రేపటి మనకు నిలువుటద్దం నాన్న. నాన్న ఓర్పుకి మారు పేరు. మార్పుకి మార్గదర్శి. నీతికి నిదర్శనం. మన ప్రగతికి సోపానం. తప్పటడుగులు వేస్తూ నడక నేర్చుకునే దశలో బిడ్డకు సంరక్షకుడు. అక్షరాలు నేర్చే దశలో గురువు. తప్పు చేస్తే దండించి మంచిని ప్రభోదించే ప్రవచన కర్త. యుక్తవయసులో జీవనోపాధికి అవసరమయ్యే విజ్ఞానాన్ని విపులీకరించే మిత్రుడు. నడివయసులో వచ్చే ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కోవడంలో సలహాలివ్వగలిగే అనుభశాలి. ఇలా ప్రతి మనిషి జీవన క్రమంలో తండ్రి పాత్ర అత్యంత కీలకం. అందుకే పిల్లలతో తండ్రి గడిపే సమయం వారి భవితకు ఎంతో ముఖ్యం. ఈ రోజు అంతర్జాతీయ పితృదినోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత్రి, ప్రముఖ వ్యాఖ్యాత తమ తండ్రులతో వారి అనుబంధాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు.
అంతర్జాతీయ పితృ దినోత్సవం ప్రతి ఏడాది జూన్ నెలలో మూడో ఆదివారం జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా యాభై రెండు దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పితృ దినోత్సవాన్ని సోలార్ అనే అమ్మాయి స్మార్ట్ డాడ్ అనే పేరుతో ప్రారంభించింది. తన తల్లి మరణించిన తర్వాత తన ఆరుగురు తోబుట్టువులను కంటికి రెప్పలాగా కాపాడి పెంచి పెద్ద చేసిన తన తండ్రి గౌరవార్థం మొట్టమొదటిసారిగా 19 జూన్ వాషింగ్టన్ ఇంచార్జ్ ఆ సందర్భాన్ని అధికారికంగా అనుమతించడంతో అప్పటి నుండి ఈ పితృ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నారు. ఈ పితృ దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులకు అందరికి శుభాకాంక్షలు తెలుపు కోవడం ఒక సాంప్రదాయంగా మారింది.
మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. కుటుంబ పెద్దగా నాన్న తన బాధ్యతలను నిర్వహిస్తూనే పిల్లల సంరక్షణ విషయంలో అత్యంత శ్రద్ధని కనబరుస్తాడు. పిల్లలకు విద్యా బుద్దులు నేర్పుతూ, మంచి చెడులను వివరిస్తూ, ప్రపంచం అంటే ఏమిటో, ఎలా బతకాలో తెలియజేస్తాడు. పిల్లలకు నాన్న ఉన్నారు అనే మనోధైర్యం ఆ తండ్రి ప్రవర్తన వల్లనే వస్తుంది. నాన్న కోప్పడితే పిల్లలపై ప్రేమలేనట్టు కాదు. మౌనంగా ఉంటే మాట్లాడటం ఇష్టం లేదని కాదు. కొడితే ఆప్యాయత లేదని కాదు. ఆజ్ఞలు వేస్తుంటే ఇదేంటని బాధపడొద్దు. తర్వాత మనకే తెలుస్తుంది ఈ అన్నింటి వెనకున్న నాన్న ప్రేమ ఎంత గొప్పదో అని! మన భవిష్యత్తు కోసమే నాన్న తపన. తన బిడ్డల ఎదుగుదలకై తాను కరుగుతూ, తన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే తండ్రులకు పితృ దినోత్సవ శభాకాంక్షలు…
సేకరణ: పాలపర్తి సంధ్యారాణి
నాన్నే నా బెస్ట్ ఫ్రెండ్
