దళిత బంధు రెండో దశ ఉత్తర్వులు జారీ

– హర్షం వ్యక్తం చేసిన మంత్రి కొప్పుల
– లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలి
– కలెక్టర్లకు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పధకం రెండో విడతకు సంబందించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విధంగా ప్రతీ నియోజకవర్గంలో 1100 మందికి ఆ పధకాన్ని అమలు చేయనున్నారు. దళిత బంధు రెండో విడత ఉత్తర్వుల జారీ పట్ల రాష్ట్ర ఎస్సీ అభివృద్ది శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు లబ్ది దారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. దళితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే తొలి విడతలో ఈ పథకం ద్వారా లబ్ది పొందిన పలువురు ఉన్నత మైన జీవనం సాగిస్తున్నారని గుర్తుచేశారు. రానున్న ఎనిమిదేండ్లలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ ప్రజలు తిప్పి కొడుతున్నారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వంపై ౖ బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారనీ,ఇది ఎంత మాత్రం మంచిది కాదని హితవు పలికారు.