వహీదాకు దాదాసాహెబ్‌ ఫాల్కే

ఏడు దశాబ్దాల క్రితం తెలుగు తెరపై అరంగ్రేటం చేసిన వహిదా రెహమాన్‌ అనతి కాలంలోనే హిందీ చిత్రాలలో నటించి, ఉత్తరాది ప్రేక్షకులను అలరిచిన అలనాటి అందాల తార. వహీదా ను భారత అత్యున్నత సినీ పురస్కారం ‘దాదాసాహెబ్‌ ఫాల్కే జీవిత సాఫ్యల అవార్డు’ వరించింది. చిత్రపరిశ్రమకు అందించిన సేవలకుగానూ ఆమెకు ఈ సినీ అత్యున్నత పురస్కారాన్ని ఈ ఏడాది 69వ జాతీయ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో అందజేయనున్నారు. వహిదా ఎన్టీఆర్‌ నటించిన ‘జయసింహ’ సినిమాలో రాజకుమారి పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే విడుదలైన ‘రోజులు మారాయి’ సినిమాలో ”ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా..” పాటలో నటించడంతో వహిదాకు ఇదే తన తొలి చిత్రంగా మారింది. 1971లో ‘రేష్మా ఔర్‌ షేరా’ చిత్రంతో వహీదా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచింది. 1972లో పద్మశ్రీ’, 2011లో పద్మభూషణ్‌’ పురస్కారాలు అందుకున్న, వహీదా రెహమాన్‌ 1955 లో తెలుగులో ‘రోజులు మారాయి’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి గురుదత్‌ సహకారంతో హిందీ చిత్ర రంగంలో ప్రవేశించింది. ఎన్నో హిట్‌ చిత్రాలలో నటించి అగ్ర నటీమణుల స్థాయికి ఎదిగిన వహీదా ‘గైడ్‌’ చిత్రంలో అతి క్లిష్టమయిన ‘రోజీ’ పాత్ర పోషించి అందరి చేత ప్రశంసలు పొందింది. తన నట జీవితంలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో దాదాపు 200కు పైగా చిత్రాలలో నటించి భారతదేశపు ఉన్నత శ్రేణి నటీమణుల్లో ఒకరిగా వెలుగొందింది. వహీదా నటనా కౌశలనికి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు, మూడు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు, జాతీయ చలనచిత్ర అవార్డు, భారత ప్రభుత్వం 1972 లో పద్మశ్రీ, 2011 లో పద్మభూషణ్‌ పురస్కారాలు ఆమెను వరించాయి. ”ప్యాసా, కాగజ్‌ కే ఫూల్‌, చౌద్వీన్‌ కా చాంద్‌, సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్‌, తీస్రీ కసమ్‌, గైడ్‌” వంటి అత్యుత్తమ చిత్రాలలో అద్భుతంగా నటించి అందరి చేత సెభాష్‌ అనిపించుకున్న వహీదా రెహమాన్‌ కు భారత ప్రభుత్వం ‘దాదాసాహెబ్‌ ఫాల్కే జీవిత సాఫ్యల అవార్డు’ ను ప్రకటించిన సందర్భంగా నవతెలంగాణ ”సోపతి” పాఠకుల కోసం అందిస్తున్న ప్రత్యేక వ్యాసం.
వహీదా రెహమాన్‌ 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో తమిళ, ఉర్దూ మాట్లాడే సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ముంతాజ్‌ బేగం, మహమ్మద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ దంపతులకు జహీదా, షహీదా, సయిదా తర్వాత నాలుగవ సంతానం వహిదా. నలుగురు కూతుళ్ల పేర్ల చివర ‘దా’ వచ్చేలా పెట్టిన అబ్దుల్‌ రెహమాన్‌ అభ్యుదయ భావాలు వున్న వ్యక్తి. ఆయన మద్రాసులో కమిషనర్‌ గా ఉద్యోగం చేసేవాడు. ఆయన ఉద్యోగ రీత్యా తమిళనాడుతో పాటు కేరళ తదితర ప్రాంతాలలో పని చేస్తూ, తెలుగు నేల రాజమండ్రి, విశాఖపట్టణంలలో సైతం పనిచేశారు. రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్న సమయంలో వహీదా శ్రీరాంచంద్రన్‌ అనే నాట్యాచార్యుడి వద్ద అక్క సయిదాతో కలసి నత్యం నేర్చుకుంది. రాజమండ్రి నుండి విశాఖపట్నం బదిలీ అయిన తర్వాత ఒకరోజు అప్పటి గవర్నర్‌ జనరల్‌ రాజాజీ విశాఖపట్నం పర్యటనకు వచ్చినపుడు ఈ అక్కాచెల్లెలిద్దరు కలసి తొలిసారి స్టేజ్‌ పై డాన్స్‌ చేశారు. వహిదా అక్కడి ‘సెయింట్‌ జోసెఫ్స్‌ కాన్వెంట్‌’ లో చదువుకోవడంతో తెలుగు బాషను నేర్చుకునే అవకాశం ఏర్పడింది. వహిదా పదమూడేళ్లున్నపుడు 1951లో నాన్న అబ్దుల్‌ రెహమాన్‌ హఠాత్తుగా చనిపోవడంతో అనారోగ్యంతో ఉన్న తల్లి కుటుంబ బాద్యతలు మోయడానికి నానా కష్టాలు పడింది. అయితే అప్పటికే వహీదా ఇద్దరక్కల పెళ్లిలు అయిపోవడంతో తల్లికి ఆర్థికంగా అండగా ఉండేందుకు సయిదా, వహిదా ఇద్దరు కలిసి నత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. డాక్టర్‌ కావాలనే తన కలను పక్కన పెట్టి కుటుంబానికి సహాయం చేయడానికి వహీదా డాన్స్‌ ప్రదర్శనల ద్వారా వచ్చిన సినిమా ఆఫర్లను అంగీకరించింది.
