సాయంత్రమైంది. రాణి వంటింట్లో ఉంది. రాజు పిల్లల్ని తయారు చేస్తున్నాడు. బంటి, స్వీటి డ్రెస్‌లు ఏవి ఎలా వేయాలో చెబుతున్నారు. ఆ రోజు స్వీటి బర్త్‌డే.
”రా ! తొందరగా స్టార్ట్ చేద్దాం !” కేకేశాడు రాజు.
”ఆఁ వస్తున్నా!” అంటూ పని ముగించుకుని వచ్చింది రాణి.
ఇక ఆలస్యం చేయకుండా మ్యూజిక్ స్టార్ట్ చేశాడు. ఇంతలో బయట కారు శబ్దమైంది. రాజు ఎంతో అభిమానించే పువ్వు గుర్తు పార్టీ నాయకుడు తొండి కుమార్ తన అనుచరులతో సహా వచ్చాడు. పేద్ద కేక్ కూడా తెచ్చాడు. స్వీటితో కేక్ కోయించాడు. రాజు ఆనందానికి అవధులు లేవు! కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు .
”ఇంత బిజీగా ఉన్న నీవు వస్తావనుకోలేదన్నా!” అన్నాడు పూడుకుపోయిన గొంతుతో.
”గదేంది తమ్మీ! నీవు మనపార్టీల ఎంత ముఖ్యమైన కార్యకర్తవు.నీబిడ్డ కూడా వచ్చే జనరేషన్‌లో మన పార్టీని ముందుకు తీసుకుని పోవాలి! అందుకే వచ్చిన..” అన్నాడు తొండి కుమార్, రాజును సముదాయిస్తూ.
”అన్నా ! కూర్చో! మా పిల్లలు డాన్స్ చేస్తారు!” అంటూ రాజు మ్యూజిక్ ప్రారంభించాడు.
దబిడి దిబిడి పాట ప్రారంభమయ్యింది! బాలకృష్ణ గెటప్‌లో బంటిగాడు, ఊర్వశి గెటప్‌లో స్వీటి డాన్స్ చేస్తున్నారు.
పిల్లలు వేసే స్టెప్పులకు అందరూ చప్పట్లు కొడుతూ, ఎంకరేజ్ చేస్తున్నారు. మరికొందరు విజిల్స్ కూడా వేస్తున్నారు!
”ఆపండ్రా! ఆపండి!” అంటూ గర్జన లాంటి శబ్దం విన్పించింది! మ్యూజిక్ ఆపేసి అందరూ వెనుదిరిగి చూశారు!
ఆపమంటూ గర్జించింది! నాయనమ్మ!
”నాయనమ్మ రావే! స్వీటి బర్త్‌డేకు వస్తానని ముందే ఎందుకు చెప్పలేదు?’ అని నిష్టూరంగా మాట్లాడుతూ నాయనమ్మ చేతులు పట్టుకున్నాడు రాజు.
ఒక్క ఉదుటన రాజు చేతులను విదిల్చింది నాయనమ్మ! దాంతో రాజు వెళ్లి సోఫాలో పడ్డాడు
ఏమిట్రా! ఆ పాటేంటి! ఆ స్టెప్పులేంటి ! ఆ బట్టలేంటి? కోపంగా అడిగింది నాయనమ్మ!
”అది నా అభిమాన హీరో పాట! దానికి డాన్స్ చేస్తున్నారు! నీవు కూడా చూడు! బాగుంటుంది!” అంటూ ఏదో చెప్పబోయాడు రాజు.
రాజు మాటలు పూర్తి కానేలేదు! చెంప చెళ్లుమనిపించింది! నాయనమ్మ! మళ్లీ వెళ్లి సోఫాలో పడ్డాడు రాజు.
”ఏం బాగుంటుందిరా ! వాళ్లిద్దరూ అన్నా చెల్లెళ్లు ! ఆ స్టెప్పులు అట్లా వేయోచ్బా! రెండు చేతులు బిగించి, ఆ పిల్ల వెనకా ముందు గుద్దుడు ఏందిరా ? తెలివి లేదా !” మరింత కోపంగా అన్నది నాయనమ్మా!
”అది మామూలు డాన్స్ కాదు! పద్మభూషణ్ అవార్డు డాన్స్.అది తెలుసుకో నాయనమ్మా!” అన్నాడు తొండి కుమార్.
”ఇలాంటి డాన్సులకే అవార్డు, అదీ పద్మ భూషణ్ అవార్డు ఇస్తారా! ఒరే రాజా, నీక్కూడా డాన్సు వచ్చు కదా ! నీవు వెళ్లి మీ లీడర్ భార్యతో ఇదే డాన్స్ చేయ్యిరా ! నీ క్కూడా అవార్డు వస్తుంది!” అన్నది నాయనమ్మ.
రాజు సోఫాలో నుండి ఉత్సాహంగా లేచాడు.
”నేనొప్పుకోను ! కుదరదంతే!” గట్టిగా అరిచాడు తొండికుమార్.
”చూశావా! అవార్డు పొందిన డాన్సు కదా! మీ ఇంట్లోని వాళ్లతో చేయమంటుంటే, వినగానే వద్దన్నావు! మరి పరాయి ఆడవాళ్లతో ఆ వెకిలి స్టెప్పులు వేస్తుంటే చూసి ఎంజారు చేస్తారా! సిగ్గులేదా?” నిలదీసింది నాయనమ్మ.
