డా||ఎం. పురుషోత్తమాచార్యగా పరిచితులైన ముడుంబై పురుషోత్తమాచార్యులు నేటి సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్‌లో 1948లో జన్మించారు. శ్రీమతి మంగతాయారు, శ్రీమాన్ ముడుంబై వేంకట నరసింహాచార్యులు వీరి తల్లిదండ్రులు. రచయితగానే కాక సంగీతజ్ఞులుగా శాస్త్రీయ సంగీతాన్ని అధ్యయనం చేసిన వీరు గత నలభై ఏండ్లుగా ప్రతి నెలా 16వ తేదీన ‘అన్నమయ్య సంకీర్తన సభ’ నిర్వహిస్తున్న భక్తాగ్రేసరులు. చందాల కేశవదాసు రచనలపై ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పి.హెచ్‌డి పరిశోధన చేసి తొలి తెలుగు సినీ గీతకారుడు చందాల కేశవదాసుయే అని ప్రమానికంగా పనిచేసిన వీరు విద్యార్థి దశలోనే సాహిత్య సృజన ప్రారంభించారు. సాగర సత్తయ్య చెప్పిన ప్రకారంగా 1960న దశకంలోనే బాల రంగస్థల నటులుగా నటించి ప్రశంసలు పొందారు.
సంగీతం, సాహిత్యం రెంటిని సమానంగా ప్రేమిచే పురుషోత్తమాచార్యులు పద్య నాటక ప్రియులు. తాను స్వయంగా పద్యనాటకాలు రచించి వేదికలపైన ప్రదర్శనలు జరిపించారు. వీరి నాటకాల్లో ‘రాదికా మధవం, హరి సంకీర్తనాచార్య, శ్రీ సుదర్శన ప్రభావం, విముక్త సీత, వరూధిని, ప్రభావతి, మహాభక్త శబరి, నీలవేణి నాదయోగి, ప్రబంధ రాయబారం’ ప్రసిద్ధమైనవి.
కావ్యకర్తగానే కాక కార్యకర్తగా కూడా ప్రసిద్ధులు. త్యాగరాజ ఉత్సవ సమితి కార్యదర్శిగా, అన్నమాచార్య సంకీర్తనా ప్రచార సమితి అధ్యక్షులుగా, ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ బాధ్యులుగా అన్ని సంస్థల ద్వారా వీరు జరిపిన కార్యక్రమాల సంఖ్య మూడు వేల పైచిలుకే అంటే అతిశయోక్తి కాదు.
కావ్యకర్తగా వీరు రాసిన గ్రంథాలు ‘సరాగాలు’ పాటలు, ‘విరిమువ్వలు’ వచన కవిత్వం, ‘రసానంది’ నాటకాల సంపుటి, ‘జోగులాంబ సంకీర్తనలు, వారిజాల వేణుగోపాలస్వామి సుబ్రభాతం, అవిసెపూలు’ వచన కవిత్వం. ‘ప్రపంచ విలాసం’ మినీ కవితలు. ‘రహస్య భూతం’ పద్యకావ్యం, ‘తేనె తెరలు’ కథా సంపుటితో పాటు నవల కూడా రాశారు. ఇవే కాక ‘గీతల్లో గీత’ పేరుతో పద్యాలు రాశారు. సంస్కృత నీతి శాస్త్రానికి ‘ముత్యాల కొలను’ పేరుతో అనువాద గ్రంథం ప్రచురించారు. ముఖ్యంగా సింహగిరి నరహరి వచనలను కీర్తనలుగా అందించిన సంకీర్తనా కర్త.
తెలుగు ఉపాధ్యాయులుగా పదవతరగతి పాఠ్యాంశ కథలు, తెలంగాణ పాఠ్యాంశ కథలు – విశేషాంశాలు కూర్చిన పురుషోత్తమాచార్యులు బాల బాలికలకు సంగీత మాస్టారుగా పాఠాలు చెబుతూనే పలు ఆడియో, వీడియో చిత్రాలకు, క్యాసెట్లకు సంగీత దర్శకత్వం వహించారు. నందినాటకోత్సవాలకు న్యాయనిర్ణేతలుగా వున్నారు. సాహిత్యంలో లలిత సంగీతంలో అనేక పురస్కారాలు అందుకున్నారు. వాటిలో త్యాగరాజ నాట్యకళాపరిషత్తు, ద్వానాశాస్త్రి ఉత్తమ పరిశోధన పురస్కారం, నంది నాటక పోటీల్లో ఉత్తమ నంది పురస్కారం, తెలుగు విశ్వ విద్యాలయం సాహిత్య పురస్కారం, సముద్రాల అవార్డు వంటివి వున్నాయి.
