అన్నదాతలపై దమనకాండ అప్రజాస్వామికం

– టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్ 
– వెంటనే పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్
– రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే
నవతెలంగాణ – పెద్దవంగర: దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై దమనకాండ అప్రజాస్వామికమని టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు సోమారపు ఐలయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర వెంటనే ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశానికి వెన్నుముక అయిన రైతన్నలు శాంతియుతంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో చేపట్టిన నిరసన సమ్మె లో రైతులపై అత్యంత పాశవికంగా లాఠీఛార్జ్ చేస్తూ, బాంబుల వర్షం కురిపిస్తూ, నీటి ఫిరంగులు వదలడం సిగ్గుచేటు అన్నారు. ఈ ఘటనకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమే పూర్తి బాధ్యతత వహించాలని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ఆరేళ్ళ కాలంలో పేద వాడిని ఇంకా పేద వాడిగానే ఉండే విధంగా చేస్తూ, సంపన్నులను ఇంక సంపన్నులను చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలను తెచ్చి వారికి తీవ్ర నష్టం జరిగే విధంగా పాలన కొనసాగిస్తూ ఉంటే అట్టి చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. రైతాంగ సమస్యలపై ఢిల్లీ నలుమూలల నుండి రైతులు అనేక ఇబ్బందులను అధిగమించి ఢిల్లీ కార్యక్రమానికి వస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించకుండా, ఉగ్రవాదుల మీద జరిపే దాడుల విధంగా రైతులపై దాడులు నిర్వహిస్తూ కార్పొరేట్ శక్తులకు తొత్తుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతులపై నిర్బంధం పెంచి అక్రమ కేసులు పెడ్తూ కిసాన్ ఉద్యమాన్ని క్రూరత్వంగా అణగదొక్కాలని చూస్తున్న ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. రైతులు తిరగబడితే మీ అధికార పునాదులు కదులుతయని హెచ్చరిస్తూ, రైతులపై వివక్ష చూపకుండా శాంతియుతంగా వెంటనే కిసాన్ సమస్యల పరిష్కారం కోసం వారి డిమాండ్లను కాలయాపన చేయకుండా, చర్చల ద్వారా నాన్చకుండా రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, పండించిన పంటకు రైతులు నేరుగా మద్దతు ధరతో అమ్ముకునే విధంగా, మరియు విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటూ వెంటనే విలువలతో కూడిన గ్యారెంటీ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని అన్నారు. గతంలో రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పడంతోనే రైతులు మరో మారు రోడ్డు మీదకు వచ్చారని అన్నారు. రైతులు అనేక తిప్పలు పడి అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తుంటే ఆ పంటలపై అతివృష్టి, అన్నావృష్టి ,రకరకాల వైరస్ లు,నకిలీ విత్తనాలు,కల్తీ ఎరువుల తో సరైన దిగుబడి రాక,వచ్చిన పంటలకు మద్దతు ధర లేక మార్కెట్ లో అమ్మబోతే వ్యాపారులు సిండికేట్ గా మారి తక్కువ ధరలకే కొనడం తో ఏమి చేయలేని స్థితిలో రైతులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.