సినీరంగ ప్రవేశం
వహీదా ‘జయసింహ’ చిత్రంలో ఎన్‌.టి.ఆర్‌ సరసన నటించి సినీరంగంలో ప్రవేశించింది. ఎన్‌.టి.ఆర్‌ తో నటించడంతో సినీ పరిశ్రమలో అందరి దృష్టి వహిదాపై పడింది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుండగానే, సారథీ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మాతల్లో ఒకరైన రామకృష్ణ ప్రసాద్‌ నిర్మించిన ‘రోజులు మారాయి’ చిత్రంలో ”ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా” పాటకి నర్తించి గొప్ప గుర్తింపును పొందింది. ఈ ఒక్క పాట కోసమే సినిమాను చూసిన వాళ్ళూ ఉన్నారు. ఈ చిత్రం అనేక సెంటర్లలో ‘రజతోత్సవాలు’ జరుపుకుంది. ఈ సినిమాను తమిళంలో ‘కాలం మారిపోచ్చి’ పేరుతో పునర్నిర్మించినపుడు అందులోనూ ఇదే పాటపై వహీదా డాన్స్‌ చేసింది.
గురుదత్‌ ద్వారా హిందీ సినీ పరిశ్రమలోకి:
హైదరాబాద్‌ లో ‘రోజులు మారాయి’ వందరోజుల వేడుక జరిగింది. ఆ వేడుకలలో డాన్స్‌ చేసిన వహీదాను గురుదత్‌ మొదటిసారి చూశారు. వహీదాకు ఉర్దూ కూడా బాగా మాట్లాడడం వచ్చని తెలుసుకున్న గురుదత్‌ ఆమెని హిందీ చిత్రసీమకు పరిచయం చేయాలనుకుని, దేవానంద్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన తన ‘సి.ఐ.డి.’ చిత్రంలో రెండవ హీరోయిన్‌గా వహిదా రెహమాన్‌కు అవకాశమిచ్చి హిందీ సినిమా రంగానికి పరిచయం చేశారు. ఈ సినిమా పలుచోట్ల రజతోత్సవాలు జరుపుకోగా, ఇందులో నటించిన దేవానంద్‌తో వహీదాకు మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో వహిదా, దేవానంద్‌ సినిమాల్లో ఎక్కువగా కథానాయిక పాత్రలు చేయడానికి కారణం తన తొలిచిత్రంలో దేవానంద్‌తో ఏర్పడిన మొదటి స్నేహం కావడమే. ‘సి.ఐ.డి.’ చిత్రం బాక్సాపీస్‌ వద్ద హిట్‌ సాదించడంతో.., వహీదాలోని నటిని గురుదత్‌ ఎంతగానో ప్రోత్సహించారు. వహీదా కథానాయికగా ‘ప్యాసా’ చిత్రానికి రూపకల్పన చేసి నాయకుడి పాత్రకోసం ముందు దిలీప్‌కుమార్‌ ని అడిగితే, స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తే ఓ.కె అన్నారట. అందుకు గురుదత్‌ ఒప్పుకోలేదు. తర్వాత అశోక్‌కుమార్‌ని అడిగితే ఆ పాత్ర పట్ల అంత ఆసక్తి కనబరచలేదట. ఇక చివరకి దేవానంద్‌నే అడిగితే ”నీ మనసులో పుట్టిన పాత్ర… ఆ పాత్రని నువ్వు చేస్తేనే న్యాయం చేకూరుతుంది.. నాలాంటి హీరోలు ఆ రోల్‌ వేస్తే కమర్షియల్‌ ఇమేజ్‌ కి అవరోధం” అని చెప్పి గురుదత్‌ని దేవానంద్‌ ఒప్పించారు. చివరకు ప్యాసా లోని విజరు పాత్రని ఆయనే వేశారు. అయితే ఈ చిత్రంలో వేశ్యపాత్ర అయిన ‘గులాబ్‌’ పాత్రలో నటించడానికి నర్గీస్‌, మధుబాల పోటీ పడ్డప్పటికి ఆ పాత్రలో వహీదానే నటింపచేసి, వాళ్ళకి అందులోని మీనా పాత్రను ఆఫర్‌ చేశారు. ‘నర్గీస్‌, మధుబాల’ తిరస్కరించడంతో ఆ పాత్రని మాలాసిన్హా వేశారు. ఈ చిత్రం విడుదల అయ్యాక ఘన విజయం సాదించింది. ఒకే సంవత్సరం ‘సి.