డైరీ, టెక్స్ టైల్ రంగాలలో ఎగుమతుల కోసం చిత్తశుద్ధితో కృషి

– జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
నవతెలంగాణ సిరిసిల్ల
డైరీ, టెక్స్ టైల్ రంగాలలో ఎగుమతుల కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో  సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డిస్టిక్ లెవెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్  కమిటీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా నుంచి ఎగుమతి చేసేందుకు వీలుగా అవకాశం ఉన్న 2,3 ఉత్పత్తులను గుర్తించి వాటిని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. నాబార్డ్, ఎం.ఎస్.ఎం.ఈ లు, జాతీయ డైయిరీ డెవలప్మెంట్ బోర్డు తో సమన్వయం చేసుకుంటూ పాల ఉత్పత్తులు, సిరిసిల్ల బ్రాండ్ తో వస్త్రాలు తయారు చేసే ప్రణాళిక తయారు చేయాలని అన్నారు. వీటికి బ్రాండింగ్ కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో యాక్టివ్ గా ఉన్న ఎఫ్.పి.ఓ లకు ఎక్కువ మార్కెటింగ్ అందేలా చూడాలని అన్నారు. మన దగ్గర ఉన్న వస్త్ర పరిశ్రమ నుంచి ఎగుమతులు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించి నివేదిక అందించాలని అన్నారు.
టెక్స్ టైల్ రంగంలో ప్రపంచంలో ఎక్కడ ఎంత మేర డిమాండ్ ఉంది, ఎటువంటి వస్త్ర ఉత్పత్తులు ఎగుమతి చేయవచ్చు వంటి వివరాలను పరిశీలించాలని, చేనేత కార్మికులతో రెగ్యులర్ గా సమావేశాలు, ట్రైనింగ్ లు నిర్వహిస్తూ అవగాహన కల్పించాలని అన్నారు.  మన దగ్గర యూనిక్ సేలింగ్ పాయింట్ ఉండాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న బి.ఎం.సి పూర్తి స్థాయిలో నడిచేలా చూడాలని, దీనికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. పాడి రైతులతో సంప్రదింపులు జరిపి మన దగ్గర పాలు పోసేలా కార్యాచరణ తయారు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వి.రవీందర్ రెడ్డి, ఏ.డి. హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్ సాగర్, విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్,లీడ్ బ్యాంకు మేనేజర్ టి.ఎన్.మల్లి ఖార్జున్, టెక్స్టైల్ పార్క్ పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు అన్నల్ దాస్ అనిల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు టి.హనమంతు,ఎం.ఏ. భారతి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.