నాన్న ఎర్రమిల్లి శ్రీకృష్ణ మూర్తి, అమ్మ రుక్మిణి. నాన్న జిల్లా జడ్జిగా చేసేవారు. వారికి మేము ఆరుగురం సంతానం. అమ్మ ఎక్కువ చదువుకోకపోయినా పుస్తకాలు బాగా చదివేవారు. నాన్నకు కూడా సాహిత్యం పట్ల అభిరుచి ఉండేది. దాంతో మా ఇంట్లో అందరికీ పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుండి బాగా అలవాటు. నాన్న ఉద్యోగరీత్యా ప్రతి ఏడాది బదిలీ అవుతుండేవి. అందుకే నాకు స్నేహితులు ఎవరూ లేరు. పుస్తకాలే నా ప్రపంచం. నాన్న దగ్గర నాకు చనువు ఉండేది. అయినా భయం కూడా ఉండేది. సాయంత్రం కోర్టు నుండి రాగానే మమ్మల్ని అందరిని కూర్చో బెట్టి మా స్కూల్లో చెప్పిన పాఠాలు చదివించే వారు. ఇంట్లో ఎప్పుడైనా పనిచేస్తూ కనపడితే అమ్మ మీద కేకలేసేవారు. ‘పని ఎందుకు చేయిస్తావ్, వాళ్ళని చదువుకోనివ్వు’ అనేవారు. ఆడపిల్లలకు చదువు చాలా ముఖ్యం అనేవారు. నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడే చిన్న చిన్న కవితలు రాయడం మొదలుపెట్టా. ఆ కవితలు నాన్నకు చూపిస్తూ ఉండేదాన్ని. చదివి ‘చాలా బాగా రాశావు, ఏదైనా పత్రికకు పంపించు’ అని ప్రోత్సహించేవారు. మేము ఏ ఊర్లో ఉన్నా స్థానికంగా వుండే అక్కడి పత్రికలన్నీ మా ఇంటికి వస్తుండేవి. ఆ పత్రికల్లో నా కవితలు వస్తుండేవి.
కాలేజీలో చదువుతూ ఉండగా మంజువాణి అనే పత్రిక వాళ్ళు విద్యార్థులకు రాష్ట్ర స్థాయి కథల పోటీ పెట్టారు. నేను ‘మనిషిని అనిపించే కుంటే చాలు’ అనే కథను ఆ పత్రిక నిర్వహించిన పోటీకి పంపిస్తే మొదటి బహుమతి వచ్చింది. అది విని నాన్న ఎంతో సంబరపడిపోయారు. నాలోనూ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ తర్వాత యువ మాసపత్రికకు ‘వాడుకైనవాడు’ అనే కథను రాసి పోస్ట్ చేసాను. ఆ కవర్ పోస్ట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత గుర్తుకొచ్చింది, దానిమీద నా చిరునామా కానీ, పత్రిక చిరునామా కానీ రాయలేదని. అప్పుడు నాన్న దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పాను. వెంటనే నాన్న తన దగ్గర పని చేస్తున్న బంట్రోతిని పిలిచి ‘మూడు గంటలకి పోస్టు డబ్బా తెలుస్తారు, అది తెరిచేంతవరకు నువ్వు అక్కడే ఉండు, అడ్రస్ లేని కవర్ ఏదైతే ఉంటుందో అది పట్టుకుని రా’ అని చెప్పారు. పాపం అతను పోస్ట్ డబ్బా తెరిచే వరకు అక్కడే ఉండి, ఆ కవరు తెచ్చి నాన్నకు తెచ్చి ఇచ్చాడు. ఆ కవర్ తీసుకొని నా చిరునామా, పత్రిక చిరునామా రాసి పోస్ట్ చేశాను.
మేము విజయవాడలో ఉన్నప్పుడు చిత్ర శత దినోత్సవ వేడుకలకు నాన్నను ముఖ్య అతిథిగా పిలిచేవారు. నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్లి ముందు వరుసలో కూర్చోబెట్టేవారు. అక్కడ వాళ్ళు ఇచ్చే గోల్డ్ స్పాట్ తాగుతూ సినిమా రంగంలోని ప్రముఖులను దగ్గరగా చూడటం నాకెంతో సంబరంగా ఉండేది. అలా చాలా మంది ప్రముఖులను దగ్గరగా చూసాను. మా అందరికీ సినిమాలంటే ఇష్టం ఉండేది కనుక ప్రతి పది రోజులకి మమ్మల్ని నాన్న రెండు రిక్షాల్లో ఎక్కించుకొని తీసుకెళ్లేవారు. చూడటానికి అదొక ఊరేగింపుగా ఉండేది. మా కాలేజీ రోజుల్లో మా చదువుల గురించి, స్నేహితుల గురించి కనుక్కుంటుండేవారు. పైకి మాత్రం ఏమీ పట్టనట్టు కనిపించేవారు. నాన్నే నా బెస్ట్ ఫ్రెండ్. నా మంచి, చెడు, ఆనందం, విజయం అన్నింటి వెనుక నాన్నే ఉన్నారు. నా కోసం ఎంతో త్యాగం చేశారు. నా కోసం నా లోకమై నాతోనే ఉండి నన్ను నడిపించిన నాన్నకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను.