ఐ.డి.’, ‘ప్యాసా’, రెండు చిత్రాలు విజయవంతం కావడంతో వహీదా రెహమాన్‌ తారపథంలోకి దూసుకెళ్లింది. అయితే వహీదా ఈ ఆనందంలో ఉండాగానే తల్లి మరణించడం, మూడో అక్క సయిదా పెళ్ళయి వెళ్లిపోవడంతో వహీదా ఒంటరిగా మిగిలిపోయింది. ఈ తరుణంలోనే దేవానంద్‌ వహీదాను ఓదార్చి మనోదైర్యం కలిగించారు. ఆ తరువాత వహీదా రెహమాన్‌ అనేక విజయవంతమైన హిందీ చిత్రాలలో నటించి మెప్పించారు. దేవానంద్‌ తో కలిసి వహీదా అత్యధికంగా ఏడు సినిమాలలో నటించింది. వీటిలో ఐదు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ సాదించాయి. వాటిలో ‘సిఐడి, సోల్వా సాల్‌, కాలా బజార్‌, బాత్‌ ఏక్‌ రాత్‌ కి, గైడ్‌’, కాగా, 1961 లో వచ్చిన ‘రూఫ్‌ కీ రాణి చోరోన్‌ కా రాజా’, 1970 లో వచ్చిన ‘ప్రేమ్‌ పూజారి’ చిత్రాలు మాత్రం ప్లాప్‌ అయ్యాయి. గురుదత్‌ తో ‘ప్యాసా, 12 క్లాక్‌, కాగజ్‌ కె పూల్‌, చౌద్వీన్‌ కా చాంద్‌, సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్‌’ చిత్రాలలో వహిదా రెహమాన్‌ కలసి పని చేసింది. సునీల్‌దత్‌తో నటించిన ఐదు చిత్రాలలో, నాలుగు చిత్రాలు ‘ఏక్‌ పూల్‌ చార్‌ కాంటే, ముజే జీనే దో, మేరీ బాబీ, ధర్పణ్‌’ విజయవంతమవ్వగా, ‘రేష్మ ఔర్‌ షెరా’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పొందిన ఇందులోని వహీదా నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆమె కెరీర్‌లో ఘన విజయం సాదించిన ‘ఖామోషి’ చిత్రంలో రాజేష్‌ ఖన్నా సరసన నటించింది. రాజేంద్ర కుమార్‌తో ఆమె చేసిన 3 సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలయ్యాయి. కమల్‌ జిత్‌సింగ్‌ తో కలిసి వహిదా 1964 లో ‘షాగూన్‌’ చిత్రంలో నటించగా, ఈ చిత్రం పరాజయం చెందింది. అయితే ఈ చిత్రనిర్మాణ సమయంలో వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ 1974 లో వివాహం వరకు సాగింది. 1971 లో సంజీవ కుమార్‌ సరసన నటించిన మన్‌ మందిర్‌ చిత్రం ఆమె ప్రధాన కథానాయికగా నటించిన చివరి హిట్‌ చిత్రం. వహీదా రెహ్మాన్‌ 1959-64 మధ్యకాలంలో అత్యధిక పారితోషికం పొందిన నటిగా మూడవ స్థానంలో, 1966-1969 మధ్య కాలంలో నందా, నూతన్‌లతో కలిసి రెండవ అత్యధిక పారితోషికం పొందిన నటిగా నిలిచింది. వహీదా 1962లో సత్యజిత్‌రే చిత్రం ‘అభిజన్‌’తో బెంగాలీ చలనచిత్ర రంగంలోకి ప్రవేశించింది.
