పాల బిల్లుల కోసం పాడి రైతుల ఎదురుచూపులు..

– నాగర్ కర్నూల్ జిల్లాలో రూ.5 కోట్ల బకాయిలు

నవతెలంగాణ – అచ్చంపేట 
జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామాల గ్రామాల నుంచి విజయ డైరీ పాలను సేకరిస్తుంది. కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి కేంద్రాలలో పాలశీతలికరణ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న సొసైటీల ద్వారా పాడి రైతుల నుంచి పాలు సేకరిస్తారు. అచ్చంపేట పాలశీతలీకరణ కేంద్రంలో 72 సొసైటీలు ఉన్నాయి. రోజు 1000 మంది పాడి రైతులు 13000 లీటర్ల పాలు విజయ డైరీ కి అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 150 సొసైటీలు ఉన్నాయి. నిత్యం 7500 మంది రైతులు నుంచి లక్ష లీటర్లు పాలను సేకరిస్తున్నారు. పాల బిల్లులు 15 రోజులకు ఒకసారి చెల్లించవలసి ఉంటుంది. అధికారుల సమన్వయం లోపంతో పాల బిల్లుల ఆలస్యం జరిగింది. 45 రోజులకు సంబంధించిన మూడు బిల్లులు రూ.5 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉంది. అదేవిధంగా పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం లీటర్ ధర పైన అధికంగా రూ .4 రూపాయలు చెల్లిస్తున్నారు. ప్రోత్సాహక నిధులు కూడా కొన్ని లక్షల రూపాయలు బకాయిలు ఉన్నట్లు తెలుస్తుంది.