”అవార్డు పాటకి, డాన్సుకి కాదు! యాభై ఏండ్లు ఆయన కళామతల్లికి ఎనలేని సేవ చేశాడు! అందుకిచ్చారు!” అన్నాడు తొండి కుమార్ ఉక్రోశంగా.
”నా వయస్సు డెభ్భై ఏండ్లు! గత యాభై ఏండ్లుగా ఆయనగారు చేసిన సినిమాలు చూసిన! మాట్లాడిన మాటలు కూడా విన్నా. ఒక్కటైనా ప్రజల సమస్యల మీద, వారి కష్టసుఖాల మీద తీసిన సినిమా ఉందా ! వరసబెట్టి కత్తితో నరుకుడే! అలాంటి సినిమాలకు అవార్డులా? అదేనా కళామతల్లికి సేవ !” అన్నది నాయనమ్మ,
”అది వీరరసం ! నాయనమ్మా !” అన్నాడొకడు తొండి కుమార్ వెనక నుండి ముందుకు వచ్చి!
వాడ్ని నాయనమ్మ ఈడ్చి కొట్టింది! వాడు వెళ్లి గోడకు గుద్దుకున్నాడు. ”వెధవ కూతలు కూసేవాడి దవడ పగలకొట్టడమే వీరరసమంటే! ఆయన ఏ మీటింగ్‌లోనైనా సరే! వెకిలి మాటలు మాట్లాడకుండా ఉపన్యాసం ఇచ్చాడా! ఆడవాళ్లని ఏనాడైనా గౌరవంగా చూశాడా! అలాంటి వాడికి ఆవార్డు ఇస్తారా?” అన్నది నాయనమ్మ.
”ఝాన్సీలక్ష్మి వేశం వేసిన కంగనకు కూడా అదే ఆవార్డు వచ్చింది!” అన్నాడు మరొకడు తొండి కుమార్ వెనక నుండి.
”కంగనకు అవార్డు ఇచ్చిన వాడి పళ్లు రాలగొట్టాలి! వాడెవడో కడుపుకి అన్నం తింటాడా, గడ్డి తింటాడా? గిట్టుబాటు ధర కావాలని రాత్రింబవళ్లు చలిలో పోరాడుతున్న రైతులకి వ్యతిరేకంగా మాట్లాడినందుకా అవార్డు! తెర మీద దేశ నాయకురాలి పాత్ర వేస్తే చాలదు! తెరవెనక కూడా అలాగే ఉండాలి! అన్నది నాయనమ్మ.
”మీ నాయనమ్మకి పెద్దగా దేశభక్తి లేదు రాజు!” అన్నాడు తొండికుమార్.
”మీకుందా దేశభక్తి! ఉంటే ఆ జపాన్ వాడికెందుకు అవార్డు ఇచ్చారు?” నిలదీసింది నాయనమ్మ,
తొండి కుమార్‌కి ఏం చెప్పాలో తోచలేదు!
”గద్దర్‌కి అవార్డు ఇవ్వనందుకే ఇవ్వన్ని మాట్లాడుతున్నావు కదా నాయనమ్మా!” అన్నాడు మరొకడు తొండి కుమార్ వెనక దాక్కుంటూ.
నాయనమ్మ పెద్దగా నవ్వింది!
”గద్దర్‌కి అవార్డు ఇస్తే ఎంత? ఇవ్వకుంటే ఎంత? అలాంటి వారికి అవార్డులు ఇవ్వకపోవటమే మంచిది!” అన్నది నాయనమ్మ.
తొండి కుమార్‌కి ఏమీ అర్థం కాలేదు! గుండు గొక్కున్నాడు.
”నీకు అర్థం కాలేదా? అవార్డులకి ఒక విలువ, గౌరవం ఉంటాయి. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారికి, సేవచేసిన వారికి ఆవార్డులు ఇస్తే సముచితంగా ఉంటుంది! ఆవార్డుకి విలువ పెరుగుతుంది! తీసుకున్నవారి గౌరవం కూడా పెరుగుతుంది !” అన్నది నాయనమ్మ.
”మన సంస్కృతి పెంచేలా అవార్డులు ఇచ్చారు!” అన్నాడు తొండికుమార్.
”సంస్కతి అంటే తెలుసా నీకు! సంస్కతి అంటే మన జీవనవిధానం! భవిష్యత్ తరాలకు మనం అందించే వారసత్వం! పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి ఉన్నత అవార్డులు ఇచ్చేటపుడు, ఇవి చూసుకున్నారా! ఏదో పేరుకి ఇద్దరు ముగ్గురు గొప్పవారికి ఇచ్చారు! గాని గత పదేండ్లలో మీరు అవార్డులు ఇచ్చిన వారంతా మన సంస్కృతిని నాశనం చేస్తున్న వారే ఉన్నారు! మహిళను దేవీ స్వరూపంగా కొలిచే సంస్కృతి మనది! అందుకే సంక్రాంతి, ఓనమ్, ఉగాది లాంటి పండుగలు ఏర్పాటు చేసుకున్నాము. మీరు ఇచ్చిన అవార్డుల్లో కష్టజీవుల సంస్కృతి లేదు! మీదంతా దబిడి – దిబిడి సంస్కృతి” అన్నది నాయనమ్మ.