తెలుగు సినిమాలలో..
వహీదా రెహమాన్‌ తెలుగు తెరపై దర్శక, నిర్మాత విఠలాచార్య రూపొందించిన ‘కన్యాదానం’ చిత్రంలో డాన్స్‌ చేసే పాత్రలో తొలిసారి నటించింది. ఆ తరువాత యన్టీఆర్‌ సొంత సంస్థ ఎన్‌.ఏ.టి. పతాకంపై ఓ భారీ జానపదం తీయాలని యన్టీఆర్‌, ఆయన మిత్రులు భావించారు. అందుకు ‘జయసింహ’ కథ సిద్ధం చేసుకున్నారు. అందులో ఓ నాయికగా అంజలీదేవిని ఎంచుకున్నారు. రాజకుమారి పాత్రలో ఓ కొత్త నటిని నటింప చేయాలన్నది యన్టీఆర్‌, ఆయన దర్శకుడు డి.యోగానంద్‌ భావన. అలా యన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమరావు, ఆయన మిత్రులు కలసి వహీదా రెహమాన్‌ గురించి తెలుసుకొని, ఆమెను తమ చిత్రంలో నాయికగా ఎంచుకున్నారు. ఈ లోగా వహీదా రెహమాన్‌ నృత్యం గురించి తెలుసుకున్న దర్శకుడు తాపీ చాణక్య తమ ‘రోజులు మారాయి’లో కొసరాజు రాసిన ”ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా” పాటలో నర్తించడానికి వహీదాను ఎంపిక చేసుకున్నారు. అలా వహీదా రెహమాన్‌ ‘రోజులు మారాయి’ చిత్రంలో తళుక్కుమన్నారు. తరువాత నాయికగా ‘జయసింహ’లో జనం మదిని దోచుకున్నారు. ఎమ్జీఆర్‌, భానుమతి నటించిన రంగుల చిత్రం ‘ఆలీబాబా 40 దొంగలు’ చిత్రంలోనూ ఓ నృత్యగీతంలో మురిపించారు వహీదా. చాలా రోజుల తరువాత ‘రోజులు మారాయి’ హీరో అక్కినేని నటించిన ‘బంగారు కలలు’లో ఆయనకు సోదరిగా నటించారు వహీదా. ఆ తరువాత 1986లో కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన ‘సింహాసనం’లో వహీదా రాజమాతగా అభినయించారు. ఆ తర్వాత చాలా ఏళ్ళకు 2006లో సిద్ధార్థ్‌ హీరోగా అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించిన ‘చుక్కల్లో చంద్రుడు’ చిత్రంలో గ్రాండ్‌ మదర్‌ పాత్రను పోషించింది. కమల హాసన్‌ హీరోగా రూపొందిన విశ్వరూపం 2 చిత్రంలో నటించింది.
కమల్‌జిత్‌ తో వివాహం
వహీదా రెహమాన్‌ 1968లో తనతో ‘షగున్‌’లో హీరోతో పాటు పలు హిందీ సినిమాల్లో నటించిన నటుడు, వ్యాపారవేత్త అయిన ‘కమల్‌ జీత్‌’ను ఏప్రిల్‌ 27,1974న వివాహమాడి బెంగుళూరులోని కమల్‌ ఫామ్‌హౌస్‌కి మారింది. కొన్నాళ్ళకి వారికి ‘సోహైల్‌’ అనే కుమారుడు, ‘కష్వి’ అనే కుమార్తె వున్నారు. కమల్‌జిత్‌ అనారోగ్యం పాలైనప్పుడు, కుటుంబంతో సహా వారు బాంబేలోని ఓషన్‌-వ్యూ బంగ్లాకు తిరిగి వచ్చేశారు. 2000వ సంవత్సరం నవంబర్‌ 21న కమల్‌జిత్‌ కన్నుమూశారు. కుమారుడు సోహైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో పని చేస్తుండగా, కష్వి జ్యువెలరీ డిజైనర్‌ గా స్థిర పడ్డారు. వహీదా రెహమాన్‌ తన భర్త మరణం తర్వాత పిల్లలతో బాటే ఉంటూ, 7 చిత్రాలలో నటించింది. 85 ఏళ్ళు నిండినా ఇప్పటికీ హుషారుగా ఉండే వహీదా రెహమాన్‌, తన తరం తారలయిన నందా, ఆషా పరేఖ్‌, హెలెన్‌ తో కలసి ‘దిల్‌ చాV్‌ా తా హై’ అంటూ అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో బోటింగ్‌ చేసిన పిక్స్‌ అభిమానులను అలరించాయి.
