బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు :మేడే రాజీవ్ సాగర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో దళితులు, మైనార్టీలకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. ఆయా వర్గాల పట్ల బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలిలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మెన్ ఎస్.కె.మహమూద్ లను శాలువతో సత్కరించిన రాజీవ్ సాగర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనేందుకు పేద దళిత కుటుంబంలో పుట్టిన లింబాద్రి ఉదాహరణ అని కొనియాడారు. దేశంలోని దళితులు, మైనార్టీలపై దాడులు ఆగాలన్నా… వారి ప్రాధాన్యత పెరగాలన్నా కేసీఆర్ లాంటి మహౌన్నత నాయకుడు దేశానికి నేత కావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఓయూ జెఎసీ చైర్మెన్ మందాల భాస్కర్, మాల మహానాడు నాయకులు బత్తుల రాంప్రసాద్, విజరు కుమార్, భారత జాగృతి ఓయూ నేత శేఖర్, లింగం, గోవింద్, శ్రీనివాస్, సారంగపాణి, కృష్ణ తదితరులు ఉన్నారు.