బీఆర్‌ఎస్‌కు దళిత బంధు గండం?

Dalit brother to BRS?– బడ్జెట్లో ఘనంగా రూ.17,700 కోట్లు కేటాయింపు
– పైసాకూడా ఖర్చుచేయని సర్కారు
– ఒక్కరికి కూడా పథకం అమలు కాని వైనం
– ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న పేదలు, దరఖాస్తుదారులు
– ఆశల పల్లకిలో ఆశావహులు
– మొదటి విడతలో కొందరికిచ్చి అందరినీ నమ్మించే ప్లాన్‌..
– ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని తెలిసినా సర్కార్‌ తాత్సారం
– అమలుకు రాష్ట్రంలోనే ఇబ్బందులు
– దేశంలో ఏటా 25 లక్షల మందికి ఇస్తామన్న కేసీఆర్‌ మాట నీటి మూటేనా?
అనుకున్నదే జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్‌ రానే వచ్చింది. కొత్త పథకాలు, ప్రారంభోత్సవాలకు బ్రేకులు పడ్డాయి. కేవలం ప్రచారం చేసుకోవడానికే తప్ప, జనాలకు , పథకాల లబ్ది చేకూర్చేందుకు దారులు మూసుకుపోయాయి. ఇంతకు ముందే ప్రవేశ పెట్టిన పథకాలు అమలు చేయవచ్చు. కానీ వాటి అమలు తీరు ఓటరును ప్రలోభపెట్టేదిగా ఉండకూడదు. అలా జరిగితే.. ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోవడం, వాటిని నిలిపేయటం ఖాయం. జనాలకు ఇక ఎన్నికలే తప్ప .. పథకాల అమలు ఉండబోదు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇప్పుడు చర్చలోకి వస్తున్న పథకం.. దళితబంధు. మొదటి విడతగా తూతూ మంత్రంగా కొంత మందికి ఇచ్చి దీనిపై పెద్ద ప్రచారం చేశారు. రెండో విడతకు లిస్టు రెడీ అయ్యింది. ఎంక్వైరీ పూర్తయ్యింది. కలెక్టర్‌ వద్దకు ఫైనల్‌ లిస్టు చేరింది. కానీ ప్రభుత్వం నిధులు మాత్రం విడుదల చేయకుండా జాప్యం చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందని సర్కారుకు తెలిసి కూడా దీన్ని పెండింగ్‌లో పెట్టింది?. ఎందుకు? నిధుల లేమీ కారణమా?.. ఒకవేళ రెండో లిస్టు ఇస్తే చాలా మంది రాని వాళ్ల నుంచి వ్యతిరేకత వస్తుందనా?. దీంతో ఇది పెండింగ్‌లో పెట్డడమే మేలనుకున్నారా?. ఇత్యాది అనుమానాలు, ప్రశ్నలు లబ్దిదారుల్లో వ్యక్తమవుతున్నాయి.
బీఆర్‌ఎస్‌పై గుర్రు..
పథకం ప్రవేశపెట్టి సరిగ్గా నేటికి 26 నెల్లయింది. ప్రభుత్వం కొండంత ప్రచారం చేసుకుంది. ఇచ్చింది మాత్రం 38,323 మందికి మాత్రమే. ఆ తరువాత ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం ఘనంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1,29,800 మందికి ఈ ఏడాది పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించింది. బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో ఒక్కరంటే ఒక్కరికి కూడా దళిత బంధు పథకాన్ని అమలు చేయలేదు. పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. తృణమో..ఫణమో అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమర్పించుకుని లబ్దిపొందాలని ఆశపడ్డారు. కానీ..ప్రభుత్వం వ్యూహాత్మకంగానే సాధారణ ఎన్నికల వరకు సాగదీసిందని వాపోతున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులపై దళితులు గుర్రుగా ఉన్నారని తెలుస్తున్నది.
సీఎం మాటలు నీటి మూటలేనా?
సీఎం కేసీఆర్‌ దళితులను మభ్యపెట్టేందుకు మాయ మాటలు చెబుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళిత బంధు పథకంపై ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ‘దళిత జాతి బిడ్డలు ఎవరి కోసం వివక్ష అనుభవించాలి. ఎన్నేళ్లు అనుభవించాలి. అందుకే పుట్టింది తెలంగాణలో దళితబంధు పథకం. భారత దళిత జాతికి నేను పిలుపు ఇస్తున్నా. తెలంగాణ దళిత బంధు పథకాన్ని ఏడాదికి 25 లక్షల కుటుంబాల చొప్పున దేశమంతా అమలు చేయాలి. మీరు చేయకపోతే మేం చేసి చూపిస్తాం’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోనే పథకం అమలుకు చిత్తశుధ్దిని ప్రదర్శించకుండా.. దేశవ్యాప్తంగా అమలు చేస్తామని బీరాలు పలికారు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులకు గండంగా మారింది.
ఆరంభ శూరత్వమే..
ఉప ఎన్నిక నేపథ్యంలో 2021 జూలైలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. ఆ నియోజకవర్గంలో అప్పట్లో సంతప్త స్థాయిలో అందరికీ అమలు చేశారు. అదే ఏడాది ఆగస్టులో సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రిలోనూ 75 మందికి అందించారు. ఆ తర్వాత, రాష్ట్రం నాలుగు దిశల్లో అమలు పేరిట ఖమ్మం, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ నియోజక వర్గాలైన మధిరలోని చింతకానికి రూ.100 కోట్లు, తుంగతుర్తిలోని తిరుమలగిరి మండలానికి రూ.50 కోట్లు, అచ్చంపేటలోని చారగొండ మండలానికి రూ.50 కోట్లు, జుక్కల్‌లోని నిజాంసాగర్‌ మండలానికి రూ.50 కోట్ల చొప్పున ఆయా జిల్లాల కలెక్టర్ల అకౌంటుకు బదిలీ చేసింది. దీంతో ఆయా మండలాల్లో మొత్తం 4,808 మందికి పథకం అందింది. అనంతరం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో దశల వారీగా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కానీ ఎక్కడా అమలు చేయలేకపోయారు.