన్నీరు, కష్టాలు అని రాయడం తగ్గించాలి. ఈ ప్రపంచం విసిరే సవాళ్ళను సమర్ధవంతంగా ఎదురు కోవడం ఎలాగో తెలిపే స్ఫూర్తిదాయక రచనలు చెయ్యాలి. అప్పుడు సమాజంలో కచ్చితంగా మార్పు వస్తుంది. మహిళా సమానత్వం సాధ్యమవుతుంది.
సహకారం అవసరం
ఏ మహిళ అయినా ఏ రంగంలో రాణించాలన్నా కుటుంబ సహకారం చాలా అవసరం. లేదంటే చాలా కష్టం. ‘నా తెలంగాణ నేల’ పుస్తకం బాలింత దశలో రాసాను. తెలంగాణ తల్లుల గర్భ శోకం తలుచుకుంటూ ఒడిలో బాబుని ఎత్తుకుని ద:ఖంతో రాసిన దీర్ఘ కవిత్వం అది. వైద్య వృత్తిలో ఇరవై ఏండ్లుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు పిల్లలు కొంచెం ఎదగడంతో కాస్త సమయం దొరికింది. ఆ సమయాన్ని రచనలకి కేటాయిస్తున్నాను. మా అమ్మ బతికి ఉన్నప్పుడు నన్ను ఎంతగానో ప్రోత్సహించేది. పెండ్లి తర్వాత నా భర్త సహకారం నిత్యం ఉంటుంది. అలాగే నా పిల్లలు కూడా చాలా ప్రోత్సహిస్తారు. వాళ్ళే నా క్రిటిక్స్ కూడా. వీరందరి సహకారం వల్లనే ఉద్యోగం చేస్తూ కూడా ఇన్ని రకాల ప్రక్రియల్లో రచనలు చేయగలుగుతున్నాను.
రాయాల్సింది చాలా వుంది
రచయితగా నా కర్తవ్యం పెద్దదే అని చెప్పాలి. అదీ భిన్న ఆస్థిత్వాల సమాహారం. నా కుటుంబం, అట్టడుగు వర్గ ప్రజలు ముఖ్యంగా స్త్రీలు భరించిన అణచివేత, దురాచారాల గురించి చాలా రాయాల్సి వుంది. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ బలిదానాల పునాదులపై ఆధునిక స్త్రీ తన చరిత్రను తిరగ రాసుకునే దశకి చేరుకుంది. అభివృద్ధి పేరుమీద జరుగుతున్న ఆదివాసి జీనవ ఆస్తిత్వ విధ్వంసం గురించీ, మెగా ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరుగుతున్నా జీవ వైవిద్య, జన, వన, జీవన విధ్వంసం గురించి రాయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. నేను రచించిన ఆద్యంతం, దాల్చ, త్రికాల, అరుణిమ పుస్తకాలు చదివితే నేను సమాజం పట్ల ఎంత నిబద్ధతతో, సమర్ధవంతంగా రాస్తున్నానో తెలుసుకోవచ్చు.
ప్రపంచానికి చాటి చెప్పాలి
రచనలు చేస్తున్నా ఓ తల్లిగా కుటుంబం నా మొదటి ప్రాధాన్యత. ఏమాత్రం సమయం దొరికినా యూనివర్సల్ భాష అయిన ఇంగ్లీష్‌లో రాయాలి. తద్వారా భారతీయ స్త్రీ చరిత్ర పున:నిర్మాణం ఎలా జరుగుతోందో ప్రపంచానికి చాటిచెప్పాలని ఉంది.ఇప్పటి వరకు నేను చేసిన రచనలకు గాను 2018లో సాహిత్య రత్న పురస్కారం భారతీయ దళిత సాహిత్య అకాడమీ, న్యూ ఢిల్లీ నుండి, అన్విక్షికి ఉగాది నవల పోటీ 2023లో త్రికాల నవలకి ప్రోత్సాహక బహుమతితో పాటు అంపశయ్య నవీన్ ఉత్తమ మొదటి నవల పోటీ 2023లో త్రికాల నవలకి మొదటి బహుమతి అందుకున్నాను.
– సలీమ