విద్యార్థుల కోసం అనేక రచనలు చేసిన పురుషోత్తమాచార్యులు అనేక సందర్భాల్లో పాఠశాల వేదికలపై వాటిని ప్రదర్శింపజేశారు. ‘మేకపిల్ల’ వర్ణమాలతో పాటు బాలల కోసం నాటికలు రాశారు. రేడియోలో పిల్లలతో ‘బాల విహార్’ పేర ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ నేపథ్యంలోనే పిల్లల కోసం ఇటీవల ప్రచురించిన బాలగేయ సంపుటి ‘వెన్నెల కుప్పలు’. తరాలు మారినా సాంకేతికంగా ఎదిగినా మనిషి మూలతత్వపు సంస్కృతి మారదని నమ్మి ఈ గేయాలను రాశారు కవి. లలిత సంగీతమర్మం తెలిసిన ఆచార్యులవారు గేయాలను అంతే లలితంగా రాస్తారు.
‘అమ్మ వచ్చింది/ అన్నం తెచ్చింది/ అరిటాకు వేసింది/ అందరికన్నం పెట్టింది” అంటూ అన్నం పెట్టే అమ్మతత్వాన్ని చెప్పినా, ‘ఈత బాగా నేర్చుకో/ ఈదుకుంటూ పాడుకో/ ఈతచాప చక్కనిది/ ఈలపాట తియ్యనిది’ అని చెప్పినా ఆయనకే చెల్లింది.
‘రంకెలు వేయును ఎద్దు/ రంగులు ఇంటికి అద్ద్దు/ వంకర మాటలు అనొద్దు/ వంకాయ అతిగా తినొద్దు” అంటూ అంత్యప్రాసలతో పిల్లలకు ఆసక్తి కలిగేలా రాయడమేకాక, మాతృభాష గొప్పతనాన్ని చెబుతూ హిందీకో సీఖ్‌లేనా/ తెలంగ్‌కో భూల్ న కర్‌నా/ భాషా కిసీకి బోల్నా/ భావార్థ్ ఏక్ హీ హోనా’ అంటారు. అంతటితో ఆగక ‘చావల్‌కో బోల్తే బియ్యం/ సైతాన్‌కో బోల్తే దయ్యం’ అంటూ ఆసక్తిని రేకెత్తించేలా రెండు భాషల పదాలను పరిచయం చేస్తారు.
చేయీ చేయీ కలుపుకుని/ చెట్టాపట్లాలేసుకునీ/ వడివడిగా బడికెళదాం/ పచ్చని మొక్కలు నాటుదాం’ అని చాటిన కవి ఊరుని, బడిని పచ్చగా వుంచుదామని చెబుతారు. అంత్యప్రాసలు, లయ వీరి ప్రతి గేయంలో కనిపించి బాలలను ఇట్టే ఆకర్షిస్తాయి. అటువంటిదే ‘కుక్కపిల్ల జానీ/ చేపపిల్ల సోనీ/ కోడిపిల్ల టోనీ/ రాండి నేను షైనీ’ గేయం. తెలంగాణ జానపదం, జాబిలి పాటల శైలిలోనూ చక్కని గేయాలు బాలల కోసం రాశారు పురుషోత్తమాచార్యులు. ‘బడికి వెళ్లడం ఎందుకు’ గేయంలో ‘మొక్కలు నాటేదెందుకు, ఆవును పెంచేదెందుకు, ఆటలు ఆడేదెందుకు’ అంటూ చక్కని అంశాలను గేయాలుగా మలిచారు కవి. సినీ విమర్శలో జాతీయ పురస్కారం అందుకున్న డా||ముడుంబై పురుషోత్తమాచార్యులు బాల సాహిత్యంలోనూ మరిన్ని రచనలు తేవాలని కోరుతూ అభినందనలు. జయహో బాలసాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్
9966229548