నాన్నే ఓ ధైర్యం
నాన్న కేశప్రగడ సూర్యనారాయణ శర్మ. అమ్మ రేవతి. నాన్న ఎమ్మె సోషల్ వర్క్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ మనేజ్మెంట్ నుండి చేశారు. అక్కడ వారికి స్కాలాషిప్ వచ్చేది. తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి నష్టాలు చవి చూసారు. ఆ తర్వాత చదువు మీద దృష్టి పెట్టారు. నేను డిగ్రీ చదువుతుండగా నాతో పాటు ఎల్‌ఎల్‌బి చదివి, నేను పీజీ చదువుతుంటే, నాన్న ఎల్‌ఎల్‌ఎం చేసి ఆయన కేసులు ఆయనే వాదించుకుని గెలిచారు. నాన్న లా లో పీహెచ్‌డీ కూడా చేశారు. చిన్నప్పటి నుండి నాన్న అన్ని విషయాల్లో ఎంతో ప్రోత్సహించే వారు. ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటే మేము అందులో పాల్గొనేలా చేసేవారు. నాన్న మల్టీ టాస్కర్. పుస్తకాలు ఎక్కువగా చదివే వారు. నాతో కూడా రోజూ పేపర్లు, పుస్తకాలు చదివించేవారు. అప్డేట్‌గా ఉండాలని అనేవారు. ఒక యాంకర్‌కి తప్పని సరిగా అన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలని చెప్పేవారు.
నేను కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశాను. అలాగే కార్పొరేట్ కంపెనీల్లో శిక్షణ కూడా ఇచ్చేదాన్ని. నాన్న హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లో చేయడం వల్ల వారి సలహాలు తీసుకుంటూ ఉండేదాన్ని. వారి అనుభవాలు నాకెంతో ఉపయోగపడేవి. చిన్నప్పటి నుండి నాకెంతో స్వేచ్ఛ ఇచ్చారు. ఇంటికి ఆలస్యంగా వచ్చినా ఏమి అనేవారు కాదు. నా వృత్తిని అర్ధం చేసుకునేవారు. జీవితంలో ఏ అవకాశం వచ్చినా వదిలి పెట్టొదనేవారు. మా వారు మా ఇంటికి వచ్చి నన్ను పెండ్లి చేసుకుంటాను అనగానే ఉద్యోగం, కుటుంబ నేపధ్యం తెలుసుకుని మా పెండ్లి చేశారు. మా వారి ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు బదిలీలు అవుతుండేవి. పిల్లలతో చూసుకోలేక ఇబ్బంది పడుతుంటే నాన్న వెంటనే పిల్లలకు అవసరమైనప్పుడు అండగా నిలబడకపోతే ఎలా అంటూ అమ్మను తీసుకుని నా దగ్గరకు వచ్చేసారు. మా పెద్దబ్బాయి అక్షజ్ అంటే నాన్నకు విపరీతమైన ప్రేమ. వాడు ఫూట్ బాల్ ప్లేయర్. నాన్న కూడా స్పోర్ట్స్ బాగా ఆడేవారు. నా వారసుడు అంటూ వాడిని చూసుకుని మురిసిపోయేవారు. నాన్నా 26 డిసెంబర్ 2023న మా నుండి దూరమయ్యారు. కానీ ఆయన జ్ఞాపకాలు అనుక్షణం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నాన్నా ఓ భరోసా, నాన్న ఓ ధైర్యం, నాన్నంటే మర్చి పోలేని జ్ఞాపకం.
– గాయత్రి భార్గవి, వ్యాఖ్యాత నటి