వహీదాతో గురుదత్‌ ప్రేమ
దర్శకుడు, కొరియోగ్రాఫర్‌, నటుడిగా హిందీ చిత్రసీమలో చాలా పేరు సంపాదించుకున్న గురుదత్‌, వహీదా రెహమాన్‌ ను ఎంతగానో ప్రేమించాడు. గురుదత్‌ ‘సి.ఐ.డి’ సినిమా నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు దారి తీసింది. వహీదా ప్రేమలో మునిగిపోయిన గురుదత్‌ ‘ప్యాసా’ సినిమాలో వీరిద్దరి జోడీ బాగా నచ్చడంతో వీరిద్దరి ప్రేమ కథలుగా తెరపైకి వచ్చాయి. గురుదత్‌ సినిమాల్లో వహీదా రెహ్మాన్‌కి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు రాసేవారని చెబుతారు. అంతకు ముందే గీతాదత్‌ని వివాహం చేసుకున్న గురుదత్‌, వహీదాతో పెళ్లి ప్రస్తావన గీతాదత్‌ వద్ద తెచ్చినపుడు ఆమె తీవ్ర మనస్తాపానికి గురై విడిగా జీవితాన్ని ప్రారంభించిదని గురుదత్‌ స్నేహితుడు అబ్రార్‌ అల్వీ తన ‘టెన్‌ ఇయర్స్‌ విత్‌ గురుదత్‌’ అనే పుస్తకంలో రాశాడు. దీంతో గురుదత్‌ గీతాదత్‌ వైపే మొగ్గు చూపడంతో, తిరిగి ఇంటికి వచ్చిన గీత, తన భర్తపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది. ఈ సంఘటన తర్వాత గురుదత్‌ వహీదా ల మధ్య విబేధాలున్నట్లు వార్తలు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత గురుదత్‌ వహీదాకు దూరం కావడం ప్రారంభించాడు. తన భార్య ఒత్తిడితో, వహీదాకు దూరంగా ఉండడంతో గురుదత్‌ మనోవ్యధకు గురై నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపారని ‘విమల్‌ మిత్రా’ తన ‘బిచ్డే సబ్‌ బారీ బారీ’ పుస్తకంలో రాశారు. వహీదా 1974లో వివహం చేసుకోవడం ఆయనని మరింత కుంగతీసింది. ఆ తరువాత గురుదత్‌ ఆరోగ్యం క్షీణించడంతో అర్ధాంతరంగా జీవితం చాలించాడు.
వహీదా పొందిన పురస్కారాలు
ఈ ఏడాదికి గాను వహీదా రెహమాన్‌ను ‘దాదా సాహెబ్‌ ఫాల్కే లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు’ వరించింది. భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన కృషికి గుర్తుగా ఆమెకు ఈ అవార్డును 69వ జాతీయ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో అందజేయనున్నారు. అంతకుముందు వహీదా 1965లో ‘గైడ్‌’లో తన పాత్రకు ఫిలింఫేర్‌ ఉత్తమ చలనచిత్ర నటి అవార్డును పొందింది. 1968 లో నీల్‌ కమల్‌ చిత్రం లోని నటనకు ఫిలింఫేర్‌ ఉత్తమ నటి అవార్టు, 1967 లో ‘తీస్రీ కసమ్‌’ చిత్రానికి బెంగాలీ జర్నలిష్టు అసోసియేషన్‌ ఉత్తమనటి అవార్డు, 1971లో వచ్చిన ‘రేష్మా ఔర్‌ షేరా’ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డులు పొందింది వహీదా. 1972లో భారత ప్రభుత్వంచే ‘పద్మశ్రీ’, 2011లో ‘పద్మభూషణ్‌’ అందుకున్న వహీదా… 1994 లో ఫిలింఫేర్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు, 2011 లో ఐ.ఐ.ఎఫ్‌.ఎ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు, 2006 లో తన తొలిహీరో యన్టీఆర్‌ పేరిట ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వంచే యన్టీఆర్‌ జాతీయ అవార్డు, 2012 లో ముంబయి ఫిల్‌ం ఫెస్టివల్‌ లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు, 2013 లో సెంటెనరీ అవార్డు, ఇండియన్‌ ఫిలిం పెర్సనాలిటీ పురస్కారం, 2020లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నుండి రాష్ట్రీయ కిషోర్‌ కుమార్‌ సమ్మాన్‌ పురస్కారాన్ని వహీదా పొందింది.

-పొన్నం రవిచంద్ర, 9440077499