– కేంద్రానికి లొంగిపోయిన జాతీయ మీడియా
– ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన వారికి వేధింపులు
– రాజ్యాంగం అమలుకు పెరుగుతున్న సవాళ్లు : నార్ల వెంకటేశ్వరరావు పురస్కార ప్రదాన సభలో పాలగుమ్మి సాయినాథ్
గుంటూరు : కనీస మద్దతు ధర చట్టం కోసం రైతులు చేస్తోన్న ఆందోళనలపై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పాశవికమైన దమనకాండకు పాల్పడుతోందని ప్రముఖ జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. గుంటూరులోని కొరటాల భవన్‌లో అంబేద్కర్, జాషువా, ఫూలే, పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్టు నార్ల వెంకటేశ్వరరావు పురస్కారాన్ని ఆదివారం రాత్రి పాలగుమ్మి సాయినాథ్‌కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఫౌండేషన్ అధ్యక్షులు బి.విల్సన్ అధ్యక్షత వహించారు. సాయినాథ్ మాట్లాడుతూ హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తోన్న తీరు సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం డ్రోన్ల ద్వారా మూకుమ్మడిగా భాష్పవాయువు గోళాలు ప్రయోగిస్తుంటే రైతుల పిల్లలు వీటిని తెలివిగా గాలిపటాల ద్వారా అడ్డుకున్నారని వివరించారు. ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న రైతుల ఉద్యమంపై జాతీయ మీడియా ఫోకస్ చేయడం లేదని, ఒక్క పత్రికలో కూడా కనీసం ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఒక్క ఎడిటోరియల్ కూడా రాలేదని అన్నారు. రైతులపై కేంద్ర బలగాలు కనీవినీ ఎరుగని రీతిలో దాడులకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. అన్నదాతలపై ప్రభుత్వం డ్రోన్లు, వైమానిక దాడులు చేయడం అత్యంత పాశవికమని తెలిపారు. ఇతర దేశాల టెర్రరిస్టులపై ప్రయోగించాల్సిన డ్రోన్లు, వైమానిక దాడులు మన దేశ రైతులపై ప్రయోగించడం శోచనీయమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి జాతీయ మీడియా, కార్పొరేట్ మీడియా దాసోహం అనడం వల్ల ప్రజా సమస్యలు వెలుగులోకి రావడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర పాలకులు సమాజాన్ని మత, కుల పరంగా విభజిస్తున్నారని విమర్శించారు. దేశంలోని అన్ని స్వతంత్ర ప్రభుత్వ వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారని వివరించారు. దేశంలో పత్రికా వ్యవస్థ అంబానీ గుప్పెట్లోకి వెళ్లి పోయిందన్నారు. పంజాబ్ మొత్తం జీడీపీ కన్నా అంబానీ సంపద ఎక్కువని, హర్యానా జీడీపీ కన్నా అదానీ ఆస్తులే ఎక్కువని వివరించారు. సుప్రీంకోర్టులో చాలాకాలం తరువాత మంచి తీర్పు వచ్చిందంటూ ఎలక్టోరల్ బాండ్ల రద్దు తీర్పును ప్రస్తావించారు. అయితే, తీర్పులో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. ప్రతిపక్షాలకు ఎవరి నుంచీ విరాళాలు అందకుండా కట్టడి చేయడంలో భాగంగానే ఎలక్ట్రోరల్ బాండ్లను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. గత ఐదేండ్లలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో కేంద్రానికి అనుకూలంగా ఉన్నవే ఎక్కువగా వస్తున్నాయని, దీంతో, వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో కేంద్రం కోర్టులో అనేక తప్పుడు అఫిడవిట్‌లు దాఖలు చేసిందన్నారు. 2020 మార్చి 31న వలసదారులు ఎవ్వరూ రోడ్లపై నడిచి వెళ్లడంలేదని తప్పుడు సమాచారం ఇచ్చిందని తెలిపారు.
లక్షలాది మంది రోడ్లపై వెళ్తున్నా చాలా తక్కువగా చూపే ప్రయత్నం కేంద్రం చేసిందన్నారు. కరోనా వల్ల 2022 మార్చి నాటికి 5.22 లక్షల మంది మాత్రమే చనిపోయారని ప్రధాని మోడీ ప్రకటించగా, ఇంతకంటే పది రెట్లు ఎక్కువగా మరణాలు సంభవించారని అంతర్జాతీయ జర్నల్స్, డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించాయని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, సరయూ నదుల్లో వేలాది మంది మృతదేహాలు కొట్టుకొచ్చినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. దైనిక్ భాస్కర్ పత్రిక వాస్తవాలు ప్రచురిస్తే, వెంటనే ఆ పత్రికపై ఈడీ, సీబీఐ, ఇన్‌కంట్యాక్సు దాడులు జరిగాయని తెలిపారు.
అనంతరం సుప్రసిద్ధ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు పురస్కారాన్ని పి.సాయినాథ్‌కు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు, బీసీకే పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు జయసుధ, ఎండి అక్బర్‌బాబు, ప్రముఖ గాంధేయవాది అనిల్ నౌరియా తదితరులు పాల్గొన్నారు.